హెల్మెట్ లేకుంటే పెట్రోలు నో!
- ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
- కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయం కోరిన
- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ వాడకం విషయంలో క్రమంగా దూకుడు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. కేవలం అవగాహన కార్యక్రమాలతో వాహనచోదకుల్లో మార్పురావడం లేదని భావిస్తున్న ప్రభుత్వం పెనాల్టీలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ముందుగా ఓ గడువు ప్రకటించి వాహనదారులను హెచ్చరించే యోచనలో ఉంది. దీంతోపాటు కీలక ప్రాంతాల్లో హెల్మెట్ లేని వాహనచోదకుల ప్రవేశాన్ని నిరోధిస్తే ఎలా ఉంటుందనే విషయాన్నీ పరిశీలిస్తోంది.
పెట్రోలు బంకులు, చెక్‌పోస్టులు, టోల్‌గేట్లు లాంటి ప్రాంతాలకు వచ్చేవారు విధిగా హెల్మెట్లు ధరించాలని, లేనివారికి ప్రవేశం నిషేధించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీనిపై అభిప్రాయాలు తెలపాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. లారీ యజమానుల సంఘం సమస్యలపై చర్చించేందుకు సోమవారం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ల వినియోగం అంశాన్నీ సమీక్షించారు. మీరిచ్చే అభిప్రాయాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏటా ఏడు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండగా, ఇందులో 20 శాతం మంది ద్విచక్రవాహనదారులేనన్నారు. హెల్మెట్ ధరిస్తే ఈ సంఖ్యను తగ్గించొచ్చన్నారు.
వారి సమస్యలపై తరచూ సమావేశాలు
తమ సమస్యల పరిష్కారంపై లారీ యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీ లు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి చర్యలుతీసుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఓవర్ లోడ్, మామూళ్ల కోసం పోలీసు వేధింపులు, పార్కింగ్ పేర అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా విషయాల్లో వారు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూసాపేట, పెద్ద అంబర్‌పేట, కంచన్‌బాగ్‌లలో లారీల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించినా వాటిని వినియోగించటం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు. ఆయా కేసుల్లో పట్టుకున్న వాహనాలు ఎక్కువ కాలం స్టేషన్‌లోనే ఉంచే పద్ధతిని నిరోధించాలని, చట్టానికి లోబడి అవసరమైన స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చూడాలని సూచించారు.