సూపర్–8కు చేరిన ఆతిథ్య జట్టు
లీగ్ దశలో నిష్క్రమించిన మాజీ విజేత
వర్షంతో ఐర్లాండ్, అమెరికా మ్యాచ్ రద్దు
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.
గత రెండు టి20ల్లో వరల్డ్ కప్‌లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్‌తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్‌లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్‌పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్‌తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్‌లో పాక్ ఆట ముగిసింది.
లాడర్‌హిల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు.
పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment