
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అంచనాలకు మించి రాణిస్తుంది. ఆఫ్ఘన్లకు ఇది అరంగేట్రం ఎడిషనే (ఛాంపియన్స్ ట్రోఫీలో) అయినా.. ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. దాయాది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నారు. ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో (సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి) తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు.
వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (Sediqulla Atal) (95 బంతుల్లో 85), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (Azmatulla Omarzai) (63 బంతుల్లో 67) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్‌ను గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్ (22), వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.
అనంతరం జద్రాన్‌ను అద్భుతమైన బంతితో ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. తర్వాత బరిలోకి దిగిన రహ్మత్ షా (12) కొద్దిసేపు నిలకడగా ఆడాడు. బౌండరీ కొట్టి జోష్ మీదున్న షాను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. అనంతరం అటల్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (20) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.
వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే సెదిఖుల్లా దురదృష్టవశాత్తు సెంచరీకి ముందు ఔటై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు నీరుగార్చాడు. సెదీఖుల్లా క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు.
సెదిఖుల్లా ఔటైన కొద్ది సేపటికే హష్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4) కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితం అయ్యేలా చేసింది. ఈ దశలో గత మ్యాచ్ హీరో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ విజృంభించాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్‌ను 270 దాటించాడు. మధ్యలో రషీద్ ఖాన్ (19) కూడా తన స్టయిల్‌లో విరుచుకుపడ్డాడు.
మొత్తానికి సెదీఖుల్లా, ఒమర్‌జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment