
గాయంతో తప్పుకున్న దక్షిణాఫ్రికా పేసర్
జొహన్నెస్‌బర్గ్: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న రెండు రోజులకే పేసర్ ఆన్‌రిక్ నోర్జే కథ మారింది! వెన్ను నొప్పి గాయంతో అతను ఈ టోరీ్నకి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. సోమవారం ప్రకటించిన టీమ్‌లో నోర్జే పేరు కూడా ఉంది. ఫిట్‌గా ఉన్నాడని సెలక్టర్లు నోర్జేను ఎంపిక చేయగా... స్కానింగ్‌తో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. టోర్నీ ప్రారంభమయ్యే లోగా అతను కోలుకునే అవకాశం లేదని తేలింది.
గత ఆరు ఐసీసీ టోర్నీల్లో మూడు సార్లు అతను గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఇప్పుడు మరో వన్డే టోర్నీకి దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో జరిగిన మూడు టి20 వరల్డ్ కప్‌లు (2021, 2022, 2024)లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. నోర్జే స్థానంలో మరో ఆటగాడి పేరును దక్షిణాఫ్రికా ఇంకా ప్రకటించలేదు.