
9న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో ‘ఢీ’కి రెడీ
రెండో సెమీఫైనల్లో 50 పరుగులతో దక్షిణాఫ్రికాపై జయభేరి
‘శత’క్కొట్టిన రచిన్, విలియమ్సన్
మిల్లర్ మెరుపు సెంచరీ వృథా
టోర్నీకి ముందు... మూడు దశాబ్దాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీ భాగ్యం దక్కించుకున్న పాకిస్తాన్... ఎంతో మురిపెంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను పిలిచి కనుమరుగైన ముక్కోణపు టోర్నీతో సన్నాహక సమరంలో పాల్గొంది.
ఫైనల్‌కు ముందు... టైటిల్ పోరుకుముందే పాకిస్తాన్‌లో ఆతిథ్యం ముగిసింది. రెండో సెమీఫైనల్‌తోనే వారి ఐసీసీ ఈవెంట్ ముచ్చట తీరింది. ఇక ఓవర్ టు దుబాయ్! పాక్ సన్నాహక టోర్నీ పెడితే ట్రోఫీ గెలిచి మరీ సన్నద్ధమైన న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీపైనే కన్నేసింది.
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ గర్జించింది. ముందు బ్యాటింగ్‌లో... తర్వాత బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా జట్టును కుదేలు చేసింది. రెండు మాజీ చాంపియన్ జట్ల మధ్య బుధవారం జరిగిన సెమీఫైనల్లో 2000 టోర్నీ విజేత కివీస్ 50 పరుగుల తేడాతో 1998 చాంపియన్ దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీస్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (37 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఓడింది.
మిల్లర్ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్, కెపె్టన్ బవుమా (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (66 బంతుల్లో 69; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దుబాయ్‌లో ఈ నెల 9న ఆదివారం జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ’ ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ ఆడుతుంది.
ఇటు రచిన్, అటు విలియమ్సన్
టాప్–4 బ్యాటర్లు ఆడితే స్కోరు ఏ రకంగా జోరందుకుంటుందో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. మొదట ఓపెనర్లు విల్ యంగ్ (23 బంతుల్లో 21; 3 ఫోర్లు), రచిన్ రవీంద్ర 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. యంగ్ అవుటయ్యాక వచ్చిన విలియమ్సన్‌తో రచిన్ సమన్వయం న్యూజిలాండ్ భారీస్కోరుకు బాట వేసింది. సఫారీలాంటి మేటి బౌలర్లపై ఇద్దరూ సులువుగా షాట్లు బాదారు. అలుపు లేకుండా పరుగులు రాబట్టారు.
47 బంతుల్లో రచిన్, 61 బంతుల్లో విలియమ్సన్ ఫిఫ్టీలు చేశారు. ఇద్దరి బ్యాటింగ్ ప్రతాపంతో స్కోరుబోర్డు పరుగు పెట్టింది. 93 బంతుల్లో రచిన్ శతకం పూర్తవగా, 32వ ఓవర్లో జట్టు 200 స్కోరు చేసింది. ఎట్టకేలకు రచిన్‌ను రబడ అవుట్ చేసి రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
మిచెల్ కూడా ధాటిగా పరుగులు సాధించడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. విలియమ్సన్ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని కాసేపటికి నిష్క్రమించాడు. 40 ఓవర్లలో 250 పరుగులు చేసిన న్యూజిలాండ్ చివరి 10 ఓవర్లలో 112 పరుగుల్ని చకచకా జత చేసింది.
మిల్లర్ 100 నాటౌట్
ఓపెనర్ రికెల్టన్ (17) ఆరంభంలోనే అవుట్ కాగా... కెపె్టన్ బవుమా, డసెన్‌లు చక్కగా ఆడటంతో ఒకదశలో సఫారీ స్కోరు 125/1. లక్ష్యానికి సరైన దిశగా కనిపించింది. కానీ అదే స్కోరుపై బవుమా, కాసేపయ్యాక డసెన్, క్లాసెన్ (3), మార్క్‌రమ్ (29 బంతుల్లో 31; 3 ఫోర్లు)లు నిష్క్రమించడంతో 200 స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో ఒకేఒక్కడు మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు.

ముల్డర్ (8), యాన్సెన్ (3)ల అండలేక అతని పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది కానీ జట్టును గెలిపించలేకపోయింది. 46 ఓవర్లలో సఫారీ స్కోరు 259/9. అప్పటికి మిల్లర్ (47 నాటౌట్) ఫిఫ్టీ కూడా చేయలేదు. కానీ చివరి 4 ఓవర్లలో 53 పరుగులు చేస్తే ఆ పరుగులన్నీ అతనే బాదడం... 67 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) మార్క్‌రమ్ (బి) ఇన్‌గిడి 21; రచిన్ (సి) క్లాసెన్ (బి) రబడ 108; విలియమ్సన్ (సి) ఇన్‌గిడి (బి) ముల్డర్ 102; మిచెల్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 49; లాథమ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (నాటౌట్) 49; బ్రేస్‌వెల్ (సి) రికెల్టన్ (బి) ఇన్‌గిడి 16; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–48, 2–212, 3–251, 4–257, 5–314, 6–360. బౌలింగ్: యాన్సెన్ 10–0–79–0, ఇన్‌గిడి 10–0–72–3, రబడ 10–1–70–2, ముల్డర్ 6–0–48–1, కేశవ్ మహరాజ్ 10–0–65–0, మార్క్‌రమ్ 4–0–23–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) బ్రేస్‌వెల్ (బి) హెన్రీ 17; బవుమా (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 56; డసెన్ (బి) సాంట్నర్ 69; మార్క్‌రమ్ (సి అండ్ బి) రచిన్ 31; క్లాసెన్ (సి) హెన్రీ (బి) సాంట్నర్ 3; మిల్లర్ (నాటౌట్) 100; ముల్డర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 8; యాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫిలిప్స్ 3; కేశవ్ (సి) లాథమ్ (బి) ఫిలిప్స్ 1; రబడ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 16; ఇన్‌గిడి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 312. వికెట్ల పతనం: 1–20, 2–125, 3–161, 4–167, 5–189, 6–200, 7–212, 8–218, 9–256. బౌలింగ్: హెన్రీ 7–0–43–2, జేమీసన్ 7–1–57–0, రూర్కే 8–0–69–0, బ్రేస్‌వెల్ 10–0–53–1, సాంట్నర్ 10–0–43–3, రచిన్ రవీంద్ర 5–0–20–1, ఫిలిప్స్ 3–0–27–2.
Comments
Please login to add a commentAdd a comment