కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశం
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అన్ని పెట్రోల్ బంకుల్లో అమలు చేయాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారులపై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఎస్‌పీలు, ఎంవీఐలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదం జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రెస్టు రూమ్‌లు, లైటింగ్, తాగు నీరు వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయమూర్తికి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు.
షార్ట్ ఫిల్మ్ తయారు చేయాలి
జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్ తయారు చేసి థియేటర్లలో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగించాలని వినయ్‌చంద్ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనదారులను పరీక్షించేందుకు ప్రతి మునిసిపాలిటీలో రెండు బ్రీత్ ఎనలైజర్స్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. అద్దంకి–నార్కట్‌పల్లి జాతీయ రహదారి వద్ద మేదరమెట్ల కొండ ప్రాంతాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, పోలీసు అధికారులు పరిశీలించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు, రవాణశాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్బారావు, ఆర్‌టీసీ ఆర్‌ఎం ఆదాం సాహెబ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగమల్లు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాయుడు, ఒంగోలు డీఎస్‌పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్‌పీ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్‌పీ నాగరాజు, డీసీఆర్‌బీ డీఎస్‌పీ మరియదాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment