
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy) గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు (Rain Stopped The Play) తగిలాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తై.. ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది.
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ పైచేయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 37.1 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. వర్షం ఎంతకీ తగ్గక ఈ మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించాల్సి వస్తే ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుంది. ఆసీస్ వర్షం ముప్పును ముందే పసిగట్టి ఛేదనను ధాటిగా ప్రారంభించింది.
ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఈ రెండు క్యాచ్‌ల్లో ఒకటి ట్రవిస్ హెడ్‌ది ఉంది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తప్పక గెలవాలి. ఓడిపోయినా లేక ఫలితం రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరకుంటాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
సెదిఖుల్లా, ఒమర్‌జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment