కొత్తపేట : ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకుని, ఆస్పత్రి వాహనాలకు ఆయిల్ సరఫరా చేయాలంటూ ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ వద్ద నుంచి రూ.40 వేలు కాజేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఈవని రామచంద్రా పెట్రోలియం ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ (హెచ్‌పీ పెట్రోల్ బంక్) వద్దకు శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. మేనేజర్ వీవీఎస్‌ఎన్ బంగార్రావును కలిసి తాను స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు.
ఆస్పత్రి వాహనానికి రెగ్యులర్‌గా డీజిల్, ఇంజన్ ఆయిల్ పోయాలని, సొమ్ము ఒకేసారి ఇస్తామని చెప్పాడు. బంక్‌లో అరువు ఇవ్వమని బంగార్రావు చెప్పడంతో, ఆస్పత్రికి వస్తే అడ్వాన్స్ ఇస్తానని అతడు నమ్మించాడు. బంక్ యజమాని ఈవని సూర్యనారాయణ మూర్తి అనుమతితో బంగార్రావు అతడితో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఎమర్జెన్సీ విభాగం వద్ద కూర్చోమని చెప్పి అతడు లోపలికి వెళ్లాడు. ఓ కాగితం తెచ్చి.. రూ.60 వేలు ఇస్తున్నట్టు రాసివ్వమన్నాడు.
అనంతరం 25 నిమిషాల్లో తేరుకుని చూసుకునేసరికి చేతిలో కాగితం ఉంది. ప్యాంట్ జేబులో పెట్టిన కలెక్షన్ సొమ్ము రూ.40 వేలు అదృశ్యమయ్యాయి. దీంతో ఆస్పత్రి డాక్టర్లను, సిబ్బందిని ఆరా తీయగా, తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. కాగితం ఇచ్చిన సమయంలో ముఖంపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బంగార్రావు తెలిపాడు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఎస్సై ఎ.బాలాజీ దర్యాప్తు చేస్తున్నారు.
ఆయిల్‌కు అడ్వాన్స్ ఇస్తానని మోసం
Published Sat, Nov 15 2014 1:01 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement