సిరిసిల్లలో దివ్యాంగుల పెట్రోల్ బంక్
ఉపాధి పొందుతున్న 17 మంది
నెలకు రూ.12 వేల చొప్పున వేతనాలు
కలెక్టర్ చొరవతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగజన్ పెట్రోల్ బంక్ స్థానిక దివ్యాంగుల జీవితాలకు కొత్త వెలుగునిస్తోంది. మొన్నటివరకు ఎన్నో కష్టాలు పడినవారు.. ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. పట్టణ శివారులోని పెద్దూరు వద్ద మెడికల్ కాలేజీ ముందు దివ్యాంగజన్ పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఏర్పాటు చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.2.50 కోట్లతో బంక్ ఏర్పాటు చేసింది. కలెక్టర్ మరో రూ.30 లక్షలు గ్రాంట్‌గా మంజూరు చేయడంతో ప్రస్తుతం బంక్ నడుస్తోంది. వాస్తవానికి దీనిని ట్రాన్స్‌జెండర్స్ కోసం ఏర్పాటు చేశారు. వారు ఇక్కడ ఇచ్చే రూ.12 వేల వేతనానికి పని చేసేందుకు ముందుకు రాకపోవటంతో దివ్యాంగులకు పని కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు.
బంక్‌ను గత నెలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 23 మందికి శాశ్వతంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి.
ఈమె పేరు ఆకుల సంధ్య (42). సిరిసిల్ల శివ నగర్‌కు చెందిన ఈమెకు చిన్నప్పుడే పోలియో మూలంగా కాలు వంకరగా ఉంది. ఈమె భర్త రమేశ్ సిరిసిల్లలో కిరాణ షాపు నడిపేవాడు. ఇప్పుడు పెద్దూరులో ఉండడంతో పెద్దగా పని లేదు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ ముందు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంతో అక్కడ పని చేస్తూ సంధ్య నెలకు రూ.12 వేలు సంపాదిస్తుంది.
ఇతని పేరు బాలమల్లేశ్ (40). సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన ఈయన నిరుపేద. ఇల్లు లేదు. భార్య మాధురి బీడీలు చేస్తుంది. వీరికి ఒక్క పాప. 8వ తరగతి చదువుతుంది. పోలియోతో మల్లేశ్ కాలు వంకరగా ఉంది. అతనిప్పుడు పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ నెలకు రూ.13 వేలు సంపాదిస్తున్నాడు. భార్యాభర్తల ఆదాయం రూ.20 వేల వరకు వస్తుండటంతో పెద్దగా కష్టాలు లేకుండా బతుకుతున్నారు.
ఉపాధి రెట్టింపైంది
మాది సిరిసిల్ల శివారులోని రగుడు. నేను స్కూల్‌లో పని చేసేదాన్ని. అప్పుడు రూ.6 వేలు జీతం వచ్చేది. నాకు బాబు, కూతురు. నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. ఒంటరి మహిళను కావడంతో పెట్రోల్ బంక్‌లో పని కల్పించారు. ప్రస్తుతం రూ.12 వేల వేతనం వస్తుంది. జీతం రెట్టింపు అయింది. ఇక్కడ పని చేయడం సంతోషంగా ఉంది. – గోనెపల్లి మంజుల, రగుడు
దివ్యాంగులను ప్రోత్సహించాలి
ప్రభుత్వ సహకారం, జిల్లా కలెక్టర్ చొరవతోనే ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటయింది. వాహనదారులు ఇక్కడ పెట్రోల్,డీజిల్ పోయించుకుని దివ్యాంగులను ప్రోత్సహించాలి. లాభాపేక్ష లేకుండా దివ్యాంగులకు పని కల్పించడమే బంక్ లక్ష్యం. –లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి, రాజన్న సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment