
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇవాళ (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan).. ఓ సారి ఛాంపియన్ (1998) సౌతాఫ్రికాను (South Africa) ఢీకొట్టనుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో ఎదురెదురుపడ్డాయి. యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్‌లో సౌతాఫ్రికాకు శృంగభంగం జరిగింది. ఆ సిరీస్‌ను సౌతాఫ్రికన్లు 1-2 తేడాతో కోల్పోయారు. దీనికి ముందు ఇరు జట్లు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. 3 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, 2 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.
గతంలో పోలిస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఫుల్ మెంబర్ టీమ్‌తో బరిలోకి దిగింది. అలాగని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్లు పటిష్టమైన జట్లకు షాకిచ్చారు.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, కొర్బిన్ బాష్, రస్సీ వాన్ డర్ డస్సెన్
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలీఖిల్, నవీద్ జద్రాన్, నంగేయాలియా ఖరోటే
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు రసవత్తరంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు.
Comments
Please login to add a commentAdd a comment