ఉగ్రవాదంపై ఉక్కుపాదం
Published Wed, Oct 16 2013 11:09 PM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఉగ్రవాదుల కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు నడుం బిగించింది. నగర శివారు ప్రాంతమైన గోరేగావ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 94 ఎకరాల స్థలంలో ‘ప్రత్యేక కమాండో శిక్షణ కేంద్రం’ నెలకొల్పనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదన హోం శాఖ రూపొందిం చింది. మంజూరు కోసం త్వరలో కేబినెట్ ఎదుట ప్రవేశపెట్టనుంది. మొన్నటివరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు కేవలం ముంబై, పుణే వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర నలుమూలలు, పల్లెలు, కుగ్రామాల్లో సైతం ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాయి. వీటిని దీటుగా అడ్డుకోవాలంటే చురుకుగా పనిచేసే యువకులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఫోర్స్-వన్ కమాండో లు విధినిర్వాహణలో ఉన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి పోర్స్-వన్‌లోకి పంపిస్తున్నారు. కాని విస్తరించిన ఉగ్రవాదుల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కమాండోల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ప్రత్యేకంగా కమాండోల శిక్షణ కేంద్రం నెలకొల్పాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ కమాండర్లను ఎంపిక చేసే ప్రక్రియను హోం శాఖ చేపట్టింది. ఈ శిక్షణ కేంద్రంలో సైన్యం, వాయు, నేవీ ఇలా త్రిదళాలతోపాటు నేషనల్ సెక్యురిటీ గార్డు (ఎన్‌ఎస్‌జీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఐఏ) నిపుణులు మార్గదర్శనం చేస్తారు. ఇదివరకు పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లతోపాటు కొత్తగా భర్తీ అయిన కమాండోలకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా ఉగ్రవాద సంస్థలు తమ దాడుల పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి.
వారి ఆలోచనా సరళిని ప్రస్తుతం విధినిర్వహణలో ఉన్న కమాండోలకు వాటిని ఎదుర్కోవడం కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కమాండోలకు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు నగరంపై దాడులు జరిపినప్పుడు వాటిని ఎదుర్కునేందుకు ముంబై పోలీసులు ఎన్‌ఎస్‌జీ సాయం తీసుకోవల్సి వచ్చింది. వారితో రెండు రోజులపాటు పోరాడి 10 మంది ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ మినహా మిగతా తొమ్మిది మందిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఉగ్రవాదులు అత్యధునిక ఆయుధాలు వినియోగించారు. ఊహించనిరీతిలో లేదా ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఆకస్మాత్తుగా జరిగే ఎలాంటి విపత్తులైన సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన శిక్షణను కమాండోలకు ఈ కేంద్రంలో ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement