టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. పాక్‌ను చిత్తు చేసిన అమెరికా | USA win over Pakistan in Super Over | Sakshi
Sakshi News home page

T20 WC 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. పాక్‌ను చిత్తు చేసిన అమెరికా

Published Fri, Jun 7 2024 4:20 AM | Last Updated on Fri, Jun 7 2024 7:04 AM

USA win over Pakistan in Super Over

‘సూపర్‌ ఓవర్‌’లో పాకిస్తాన్‌పై విజయం

డాలస్‌: టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా అనూహ్య ఫలితం వచి్చంది. తొలిసారి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్‌ ఓవర్‌’ అనివార్యమైంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది. 

2009 విజేత పాకిస్తాన్‌ సమష్టి వైఫల్యం కారణంగా పరాభావంతో టోర్నీని మెుదలు పెట్టగా...తొలి మ్యాచ్‌లో కెనడాపై నెగ్గిన యూఎస్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాక్‌ తరఫున ఆమిర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్‌ ఓవర్‌’లో 19 పరుగులు చేయాల్సిన పాక్‌... అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో ఒక వికెట్‌ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.

అంతకుముందు  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించగా... షాహిన్‌ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్‌ కెన్‌జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్‌ నేత్రావల్కర్‌ 2 వికెట్లు తీశాడు. 

అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్  మోనాంక్‌ పటేల్‌ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్‌ జోన్స్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్‌ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్‌ బౌలింగ్‌ ముందు తడబడింది. 

అయితే 19వ ఓవర్‌ వరకు పట్టు బిగించిన పాక్‌...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్‌ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్‌ ఫోర్, సిక్స్‌ సహా 14 పరుగులు రాబట్టింది.   

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఐర్లాండ్‌  X కెనడా
వేదిక: న్యూయార్క్‌; రాత్రి గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement