
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేదు. ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది.
అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్‌రేట్ మైనస్‌లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!
క్రిక్‌బజ్ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకెండ్ బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్ 300 పరుగులు అనుకుంటే).
ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరుకుంటుంది.
కాగా, గ్రూప్-ఏ నుంచి ఇదివరకే సెమీస్ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి మరో మ్యాచ్ జరగాల్సి ఉన్నా భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరుగుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్‌జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (20) ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. షార్ట్ వికెట్ ఒమర్‌జాయ్‌కు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment