సౌరభ్ నేత్రావల్కర్ ఆసక్తికర నేపథ్యం
అమెరికాను గెలిపించిన భారత ప్లేయర్
డాలస్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ను అద్భుతంగా బౌల్ చేసి అమెరికాను గెలిపించిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌కు చెందిన అతను చదువు, ఉద్యోగరీత్యా యూఎస్‌కు వెళ్లి ఇప్పుడు తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న తమ టీమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2013లో తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, వసీం జాఫర్ ఆ మ్యాచ్‌లో అతని సహచరులు. అయితే ఎన్నో ఆశలతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతనికి అదే చివరి రంజీ మ్యాచ్ కూడా అయింది. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, అవిష్కార్ సాల్వి, ధావల్ కులకరి్ణలాంటి పేసర్లు ఉన్న ముంబై టీమ్‌లో అతనికి చోటు దక్కడం కష్టమైపోయింది. అంతకు మూడేళ్ల క్రితమే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడి భారత్ తరఫున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అయితే అతను ఆశించినట్లుగా దేశవాళీ కెరీర్ ఊపందుకోకపోగా, ఐపీఎల్ అవకాశం కూడా దక్కలేదు. నిజానికి 2009లోనే సౌరభ్ వెలుగులోకి వచ్చాడు. ఎయిరిండియా ప్రతిభాన్వేషణలో భాగంగా బెంగళూరు ఎన్‌సీఏలో అద్భుత బంతితో యువరాజ్ సింగ్‌ను బౌల్డ్ చేయడంతో అతనికి స్కాలర్‌షిప్ లభించింది. కొద్ది రోజులకే అదే ఎయిరిండియా తమ ప్రధాన జట్టులోకి తీసుకోవడంతో యువరాజ్, రైనాలతో కలిసి కార్పొరేట్ టోర్నీ కూడా ఆడాడు. తర్వాతి ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లలో కలిసి అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు.
అయితే ఏకైక రంజీ మ్యాచ్ తర్వాత మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. మరో రెండేళ్లు క్రికెట్‌లో గట్టిగా ప్రయత్నిస్తానని, లేదంటే ఆటను ఆపేస్తానని సౌరభ్ తన తండ్రికి చెప్పాడు. చివరకు అదే జరిగింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఎమ్మెస్ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో అవకాశం లభించింది.
చదువులో ప్రతిభతో పాటు క్రికెట్ పరిజ్ఞానంతో ‘క్రిక్‌డీకోడ్’ అనే యాప్‌ను తయారు చేయడంతో ప్రత్యేక స్కాలర్íÙప్ కూడా లభించింది. చదువు పూర్తి కాగానే అతనికి ఒరాకిల్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అమెరికా చేరాక సరదాగా వారాంతపు క్రికెట్ ఆడుతూ వచ్చిన సౌరభ్... ఆ తర్వాత ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఆడటంతో మరింత గుర్తింపు వచ్చింది.
ఈ క్రమంలో అమెరికా తరఫున 2018లో తొలి వన్డే ఆడిన నేత్రావల్కర్ గత ఏడాది జరిగిన మేజర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో టి20 టీమ్‌లో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అండర్–19 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌తో తలపడిన సౌరభ్... ఇప్పుడు బాబర్ టీమ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన సౌరభ్ ప్రదర్శన తర్వాత సౌరభ్ కంపెనీ ‘ఎక్స్’ ద్వారా తమ ఇంజినీర్‌ను అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment