
తొలి మ్యాచ్‌లో భారీ విజయం
107 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు
రికెల్టన్ సెంచరీ
బవుమా, మార్క్‌రమ్, డసెన్ అర్ధ శతకాలు
రాణించిన సఫారీ పేసర్లు
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది.
శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్‌రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు.
మూడు అర్ధ సెంచరీలు...
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు.
రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్‌రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది.
రహ్మత్ షా మినహా...
భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్‌రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్‌గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 13; రషీద్ (సి) మార్క్‌రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్‌గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1.
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
ఆ్రస్టేలియా X ఇంగ్లండ్
వేదిక: లాహోర్
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment