నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌  | No Helmet‌ No Petrol‌ Rule Implementation From 1 January 2021 | Sakshi
Sakshi News home page

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ 

Published Fri, Dec 25 2020 8:58 AM | Last Updated on Fri, Dec 25 2020 1:45 PM

No Helmet‌ .. No Patrol‌ Rule Implementation From 1 January 2021 - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: హెల్మెట్‌ ప్రాణానికి రక్షణ. హెల్మెట్‌ ధ రించి ప్రమాదాలకు గురైన వారిలో చాలా మందివరకు బతికి బయటపడ్డారు. ఎన్నో సందర్భాల్లో హెల్మెట్‌ ధరిస్తే బతికుండేవాడేమోనని సంఘటన స్థలాల్లో ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో సైతం జిల్లాలో నో హెల్మెట్‌.. నోపెట్రోల్‌  అమలు చేసినా కొన్ని రోజులకే పరిమితమైంది. 2021 జనవరి 1 నుంచి మరోమారు ఈ శాఖల ఆధ్వర్యంలో నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 2016 జూన్‌2 నుంచి జిల్లాలో నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. వాహనదారులు హెల్మెట్లు ధరిస్తేనే పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ పోసేవారు. ఆ తర్వాత కలెక్టర్, రవాణా, పోలీసు శాఖలో ఉన్నతాధికారులు బదిలీలు కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వచ్చినా బంక్‌ యజమానులు పెట్రోల్‌ పోశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యక్రమం నిలిచిపోయింది. 

తాజాగా రవాణా శాఖ డీటీసీ, ఎస్పీ 2021 జనవరి 1 నుంచి నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ కార్యక్రమానికి మరోసారి ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంక్‌ల యజమానులతో సమావేశాలు నిర్వహించి చర్చిస్తున్నారు. హెల్మెట్‌ లేనిదే ఏ ఒక్క వాహనదారుడికి పెట్రోల్‌ పోయవద్దని సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆయా ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్ర వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని సూచిస్తున్నారు.ఈ ఏడాది జిల్లాలో 78 ద్విచక్రవాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 43 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవేకాకుండా చిన్నచిన్న ప్రమాదాలు వందల్లో జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ముఖ్యంగా హెల్మెట్‌ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.

జనవరి 1 నుంచి అమలు చేస్తాం
నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ కార్యక్రమాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలు, వాహనదారులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని పెట్రోల్‌బంక్‌ యజమానులతో సైతం చర్చించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అప్పట్లో వివిధ కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి మాత్రం పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రజలంతా సహకరించాలి. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement