
పాకిస్తాన్‌కు అమెరికా మళ్లీ వార్నింగ్
భారత్‌లో దాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని..
వాషింగ్టన్ : భారత్‌లో దాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని పాకిస్తాన్‌ను అమెరికా కోరినట్టు వైట్‌హౌస్ సీనియర్ అధికారి తెలిపారు. ఇరు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ఓ వైపు దాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమన్న భారత్ వాదన అర్థవంతమైనదన్నారు.
ముంబయి, పఠాన్‌కోట్ సహా భారత్‌లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారిపై చర్యలు చేపట్టాలని తాము పాక్‌ను కోరామని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ పూర్తిగా అణిచివేయాలని అన్నారు. భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న ట్రంప్ పాలసీపై మీడియా వివరణ కోరగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.