ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్‌ సంచలనం | Afghanistan Young Spin Sensation AM Ghazanfar Ruled Out Of Champions Trophy | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్‌ సంచలనం

Published Wed, Feb 12 2025 11:13 AM | Last Updated on Wed, Feb 12 2025 11:59 AM

Afghanistan Young Spin Sensation AM Ghazanfar Ruled Out Of Champions Trophy

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) స్పిన్‌ సంచలనం అల్లా ఘజన్‌ఫర్‌ (AM Ghazanfar) త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి (Champions Trophy) దూరమయ్యాడు. 18 ఏళ్ల ఈ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్‌ఫర్‌కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్‌ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 

ఘజన్‌ఫర్‌ ఐపీఎల్‌ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఘజన్‌ఫర్‌కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్‌ సెలెక్టర్లు. లెఫ్ట్‌ ఆర్మ స్పిన్నర్‌ అయిన ఖరోటే ముందుగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో (ఛాంపియన్స్‌ ట్రోఫీ) ట్రావెలింగ్‌ రిజార్వ్‌గా ఉన్నాడు. 

20 ఏళ్ల ఖరోటే ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున 7 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఘజన్‌ఫర్‌ విషయానికొస్తే.. ఈ మిస్టరీ స్పిన్నర్‌ ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున 11 వన్డేల్లో 21 వికెట్లు.. ఓ టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఘజన్‌ఫర్‌ లేని లోటు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు..
హష్మతుల్లా షాహిది (కెప్టెన్‌), రహమత్ షా (వైస్‌ కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్‌), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్‌ అహ్మద్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ, నవీద్‌ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రయాణం ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-బిలో పోటీపడుతుంది.

2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌, దుబాయ్‌ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లు..
ఫిబ్రవరి 21న సౌతాఫ్రికాతో
ఫిబ్రవరి 26న ఇంగ్లండ్‌తో
ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement