హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పోలీసు, హెల్మెట్ లేకున్నా బంక్ లో పెట్రోలు పోస్తున్న సిబ్బంది
పట్నంబజారు(గుంటూరుతూర్పు): ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ హెల్మెట్ (శిరస్త్రాణం) పెట్టుకోవాలన్న నిబంధన మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప అందరికీ సరైన రీతిలో అవగాహన కల్పించలేకపోతున్నారని విమర్శలున్నాయి. గతంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అంటూ పెట్రోల్ పంపుల వద్ద నిబంధనలు అమలు చేసినా వాటిని కఠినంగా అమలు చేయకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రోజుల వ్యవధిలో అటకెక్కిన వైనం..
కొద్ది కాలం క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హెల్మెట్ ధారణపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ సిబ్బంది సైతం హెల్మెట్ పెట్టేలా చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలోకి సైతం హెల్మెట్ లేకపోతే విధులకు రావివ్వొదంటూ.. ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలు పాటించాలన్న విషయం మాత్రం మూణ్ణాళ్ల ముచ్చటలా మారింది. ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించటంతో పాటు, భారీ ర్యాలీలు నిర్వహించి హెల్మెట్ ధారణపై కొత్త అధ్యాయాన్నే సృష్టించారు. తొలి రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పట్టుకునేలా చర్యలు చేపట్టిన అధికారులు దొరికిన పట్టుని వదిలేసినట్లు కనబడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయంలోకి వచ్చే సిబ్బందిని సైతం అడ్డుకుని హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టారు. అయితే రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అటకెక్కిందనే విమర్శలు లేకపోలేదు. పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బంది, అధికారులే నిబంధనలను పాటించని పరిస్థితులు కనపడుతున్నాయి.
కేసులు ఫుల్.. అవగాహన నిల్..
పోలీసు అ«ధికారులు హెల్మెట్ వాడకంపై అవగాహన మరింత కలిగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నారే తప్ప.. అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. దీనితో పాటు అపరాధ రుసుం పత్రాన్ని ఇంటికి పంపించే ప్రక్రియలో జాప్యం కూడా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మాన్యువల్ పద్ధతిలో కేసులు నమోదు చేయటం, రుసుం చెల్లించని వాహనాలను స్టేషన్‌కు తరలించటం జరిగేది. అయితే ఈ–చలానా పద్ధతి వచ్చిన తరువాత 15 రోజుల వ్యవధిలో కేవలం రూ.145 చలానా చెల్లించాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకు వచ్చే వారికి పెట్రోలు పోయరాదని అధికారులు జారీ చేసిన ఆదేశాలను యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి.
అందరూ ఒక చోటే..
ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ డ్రైవ్‌లకే పెద్దపీట వేస్తున్నారు. త్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటీకీ వాటిని నియంత్రించటంలో విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐలకు కేసుల నిర్వహణను అందజేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి టార్గెట్‌లు నిర్వహిస్తుండటంతో ఎస్‌ఐలు కూడా కేవలం కేసులకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కలిసికట్టుగా కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హెల్మెట్ ధారణపై మరింత అవగాహన కలిగించాలనే పలువురు చెబుతున్నారు. ఏదిఏమైనా పోలీసులు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం ద్వారానే హెల్మెట్ ధారణ సాధ్యపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న ప్రమాదం.. జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.. బంగారు కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది.. ఇటువంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అధికంగా జరుగుతున్న ప్రమాదాల్లో హెల్మెట్ (శిరస్త్రాణం) లేకపోవటం కారణంగానే మృత్యువాత పడుతున్నారని గణాంకాల ఆధారంగా పరిశీలించి హెల్మెట్ యజ్ఞానికి నాంది పలికారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నీరుగారిపోతోంది. ఎక్కడ మొదలు పెట్టారో.. తిరిగి అక్కడికే చేరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment