రూల్స్‌ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే! | After Petrol Pump Refuse Without Helmet Biker He Did This Viral | Sakshi
Sakshi News home page

వీడియో: రూల్స్‌ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!

Published Wed, Jan 15 2025 1:23 PM | Last Updated on Wed, Jan 15 2025 2:59 PM

After Petrol Pump Refuse Without Helmet Biker He Did This Viral

మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్‌ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.

India Not For Beginers అంటూ సోషల్‌ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్‌ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్‌ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..  ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్‌ నో పెట్రోల్‌ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్‌(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..

మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌తో ఓ బంక్‌లోకి వచ్చాడు. అయితే హెల్మెట్‌ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్‌ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్‌ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్‌ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్‌కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..

అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్‌లో కరెంట్‌ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్‌ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్‌ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్‌కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్‌ సిబ్బందికి ఫోన్‌ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్‌కు పవర్‌ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..

ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్‌ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్‌కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్‌ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్‌ ఓనర్‌ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్‌ పోయకుండా రూల్స్‌ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్‌మెన్‌.

యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్‌ వద్ద నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్‌ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్‌లోకి వచ్చే టైంలో పైలాన్‌ రైడర్లూ ఉన్నా హెల్మెట్‌ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్‌ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement