no helmet
-
పెట్రోల్ పోయవా? అయితే కరెంట్ కట్
లక్నో: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలను నివారించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఒక నిబంధన రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను పెట్రోల్‌బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన ఘటన హాపూర్ జిల్లా లోని పార్థాపూర్ రోడ్డులో జరిగింది. హెల్మెట్ ధరి స్తేనే ద్విచక్రవాహనదారులకు పె ట్రోల్‌ను విక్రయించాలనే నిబంధనను అమలుచేయాలని యూపీ సర్కార్ ఆదేశించింది. దీంతో పార్థాపూర్ రోడ్డులోని ఒక పెట్రోల్‌బంక్ సైతం ఇదే నియమాన్ని పాటిస్తోంది. మంగళవారం ఈ పెట్రోల్‌బంక్‌కు వచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ పెట్రోల్ అడగ్గా బంక్ సిబ్బంది నిరాకరించారు. హెల్మెట్ ధరించి వస్తేనే బైక్‌కు పెట్రోల్ కొడతామని కరాఖండీగా చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లైన్మెన్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి బంక్‌కు విద్యుత్‌సరఫరా అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఉన్న కరెంట్‌స్తంభం ఎక్కి వైర్‌ను కత్తిరించాడు. దీంతో బంక్‌లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంధన వినియోగదారుల చాంతడంత క్యూలైన్ ఏర్పడింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే లైన్మెన్ కరెంట్ లైన్‌ను కత్తిరించిన విషయం అక్కడి సీసీటీవీలో రికార్డ్‌కావడంతో అది లైన్మెన్ పని అని తర్వాత తెలిసింది. వెంటనే స్థానికులు ఫిర్యాదుచేయడంతో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
రూల్స్ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!
మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.India Not For Beginers అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్‌ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌తో ఓ బంక్‌లోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్‌కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్‌లో కరెంట్ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్‌కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్‌కు పవర్ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్‌కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్ ఓనర్ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్.యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్ వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్‌లోకి వచ్చే టైంలో పైలాన్ రైడర్లూ ఉన్నా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.#Hapurपिलखुवा क्षेत्र के परतापुर रोड स्थित श्री जी फ्यूल पर एक अजीबो गरीब मामला सामने आया हैबिना हेलमेट बिजली विभाग के कर्मचारियों को पेट्रोल ना देना पेट्रोल पंप संचालक को पड़ा भारी लाइनमैन ने काट दी पेट्रोल पंप की बिजलीघटना सीसीटीवी में हुई कैद @DmHapur pic.twitter.com/My77ptruK3— Asian News UP (@AsianNewsUP) January 15, 2025 -
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు
లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు. -
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం
ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై హెల్మెట్ లేకుండా ప్రవేశం లభించదు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రవేశం లభించదు. కొంతకాలంగా రహ దారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మందికి తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధగా కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ జనజాగృతి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘ఎన్నో జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించడం విషయంలో అనుకున్న ఫలితాలు రావడం లేదనీ, అందుకు ఇకనుంచి కఠినమైన చర్యలు చేపట్టాలనీ నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్ అవినాశ్ డాక్టె తెలిపారు. హెల్మెట్ లేని వారెవ్వరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకూడదనీ, ఉన్నతాధికారులైనా, సామాన్యులైనా అందరికీ ఈ నియమం వర్తిస్తుందన్నారు. చదవండి: (సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..) ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు, జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా హెల్మెట్ ధారణ విషయంలో నిర్లక్ష్యం వహించే ద్విచక్రవాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామనీ అవినాష్ డాక్టె వెల్లడించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని పరిపాలనా శాఖకు చెందిన అన్ని ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో, ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలనే నియమాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి -
వాట్సాప్ మెసేజ్: సిటీలో హెల్మెట్ అవసరం లేదా?
"నగరవాసులకు శుభవార్త.. నగరపరిధిలో ప్రయాణించే వాహనదారులు ఇక మీదట బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈమేరకు దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు వ్యతిరేకించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని తేల్చి చెప్పింది." "కనీస రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర, జిల్లాల హైవేలపై మాత్రం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. నగర పరిధుల్లో మాత్రం హెల్మెట్ ధరించాలా? వద్దా? అన్నది కేవలం పౌరుల వ్యక్తిగత ఇష్టమని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ బండి ఆపి మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే నేను పలానా మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. దీంతో వారు మీపై ఎలాంటి జరిమానా వేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ ఓ మెసేజ్ వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై హెల్మెట్ లేకున్నా నో ఫైన్ అంటూ జనాలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం దీన్ని నమ్మి హెల్మెట్ లేకుండా వెళ్లారంటే చలానా బారిన పడటం ఖాయం. ఎందుకంటే ఇది పూర్తిగా ఓ ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారానికి తోడు దాని కింద ఫోన్ నెంబర్లు జోడించారు. అందులో ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్‌దే కావడం గమనార్హం. అయితే అతడు దీనిపై స్పందిస్తూ ఈ మెసేజ్‌కు, తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మవద్దని, దీన్ని అస్సలు ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: వైరల్: ఎప్పుడైనా ఎగిరే వడాపావ్ తిన్నారా?! పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
నో హెల్మెట్.. నో పెట్రోల్
ఆదిలాబాద్‌టౌన్: హెల్మెట్ ప్రాణానికి రక్షణ. హెల్మెట్ ధ రించి ప్రమాదాలకు గురైన వారిలో చాలా మందివరకు బతికి బయటపడ్డారు. ఎన్నో సందర్భాల్లో హెల్మెట్ ధరిస్తే బతికుండేవాడేమోనని సంఘటన స్థలాల్లో ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో సైతం జిల్లాలో నో హెల్మెట్.. నోపెట్రోల్ అమలు చేసినా కొన్ని రోజులకే పరిమితమైంది. 2021 జనవరి 1 నుంచి మరోమారు ఈ శాఖల ఆధ్వర్యంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 2016 జూన్2 నుంచి జిల్లాలో నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. వాహనదారులు హెల్మెట్లు ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసేవారు. ఆ తర్వాత కలెక్టర్, రవాణా, పోలీసు శాఖలో ఉన్నతాధికారులు బదిలీలు కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులు హెల్మెట్ లేకుండా వచ్చినా బంక్ యజమానులు పెట్రోల్ పోశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యక్రమం నిలిచిపోయింది. తాజాగా రవాణా శాఖ డీటీసీ, ఎస్పీ 2021 జనవరి 1 నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమానికి మరోసారి ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల యజమానులతో సమావేశాలు నిర్వహించి చర్చిస్తున్నారు. హెల్మెట్ లేనిదే ఏ ఒక్క వాహనదారుడికి పెట్రోల్ పోయవద్దని సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయా ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని సూచిస్తున్నారు.ఈ ఏడాది జిల్లాలో 78 ద్విచక్రవాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 43 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవేకాకుండా చిన్నచిన్న ప్రమాదాలు వందల్లో జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. జనవరి 1 నుంచి అమలు చేస్తాం నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలు, వాహనదారులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని పెట్రోల్‌బంక్ యజమానులతో సైతం చర్చించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అప్పట్లో వివిధ కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి మాత్రం పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రజలంతా సహకరించాలి. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ -
కిరాక్ ఆన్సర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్లైన్లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్‌మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు. -
నో హెల్మెట్..నో పెట్రోల్
కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశం ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అన్ని పెట్రోల్ బంకుల్లో అమలు చేయాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ఆర్అండ్బీ ఎస్ఈ, డీఎస్పీలు, ఎంవీఐలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదం జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రెస్టు రూమ్‌లు, లైటింగ్, తాగు నీరు వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయమూర్తికి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. షార్ట్ ఫిల్మ్ తయారు చేయాలి జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్ తయారు చేసి థియేటర్లలో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగించాలని వినయ్‌చంద్ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనదారులను పరీక్షించేందుకు ప్రతి మునిసిపాలిటీలో రెండు బ్రీత్ ఎనలైజర్స్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. అద్దంకి–నార్కట్‌పల్లి జాతీయ రహదారి వద్ద మేదరమెట్ల కొండ ప్రాంతాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, పోలీసు అధికారులు పరిశీలించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు, రవాణశాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్బారావు, ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్, ఆర్అండ్బీ ఎస్ఈ నాగమల్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ నాయుడు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నాగరాజు, డీసీఆర్బీ డీఎస్పీ మరియదాసు పాల్గొన్నారు. -
మూణ్ణాళ్ల ముచ్చటే!
పట్నంబజారు(గుంటూరుతూర్పు): ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ హెల్మెట్ (శిరస్త్రాణం) పెట్టుకోవాలన్న నిబంధన మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప అందరికీ సరైన రీతిలో అవగాహన కల్పించలేకపోతున్నారని విమర్శలున్నాయి. గతంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అంటూ పెట్రోల్ పంపుల వద్ద నిబంధనలు అమలు చేసినా వాటిని కఠినంగా అమలు చేయకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుల వ్యవధిలో అటకెక్కిన వైనం.. కొద్ది కాలం క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హెల్మెట్ ధారణపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ సిబ్బంది సైతం హెల్మెట్ పెట్టేలా చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలోకి సైతం హెల్మెట్ లేకపోతే విధులకు రావివ్వొదంటూ.. ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలు పాటించాలన్న విషయం మాత్రం మూణ్ణాళ్ల ముచ్చటలా మారింది. ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించటంతో పాటు, భారీ ర్యాలీలు నిర్వహించి హెల్మెట్ ధారణపై కొత్త అధ్యాయాన్నే సృష్టించారు. తొలి రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పట్టుకునేలా చర్యలు చేపట్టిన అధికారులు దొరికిన పట్టుని వదిలేసినట్లు కనబడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయంలోకి వచ్చే సిబ్బందిని సైతం అడ్డుకుని హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టారు. అయితే రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అటకెక్కిందనే విమర్శలు లేకపోలేదు. పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బంది, అధికారులే నిబంధనలను పాటించని పరిస్థితులు కనపడుతున్నాయి. కేసులు ఫుల్.. అవగాహన నిల్.. పోలీసు అ«ధికారులు హెల్మెట్ వాడకంపై అవగాహన మరింత కలిగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నారే తప్ప.. అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. దీనితో పాటు అపరాధ రుసుం పత్రాన్ని ఇంటికి పంపించే ప్రక్రియలో జాప్యం కూడా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మాన్యువల్ పద్ధతిలో కేసులు నమోదు చేయటం, రుసుం చెల్లించని వాహనాలను స్టేషన్‌కు తరలించటం జరిగేది. అయితే ఈ–చలానా పద్ధతి వచ్చిన తరువాత 15 రోజుల వ్యవధిలో కేవలం రూ.145 చలానా చెల్లించాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకు వచ్చే వారికి పెట్రోలు పోయరాదని అధికారులు జారీ చేసిన ఆదేశాలను యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. అందరూ ఒక చోటే.. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ డ్రైవ్లకే పెద్దపీట వేస్తున్నారు. త్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటీకీ వాటిని నియంత్రించటంలో విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలకు కేసుల నిర్వహణను అందజేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి టార్గెట్లు నిర్వహిస్తుండటంతో ఎస్ఐలు కూడా కేవలం కేసులకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కలిసికట్టుగా కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హెల్మెట్ ధారణపై మరింత అవగాహన కలిగించాలనే పలువురు చెబుతున్నారు. ఏదిఏమైనా పోలీసులు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం ద్వారానే హెల్మెట్ ధారణ సాధ్యపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న ప్రమాదం.. జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.. బంగారు కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది.. ఇటువంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అధికంగా జరుగుతున్న ప్రమాదాల్లో హెల్మెట్ (శిరస్త్రాణం) లేకపోవటం కారణంగానే మృత్యువాత పడుతున్నారని గణాంకాల ఆధారంగా పరిశీలించి హెల్మెట్ యజ్ఞానికి నాంది పలికారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నీరుగారిపోతోంది. ఎక్కడ మొదలు పెట్టారో.. తిరిగి అక్కడికే చేరుకుంటోంది. -
నో హెల్మెట్..నో పెట్రోల్
-
‘నో హెల్మెట్.. నో పెట్రోలు’పై వెనకడుగు
- ప్రజల్లో వ్యతిరేకతతో తగ్గిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించనివారికి పెట్రోలు బంకుల్లోకి అనుమతించొద్దనే ఆలోచనపై కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టింది. వాహనదారులకు అవగాహన కల్పించకుండా ఇలాంటి కఠిన నిబంధనలు విధించటం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం అలాంటి వివాదాస్పద అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని నిర్ణయించింది. ఇటీవల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విమర్శలు గుప్పించాయి. వాహనదారుల్లో ముందుగా అవగాహన తెచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు దిగితే బాగుంటుందని, ముందే బెదరగొట్టేలా చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాముల్ని చేసి ప్రజల్లో హెల్మెట్ ధారణపై అవగాహన తేవాలని నిర్ణయించింది. -
హెల్మెట్ లేకుంటే పెట్రోలు నో!
- ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన - కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయం కోరిన - రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ వాడకం విషయంలో క్రమంగా దూకుడు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. కేవలం అవగాహన కార్యక్రమాలతో వాహనచోదకుల్లో మార్పురావడం లేదని భావిస్తున్న ప్రభుత్వం పెనాల్టీలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ముందుగా ఓ గడువు ప్రకటించి వాహనదారులను హెచ్చరించే యోచనలో ఉంది. దీంతోపాటు కీలక ప్రాంతాల్లో హెల్మెట్ లేని వాహనచోదకుల ప్రవేశాన్ని నిరోధిస్తే ఎలా ఉంటుందనే విషయాన్నీ పరిశీలిస్తోంది. పెట్రోలు బంకులు, చెక్‌పోస్టులు, టోల్గేట్లు లాంటి ప్రాంతాలకు వచ్చేవారు విధిగా హెల్మెట్లు ధరించాలని, లేనివారికి ప్రవేశం నిషేధించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీనిపై అభిప్రాయాలు తెలపాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. లారీ యజమానుల సంఘం సమస్యలపై చర్చించేందుకు సోమవారం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ల వినియోగం అంశాన్నీ సమీక్షించారు. మీరిచ్చే అభిప్రాయాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏటా ఏడు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండగా, ఇందులో 20 శాతం మంది ద్విచక్రవాహనదారులేనన్నారు. హెల్మెట్ ధరిస్తే ఈ సంఖ్యను తగ్గించొచ్చన్నారు. వారి సమస్యలపై తరచూ సమావేశాలు తమ సమస్యల పరిష్కారంపై లారీ యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీ లు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి చర్యలుతీసుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఓవర్ లోడ్, మామూళ్ల కోసం పోలీసు వేధింపులు, పార్కింగ్ పేర అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా విషయాల్లో వారు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూసాపేట, పెద్ద అంబర్‌పేట, కంచన్బాగ్లలో లారీల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించినా వాటిని వినియోగించటం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు. ఆయా కేసుల్లో పట్టుకున్న వాహనాలు ఎక్కువ కాలం స్టేషన్లోనే ఉంచే పద్ధతిని నిరోధించాలని, చట్టానికి లోబడి అవసరమైన స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చూడాలని సూచించారు.