
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. తొలుత రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాత కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ శతక్కొట్టాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది.
సెంచరీల అనంతరం రచిన్ (108), కేన్ (102) ఇద్దరూ ఔటయ్యారు. 45 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 296/4గా ఉంది. డారిల్ మిచెల్ (48), గ్లెన్ ఫిలిప్స్ (9) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, ఎంగిడి, ముల్దర్ తలో వికెట్ పడగొట్టారు.
48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమం
నేటి మ్యాచ్‌లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్‌లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు (ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లు)
విరాట్ కోహ్లి-82
జో రూట్-53
రోహిత్ శర్మ-49
కేన్ విలియమ్సన్-48
స్టీవ్ స్మిత్-48
హ్యాట్రిక్ సెంచరీలు
వన్డేల్లో సౌతాఫ్రికాపై కేన్ మామకు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఏ జట్టుపై అయినా వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సనే. సౌతాఫ్రికాపై వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ కూడా విలియమ్సనే. ఐసీసీ టోర్నీల్లో (వన్డేలు) రచిన్ రవీంద్ర (5) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ కూడా విలియమ్సనే (4).
19000 పరుగుల క్లబ్‌లో కేన్.. తొలి న్యూజిలాండ్ ప్లేయర్
ఈ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా 16వ ఆటగాడు
అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్‌నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment