minister mahender reddy
-
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయం
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ‘‘నార్సింగి మార్కెట్ కమిటీ’’ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మళ్లీ ప్రకాష్ గౌడ్ గెలుపు ఖాయమని మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా అన్నపూర్ణ, డైరక్టర్లను మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. -
దారిపై రుధిరధార
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: రాజీవ్ రహదారి రక్తమోడింది! నడిరోడ్డుపై మరణ మృదంగం మోగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి 11 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన 11 మందిలో ఒకే కుటుంబానికి చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టడం.. ఆ లారీ కుడి వైపునకు ఎగిరి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడం.. అదే సమయంలో ఓ క్వాలిస్ దూసుకురావడంతో లిప్తపాటులో పెను ప్రమాదం సంభవించింది. ఇందులో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన పత్రికా విలేకరి గొర్ల లక్ష్మణ్ (40)తోపాటు అతని కుటుంబసభ్యులు ఏడుగురు, బస్సులో హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్ బంధువర్గానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎలా జరిగింది? మంచిర్యాల డిపోకు చెందిన టీఎస్ 19జెడ్ 0012 నంబర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాలకు బయల్దేరింది. గంట తర్వాత గజ్వేల్ పట్టణం దాటిన తర్వాత రిమ్మనగూడ ఫార్మసీ కళాశాల సమీపంలోకి చేరుకుంది. ఇదే సమయంలో సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ(ఎంపీ 28హెచ్1945)ని ఓవర్ టేక్ చేయబోతూ ఢీకొట్టి బోల్తా పడింది. బస్సు ఢీకొట్టడంతో లారీ డివైడర్‌ను దాటుకొని రోడ్డుకు అవతలి వైపు దూసుకొచ్చి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో లారీ (కంటైనర్)ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సిద్దిపేట వైపు ముందుకు కదిలింది. ఇదే సమయంలో కొమురవెళ్లి గుడిలో పూజలు చేసుకొని గజ్వేల్ వైపు వస్తున్న క్వాలిస్ ఈ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్వాలిస్ నుజ్జునుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న గొర్ల లక్ష్మణ్, తల్లి గండమ్మ (65), తండ్రి మల్లయ్య (67), కుమార్తె నిహారిక (5)తోపాటు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అత్త ఇల్టం సత్తమ్మ (60), బావమరిది కుమారుడు శ్రీనివాస్ (8), తుఫ్రాన్‌కు చెందిన సమీప బంధువు గాజు సుశీల (62) చనిపోయారు. అలాగే బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన పరండి రాహుల్ (35), గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన సాయినిఖిల్ (25), కరీంనగర్‌కు చెందిన సింధుజ (26) మృతి చెందారు. క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మణ్ భార్య పుష్పలత, కుమారుడు ఆకాశ్, డైవర్ నర్సింహులుతోపాటు బస్సులో గాయపడ్డ ప్రయాణికులకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గాంధీ, యశోద అసుపత్రులకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ బంధువర్గానికే చెందిన ఓంకార్ (6) అనే బాలుడు మృతిచెందాడు. ఈ బాలుడి తండ్రి నర్సింహులు కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి హరీశ్‌రావు పరామర్శ సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు కలిసి ప్రమాద స్థలికి వెళ్లారు. అనంతరం గజ్వేల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే..! ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులు 75–80 కిలోమీటర్లకు స్పీడ్‌లాక్ చేస్తారు. కానీ ప్రమాదం సమయంలో బస్సు అంతకన్నా వేగంగా వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు లారీని ఢీకొట్టిన తర్వాత కిందకు పడబోతుండగా డ్రైవర్ ఇష్టానుసారంగా టర్న్ చేయడంతో రౌండ్ తిరిగి బోల్తా కొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు. హాహాకారాలు... ఆర్తనాదాలు ప్రమాద స్థలం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. క్షతగాత్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే గజ్వేల్ ఇన్చార్జి ఏసీపీ మహేందర్ చేరుకొని వాహన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారి సుమారు రెండున్నర గంటలు స్తంభించిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బిడ్డా భయపడకు.... నేనున్నా! బీటెక్ విద్యార్థినికి హరీశ్ భరోసా రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బీటెక్ విద్యార్థిని సాహితిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మంచిర్యాలకు చెందిన ప్రభాకర్–పద్మావతి దంపతుల కూతురు హైద్రాబాద్ బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. సెలవులు కావడంతో స్వగ్రామమైన మంచిర్యాలకు బయల్దేరింది. ప్రమాదంలో తలకు గాయాలై ఆమె గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ‘‘నీకేం కాదు.. మేమున్నాం.. అధైర్యపడవద్దంటూ..’’ అంటూ మంత్రి ఆమెకు భరోసానిచ్చారు. -
సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లారీలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సమావేశమైందని, వారంలో మరోసారి సమావేశమై సింగిల్ పర్మిట్‌పై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ ఏపీకి వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి గతంలో ఏపీ అధికారులతో కమి టీ జరిపిన చర్చలు సఫలం కాలేదని చెప్పారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధిక వేగం, పరిమితికి మించి సరుకు రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్లు, రైతుబజార్లలో సరుకు దింపే సమయంలో లారీల డ్రైవర్లను వేధించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. -
రైతులను ఆదుకుంటాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. 50 కోట్లతో గోదాంల నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మంగళవారం శంకర్‌పల్లిలో రూ.30 కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి, రెండు కోట్ల నిధులతో చేపట్టిన మార్కెట్ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాలను నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదరాబాద్ - బీజాపూర్ అంతర్ రాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయటంతో పాటు శంకర్‌పల్లిని నగర పంచాయితీగా ఏర్పాటు చేసి ముంబై-బెంగుళూరు జాతీయ రహదారులను కలిపేలా మరో రెండు లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు అందిస్తామని తెలిపారు. శంకర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థలకు కొత్త రిజర్వేషన్లు!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల్లో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన వెయ్యిమంది వరకు సర్పంచ్‌లు హాజరుకాగా మంత్రులు జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రానుందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలా లేక పరోక్షంగానా అన్నది ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర ఉంటుందన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి అన్నారు. నిధులు ఖర్చు చేయడమే సర్పంచ్ల విధిగా భావించొద్దని, ప్రజలను సంఘటితం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు రూ.500 కోట్ల నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. -
రైతుల ఆందోళన.. స్పందించిన మంత్రి
చేవెళ్ల : తాము పండించిన కూరగాయలు, పూలను ఆర్టీసీ బస్సులలో తీసుకెళ్లేందుకు డ్రైవర్లు నిరాకరించటంతో రైతులు చేవెళ్ల బస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం మార్కెట్‌కు కూరగాయలు, పూలను తీసుకెళ్లేందుకు చేవెళ్ల బస్‌స్టేషన్‌కు వచ్చారు. అయితే కూరగాయలు, పూల మూటలను బస్సులలో ఎక్కించేందుకు బస్సు డ్రైవర్లు అడ్డు చెప్పటంతో రైతులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీంతో రైతులకు, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రైతులు బస్సులను పోనివ్వకుండా ఆందోళనకు దిగారు. దాదాపు గంట పాటు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పంటలను బస్సులలో అనుమతించాలని ఆర్టీసీ ఆర్ఎంకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అప్పటికే మండల కేంద్రంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులొచ్చి రైతులకు నచ్చజెప్పి పూలు, కూరగాయల మూటలను బస్సులలో ఎక్కించి పంపించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
నిరుద్యోగ యువతకు శిక్షణ
తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లికోసం అప్పు చేయొద్దు కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌రెడ్డి ఉన్నారు. -
ఇరు రాష్ట్రాలది స్నేహపూర్వక బంధం
బషీరాబాద్(తాండూరు): తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంత రైతాంగం ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్, కర్ణాటక సరిహద్దులోని హల్కోడ సమీపంలో కాగ్నా నదిపై అక్కడి ప్రభుత్వం రూ.5.10 కోట్లతో నిర్మించిన అంతర్రాష్ట్ర అనుసంధాన వంతెనను మంత్రులు ప్రారంభించారు. కర్ణాటకలోని జెట్టూరు వద్ద రూ.25.65 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి కంబ్యారేజీకి తెలంగాణ అనుమతులు ఇవ్వడంతో ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు టీఎస్ ఆర్టీసీ 1,130 బస్సు సర్వీసులు నడుపుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సరహద్దులోని కర్ణాటకను అనుసంధానిస్తూ వంతెనలు, రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. శరణు ప్రకాశ్ పాటిల్ మాట్లాడుతూ 371జే ఆర్టికల్ ప్రకారం హైదరాబాద్–కర్ణాటక సరిహద్దు ప్రాంత అభివృద్ధి బోర్డు ద్వారా దక్షిణ కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, కొప్పడ్ జిల్లాల్లో నాలుగేళ్లలోనే రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. -
‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆటో షో’
-
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకూ ఈఎస్ఐ, పీఎఫ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు కూడా ఈఎస్ఐ, పీఎఫ్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ప్రతినిధులు తిరుపతిరెడ్డి, రాజు, ఇతర సభ్యులు మంత్రిని కలసి తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్య త్తులో ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం చేపట్టేప్పుడు అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడిం చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో అద్దె బస్సుల సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిని నియంత్రించేందుకు ఆ బస్సుల డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి
-
టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు. ఉద్యమ కారులకు టీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆగస్టు 30న వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన పార్టీ మీటింగ్‌లో అయూబ్ ఖాన్ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో ఆయన తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. కాలిన గాయాలు తీవ్రతరం కావడంతో అపోలో ఆస్పత్రిలో గతకొన్ని రోజులుగా చికిత్స పొంతుదున్న ఆయూబ్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని తన సంతాపం ప్రకటించారు. మృతిచెందిన నేత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంబంధిత కథనం పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నారు -
పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నాడు
- టీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం - మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఘటన పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు తాండూరు: పార్టీలో తనకు సరైన గుర్తింపు లేద ని.. నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఓ టీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది. బుధవారం పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. మొదటగా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ కోరగా.. ఇందుకు మంత్రి అంగీకరించారు. అయూబ్‌ఖాన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశానని, రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా పని చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా తమలాంటి ఉద్యమకారులకు గుర్తింపు లేదని అయూబ్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయని, ఉద్యమ కారులకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం లేదని చెప్పి తన ప్రసంగం ముగించి వెళ్లి కార్యకర్తల మధ్యలో కూర్చున్నాడు. అనంతరం సభ జరుగుతుండగా అయూబ్‌ఖాన్ ఒక్కసారిగా లేచి అప్పటికే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలి పోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఉలిక్కిపడ్డ మంత్రి మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో తనకు న్యాయం జరగడం లేదంటూ అయూబ్‌ఖాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో అక్కడే ఉన్న మంత్రి మహేందర్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడారు. అయూబ్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించగా, మంత్రి మహేందర్‌రెడ్డి కూడా వెళ్లారు. -
ఆర్టీసీకి 1,500 కొత్త బస్సులు
ముఖ్యమంత్రికి ప్రతిపాదిస్తాం.. మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి తిప్పేందుకు అదనంగా 1,500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఎండీ రమణారావు తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. నష్టాలు వచ్చినా సేవలు విస్తరిస్తూనే డిపోలను లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం పలు సందర్భాల్లో ఆర్టీసీకి రూ.2 వేల కోట్లు ఇవ్వటంతో పరిస్థితి మెరుగైందన్నారు. ప్రస్తుతం 27 డిపోలు లాభాల్లో ఉన్నాయని, త్వరలో మరో 56 డిపోలు లాభాల బాట పట్టనున్నాయ న్నారు. కరీంనగర్, రంగారెడ్డి రీజియన్లు లాభాల్లో ఉండగా మహబూబ్‌నగర్, మెదక్ రీజియన్లలో నష్టాలొస్తున్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. వజ్ర బస్సుల పనితీరు మెరుగైందని, రామ గుండం, కరీంనగర్‌కు వజ్ర సేవలు విస్తరిస్తామన్నారు. ఆస్తుల అంశాలు తప్పితే 2 రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని చెప్పారు. -
దౌడ్ రెడీ..‘మినీ’ ఏదీ?
సిటీబ్యూరో: మెట్రో రైలు దూసుకొస్తోంది. ఎట్టకేలకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మొదటి దశ రైళ్లను పట్టాలెక్కించాలనేది హెచ్ఎంఆర్ ప్రతిపాదన. కానీ మెట్రో రైలు మార్గాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఇప్పటి వరకు ఆర్టీసీ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయలేదు. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే నాటికి కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో స్టేషన్లకు తరలించేందుకు 100 మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మరోవైపు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీల్లో ఉమ్మడి టిక్కెట్ వ్యవస్థపైనా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో పయనించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అంశంపై కదలిక లేదు. జాడలేని మినీ బస్సులు..... మెట్రో రాక గ్రేటర్ ఆర్టీసీకి అతి పెద్ద సవాల్‌గా మారనుంది. ఇప్పటికే రోజుకు సుమారు రూ.96 లక్షల చొప్పున రూ.289 కోట్లకు పైగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీకి ప్రయాణికుల ఉత్పత్తి మార్గాలుగా భావించే ప్రధాన కారిడార్లలోనే మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రోకు అనుగుణమైన రవాణా సదుపాయాన్ని అందజేయడమే ఆర్టీసీ ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం సిటీబస్సుల్లో ప్రతి రోజు 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోవైపు వెళ్లనున్నారు. ఎల్బీనగర్–హైటెక్‌సిటీ, దిల్సుఖ్నగర్–పటాన్చెరు, కోఠీ–బీహెచ్ఈఎల్, ఉప్పల్– మియాపూర్, కేపీహెచ్‌బీ–సికింద్రాబాద్ వంటి అత్యధిక ఆదాయ మార్గాల్లోనే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్న దృష్ట్యా తక్షణమే ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావలసి ఉంది. ఈ క్రమంలో మెట్రో మార్గాలకు రెండు వైపులా ఉండే కాలనీల నుంచి ప్రయాణికులను చేరవేసేందుకు 100 మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించి ఏడాది దాటింది. కానీ ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. మినీయే బెటర్... మొదటి దశలో నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.)మార్గాల్లో మెట్రో రైలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ రెండు లైన్లలో మెట్రో రైలుకు ప్రయాణికులను అందజేసే ఫీడింగ్ రూట్ల (అనుసంధాన మార్గాల)పై ఆర్టీసీ దృష్టిసారించవలసి ఉంది. నాగోల్–మెట్టుగూడ మార్గానికి రెండు వైపులా ఉన్న కాలనీలు, ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల నుంచి ప్రయాణికులను మెట్రో రైలు స్టేషన్లకు చేరవేడయంలో ఈ ఫీడింగ్ రూట్స్ దోహదం చేస్తాయి. ఈ రెండు మార్గాల్లో వచ్చే ప్రతి మెట్రో స్టేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ స్టేషన్ చుట్టుపక్కల కాలనీల నుంచి ప్రయాణికులను మెట్రోకు తరలిస్తారు. దీంతో ఇప్పటి వరకు సిటీ బస్సు అందుబాటులో లేని కాలనీలకు, 40 ఫీట్ల రోడ్డు సదుపాయం ఉన్న ప్రాంతాలకు మినీ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రత్యామ్నాయ పరుగులు... ఇలా ఉండగా, ప్రధాన కారిడార్లలోకి మెట్రో రైలు ప్రవేశిస్తున్నందున పొరుగు జిల్లాలకు, హెచ్ఎండీఏ పరిధిలోని శివారు ప్రాంతాలకు సిటీ సర్వీసులను విస్తరించే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రస్తుతం సబర్బన్ బస్సులు మాత్రమే వెళ్తున్న రూట్లలో సిటీ లోకల్ బస్సులు తిరుగుతాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ వంటి దూర మార్గాలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. వలయాకార మార్గాల్లో.. ఫీడింగ్ రూట్స్‌తో పాటు రేడియల్ (వలయాకార) మార్గాల్లో కూడా బస్సులు నడపాల్సి ఉంది. ఒక్క మెట్రో స్టేషన్‌కే కాకుండా రెండు, మూడు మెట్రో స్టేషన్లకు ప్రయాణికులను తరలించేందుకు ఈ రేడియల్ రూట్స్ దోహదం చేస్తాయి.ఈ మేరకు ఉప్పల్, మియాపూర్, ఎస్సార్‌నగర్ వంటి ప్రధాన కేంద్రాల చుట్టూ ఉన్న కాలనీలు, ఎక్కువ శాతం ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతాలపైన ఆర్టీసీ గతంలోనే దృష్టి సారించింది. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ప్రధాన మార్గంలోకి వస్తున్నారనే అంచనాలకు అనుగుణంగా బస్సులను ప్రవేశపెట్టాలి. ఉప్పల్‌లోని కల్యాణపురి, ప్రశాంత్‌నగర్, బ్యాంక్‌కాలనీ వంటి ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు చాలా పరిమితంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైల్లో ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్న దృష్ట్యా...ఈ కాలనీల నుంచి మెట్రోకు ప్రయాణికులను ఫీడింగ్ చేసే రవాణా వ్యవస్థగా æఆర్టీసీ సేవలందజేస్తుంది. ూ అలాగే నాగోల్ మెట్రో స్టేషన్‌కు అటు ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్డు, హయత్‌నగర్, బండ్లగూడ, జైపురికాలనీ, కొత్తపేట్ తదితర ప్రాంతాల్లోని కాలనీల నుంచి ప్రయాణికులను తరలిస్తారు. ూ మియాపూర్, ఎస్సార్నగర్ల చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి కూడా ఇదే తరహాలో ఫీడింగ్రూట్లు, రేడియల్ రూట్లలో ప్రయాణికులను మెట్రోకు అనుసంధానం చేస్తారు. ూ ఈ రెండు మార్గాల్లో ఫీడింగ్ రూట్లు, రేడియల్ రూట్లపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సీఎం దృష్టికి ఆటోడ్రైవర్ల సమస్యలు
- తీసుకెళ్తానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హామీ - హన్మకొండలో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం హన్మకొండ చౌరస్తా/జనగామ/ఖిలా వరంగల్: తెలంగాణ ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరువలేనిదని.. వారి న్యాయమైన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా నని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్స వాన్ని పురస్కరించుకుని మంగళవారం హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వ హించారు. అంతకుముందు మంత్రి జన గామ, మడికొండల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అ«ధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ఆటోడ్రైవర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బస్సు సౌకర్యంలేని ప్రాంతాల్లో ఆటో షెల్టర్లను నిర్మించేందుకు కృషి చేస్తాన న్నారు. సభా వేదిక నుంచి యూనియన్ ప్రవేశపెట్టిన 11 తీర్మానాలలో తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి.. మిగిలినవి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ తానన్నారు. రాష్ట్రంలో రూ.350 కోట్లతో కొత్తగా 1,400 బస్సులను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఐదు ఎకరాల స్థలంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు రూ.5 కోట్లతో కేంద్రాలను నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నేరుగా బస్సులు
జనగామ: జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు నేరుగా బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. జనగామలోని రవాణా శాఖ కార్యాలయంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం మొక్కలు నాటారు. జనగామ డిపోకు వజ్ర ఏసీ బస్సులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా రవాణా లేని 1200 గ్రామాలకు రోడ్లు వేసి బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమం సామాజిక ఉద్యమంలా సాగుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతోపాటు హరితహారం వంటి సీఎం కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడికుంటి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఈద్గా వద్ద ఉద్రిక్తత
- ఎంఐఎం నాయకుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్య - మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ బషీరాబాద్ (తాండూరు): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులో ఈద్గా ప్రాంగణంలో రంజాన్ సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఐఎం తాండూరు పట్టణ అధ్యక్షుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం నేతలు ఆయన వైపు దూసుకొచ్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సమస్య సద్దు మణిగింది. తాండూరు ఈద్గా వద్ద సోమవారం ఉదయం రంజాన్ సందర్భంగా వేల సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలకు పండగ శుభాకాంక్షల కార్యక్రమాన్ని ముగించుకొని ఈద్గా ప్రాంగణంలో ఈద్గా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాదీ మాట్లాడారు. ‘తాండూరులో ముస్లింలు కొందరు కడుపులో కత్తులను గుచ్చారు.. రానున్న రోజుల్లో మేమేంటో చూపిస్తాం.. చూడండి’(ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో మోసం చేశారనే నేపథ్యంలో) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పలువురు ముస్లిం నాయకులు ఒక్కసారిగా హాదీ వైపునకు దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అప్రమత్తమైన డీఎస్పీ రామచంద్రుడు తదితరులు గొడవ పెద్దది కాకుండా అక్కడున్న వారిని పక్కకు తీసుకెళ్లారు. -
కాలేజీ రోజులు
దర్శకుడు క్రిష్ వద్ద కో–డైరెక్టర్‌గా పని చేసిన రజినీకాంత్ ‘కాలేజ్ డేస్’ చిత్రంతో దర్శకునిగా మారారు. నూతన నటీనటులతో శ్రీలత నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పటేల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందించారు. శ్రీలత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఇది రెండో సినిమా. మొదటి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. కళాశాల నేపథ్యంలో మంచి సందేశంతో యూత్‌ని ఆకట్టుకునే విధంగా ‘కాలేజ్ డేస్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి శ్రీలతగారు దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జూలై మొదటి వారంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు రజినీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. ఈశ్వర్ రావు. -
సినారె అంత్యక్రియలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, సాహితీ దిగ్గజం డాక్టర్ సి.నారాయణ రెడ్డి అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌లోని దర్గా పరిసర మహాప్రస్థానానికి వచ్చే సినారే అభిమానుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. -
వాడీవేడిగా..
అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష ► సమస్యలపై గళం విప్పిన ప్రజాప్రతినిధులు ► పరిష్కరించాలని అధికారులకు సూచన ► నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు ► ఇకపై 3 నెలలకోసారి అభివృద్ధిపై సమీక్షిస్తాం ► మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి జిల్లా అభివృద్ధిపై వాడీవేడిగా చర్చ జరిగింది. మూడు గంటలకుపైగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రైతు సమగ్ర సర్వే, విద్యుత్ సరఫరా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై లోతుగా చర్చించారు. మంత్రి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు లేవనెత్తారు. వాటి పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అధికారుల వైఖరిని ఎండగట్టారు. వచ్చే సమావేశంలోగా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లోటుపాట్లను సవరించి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా : జిల్లాలో అభివృద్ధి పనులను పరవళ్లు తొక్కించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఏ శాఖలోనూ ఆలస్యానికి తావివ్వకుండా సకాలంలో పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులకు సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు – మిగతా 6లోuసూచించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జెడ్పీ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా విస్తృతంగా చర్చించారు. అక్కడక్కడా చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ పథకాల అమలుకు కొన్ని సలహాలు అందిచ్చారు. గొర్రెల పంపిణీ పథకాన్ని గొల్ల, కురుమ, యాదవులకే కాకుండా.. వాటి పెంపకంపై ఆధారపడిన ఇతర కులాల కుటుంబాలకూ వర్తింపజేసే దిశగా ఆలోచించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. అయితే ఎంపీ సూచనపై ఎమ్మెల్యే అంజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదవ కుటుంబాలకు కేటాయించిన నిధులను ఇతరులకు మళ్లిస్తే ఒప్పుకోబోమన్నారు. ఇతర కులాల వారికి పంపిణీ చేస్తామంటే తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని.. కాకపోతే వేరే నిధులను ఖర్చు చేయాలన్నారు. దీనిపై మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతరులకు గొర్రెలను అందజేయాలని ఇప్పటికే తమకు వినతులు అందాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన సమాధానమిచ్చారు. గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా ఆవాసాల వారీగా గొర్రెకాపరుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. అయితే అలా చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని పశుసంవర్థక శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్‌రెడ్డి వివరించారు. గొర్రెల లభ్యతపై ఎటువంటి సందేహాలూ వద్దని, జిల్లాకు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో జిల్లా నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ సుందర్ అబ్నార్, సీపీఓ వైఆర్‌బీ శర్మ, జెడ్పీ సీఈఓ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంశాల వారీగా సమీక్ష.. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రజలు బిందెలు చేతబట్టి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అరకొరగానే జరుగుతోందన్నారు. కొన్ని ఊళ్లకు అది కూడా లేదని చెప్పారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కల్వకుర్తి నియోజకవర్గంలో కృష్ణా మూడో దశ కింద పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారు. అయినా గ్రామాలకు నీరు సరఫరా కావడం లేదు. ట్రయల్ రన్ పేరిట కాలం గడుస్తున్నా కడ్తాల్, ఆమన్‌గల్ మండలాలకు నీళ్లు దిక్కులేవు’ అని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను అధికారులు సైతం గుర్తించడం లేదన్నారు. ‘మిషన్ భగీరథ నీరు వచ్చే వరకు దాదాపు ఏడెమినిది నెలలు పడుతుంది. అప్పటివరకు గ్రామీణ నీటి సరఫరా నిర్వహణకు నిధులు ఉన్నాయా’ అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన పైపులైన్లు మినహా ఇస్తే.. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ల పనులపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేస్తేనే ప్రజలకు నీరందుతుందున్నారు. తన నియోజకవర్గంలోని చించోడు గ్రామంలో తప్ప అన్ని పల్లెల్లో నీటి కరువు ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. అధికారులు మౌనం పాటిస్తున్నారే తప్ప ప్రభుత్వానికి నివేదించడం లేదన్నారు. మిషన్ భగీరథలో భాగంగా డిసెంబర్ నెలాఖరులోగా ట్యాంకుల నిర్మాణం, భూగర్భ పైపులేన్లు వేయడం పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు. కలెక్టరేట్ ఏర్పాటుపై తర్వలో సమావేశం బెంగళూరు రహదారి వెంట వ్యవసాయ యూనివర్సిటీ స్థలంలో కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేసే అంశాన్ని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తిరస్కరించారు. జిల్లా భౌగోళిక పరిస్థితులకు ఆ ప్రాంతం ఏమాత్రం అనువైంది కాదని తేల్చేశారు. కలెక్టరేట్ ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా సోమవారం జిల్లాలో పర్యటించి.. వ్యవసాయ వర్సిటీ స్థలం పట్ల కాస్త సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్డీకపూల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు.. వర్సిటీ స్థలాలు కనీసం పది కిలోమీటర్ల దూరంలో కూడా లేవని, అక్కడ ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌లోనే ఉన్నట్లు భావన కలుగుతుందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. కొత్త కలెక్టరేట్‌కు అన్ని ప్రాంతాలు 30 నుంచి 35 రేడియస్ దూరంలో ఉండేలా చూడాలన్నారు. వర్సిటీలో నిర్మిస్తే.. చాలా మండలాలకు వ్యయప్రయాసాలు తప్పవన్నారు. కలెక్టరేట్ చేరుకోవాలంటే కొందరు ప్రజలు దాదాపు 100 కిలోమీటర్లు, ఇంకొందరు 35 కి.మీ మేర ప్రయాణించాల్సి ఉండడం ఇబ్బందికరమన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఎంపీ, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వచ్చే ఏకాభిప్రాయం మేరకే కొత్త కలెక్టరేట్ నిర్మించేలా ప్రభుత్వానికి నివేదిద్దామని వారికి నచ్చజెప్పారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే.. వర్సిటీ స్థలంలో బదులు జెడ్పీ కార్యాలయంలోనే నిర్మిస్తేనే సౌకర్యవంతంగా ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
గుర్తింపు దక్కలేదని టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
- ఆది నుంచి ఉన్నవారిపై కక్ష సాధిస్తున్నారని సూసైడ్ నోట్ - మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టి పరిష్కరించాలని విజ్ఞప్తి హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ పార్టీలో సముచి తమైనా స్థానం దక్కడం లేదు. మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మాపై వారి కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. కేటీఆర్ సారూ.. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు వట్టిమాటలుగానే మిగిలిపోయాయి’ అని సూసైడ్ నోట్ రాసి అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మైలా ర్‌దేవ్‌పల్లికి చెందిన మహిపాల్‌రెడ్డి(42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే టీఆర్ఎస్ పార్టీలో చురు గ్గా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన నేతల తీరుతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం వాకింగ్ కోసమని బయటకు వెళ్లాడు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలోని డీ హాస్టల్ వద్ద ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరీశీలించగా ఓ సూసైడ్ నోట్ లభించింది. ‘పార్టీకి అంతగా ఆదరణ లేని సమయంలో మైలార్‌దేవ్‌పల్లిలో కష్టపడి టీడీపీ ధీటుగా పార్టీని నిలబెట్టిన టి.శ్రీశైలంరెడ్డి అన్నగారికి ఎమ్మెల్యేకు సమానమైన పదవి ఇచ్చి గౌరవించగలరు. ఇదే నా చివరి కోరిక’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: మంత్రి మహేందర్‌రెడ్డి కార్యకర్తలు ఆత్మస్ధైర్యాన్ని కోల్పోవద్దని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, ప్రభుత్వం తరఫున ఆయన పిల్లలకు చదువు చెప్పిస్తామని వెల్లడించారు. సూసైడ్ నోటు గురించి ప్రశ్నించగా దానిపై పూర్తిస్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు. -
‘ఫీజుల’పై స్వీయ నియంత్రణ పాటించండి
- ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ సూచన - మంత్రి మహేందర్ రెడ్డితో కలసి హైదరాబాద్‌లో కైరో గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు చదువుకునే దశ నుంచి చదువు కొనే దిశగా విద్యారంగం పయని స్తోందని... విద్య అనగానే వ్యాపార మన్న భావన కలిగించే దుస్థితి నెలకొందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో విద్య ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచస్థాయి బోధనా పద్ధతులతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసర ముందన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా, సేవా దృక్పథాన్ని వీడకుండా, విద్య–వ్యాపారాల మధ్య సమతూకం, సమన్వ యం పాటిస్తూ ఫీజుల విషయంలో స్వీయ నియం త్రణ పాటించాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కేటీఆర్ సూచించారు. పాఠశాలలు, విద్యాలయాల ఏర్పాటు వ్యయం బాగా పెరిగిందని, మంచి ఉపాధ్యాయులు కావాలంటే మంచి జీతభత్యాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విద్యాసంస్థల ఏర్పాటు, బోధన కత్తి మీద సాములా మారిందన్న విషయాన్ని అందరూ అంగీకరించక తప్పదన్నారు. హైదరా బాద్‌లోని చిత్రపురి కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన కైరో గ్లోబల్ స్కూల్‌ను రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య కేవలం విజ్ఞానాన్నే కాకుండా ఉన్నత జీవన ప్రమాణాలనూ అందించేలా ఉండాలన్నారు. ఎప్పటికీ మంచి ప్రమాణాలతో విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడి బాటను ప్రారంభించిన రోజే కైరో స్కూల్‌ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రైవేటును ప్రోత్సహిస్తూనే ప్రభుత్వ విద్య బలోపేతం... కేవలం ప్రభుత్వమే మొత్తం విద్యా వ్యవస్థను నడపగలిగినా ఇప్పటికే ఏర్పడిన అనేక ప్రైవేటు విద్యా సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో విద్యను ప్రోత్సహిస్తూనే అందుకు దీటుగా ప్రభుత్వ రంగంలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వ విద్యను నడిపిస్తోందన్నారు. సర్కారు 500కుపైగా గురుకుల పాఠశాలలు ప్రారంభించి అందరికీ విద్య అందిస్తోందన్నారు. చిత్ర రంగం విచిత్రమై నదని, ఇక్కడ బళ్లు ఓడలు... ఓడలు బళ్లవడం సాధారణమన్నారు. చిత్ర సీమలో పని చేసే వాళ్ల జీవితాలూ ఒడిదుడుకులతో ఉంటాయన్నారు. చిత్రపురి కాలనీలోనే కైరో గ్లోబల్ స్కూల్‌ను పెట్టినందున కాలనీ వాసులకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని యాజమాన్యాన్ని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన స్కూల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి 50 శాతం రాయితీ హామీని చిత్రపురి హౌసింగ్ సొసైటీకి ఇచ్చామన్నారు. కార్యక్రమం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీకి బ్రేక్..
- గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీలు బంద్ - దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె ప్రభావం - నగరానికి నిలిచిపోనున్న నిత్యావసర వస్తువుల సరఫరా - పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్‌కు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెతో లారీలకు బ్రేక్ పడింది. సరుకు లోడింగ్, అన్లోడింగ్ వంటి పనులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీల బంద్ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలు లారీ యాజమాన్య సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటో గూడ్స్ వాహనాలు మినహా అన్ని రకాల తేలికపాటి, మధ్యతరహా, భారీ సరుకు రవాణా వాహనాలన్నీ బంద్‌లో పాల్గొంటాయని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ అంతటా సుమారు 2.5 లక్షల వాహనాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో 70 వేల వాహనాలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సిమెంట్, ఐరన్, బొగ్గు వంటి వివిధ రకాల వస్తువులను హైదరాబాద్‌కు తరలించే సుమారు 5 వేల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వస్తువులైన పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాను మాత్రం ప్రస్తుతం సమ్మె నుంచి మినహాయించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించకపోతే అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపివేయనున్నట్లు లారీ సంఘాలు పేర్కొన్నాయి. డీసీఎంలు వంటి వాహనాలు కూడా సమ్మెకు మద్దతిస్తున్న దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణాపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని, టోల్ ట్యాక్స్‌ను తగ్గించాలని, త్రైమాసిక పన్నును హేతుబద్ధీకరించాలని స్థానిక లారీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని సర్కార్ లారీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసి సమ్మె అనివార్యమైన దశలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. నగరానికి ప్రతిరోజూ సరఫరా అయ్యే సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర వస్తువులు నిలిచిపోనున్నాయి. కర్నూలు, నాందేడ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లి సరఫరా.. ఏపీ నుంచి బియ్యం రవాణా నిలిచిపోనుంది. నగర శివార్ల లోని కెమికల్ ఫ్యాక్టరీలకు అవసరమయ్యే 200 లారీల బొగ్గు రవాణాకూ బ్రేక్ పడనుంది. -
బాలికను ఆస్పత్రిలోంచి తీసుకెళ్లి అత్యాచారం!
⇒ పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు ⇒ నిందితునికోసం గాలింపు తాండూరు టౌన్: ఓ దుండగుడు ఆస్పత్రిలోంచి ఏడేళ్ల్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు జిల్లా ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ దారుణ జరిగింది. సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం ఎల్మకన్నె కుచెందిన బాలిక (7) తన అమ్మమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం మేనమామతో కలసి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. కాస్త చీకటి పడుతుండగా బాలిక మేనమామ తిని వస్తానని బయటకు వెళ్లాడు. అమ్మమ్మ వద్ద ఉన్న బాలిక కూడా ఆకలిగా ఉందని చెప్పడంతో అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను బయటకు తీసుకెళ్లి ఏమైనా తినిపించుకొని వస్తానని చెప్పి తీసుకెళ్లాడు.ఎంతసేపటికి బాలిక రాకపోవడం తో ఆమె మేనమామ పట్టణంలో వెతికాడు. అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు హుసేనప్ప తాండూరు ఫ్లై ఓవర్ వద్ద ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని ఉన్న ఓ వ్యక్తి బాలికను తీసుకుని అటుగా వెళ్తుండడం గమనించాడు. అనుమానంతో ప్రశ్నించాడు. దీంతో అతడు ఆమెను వదిలేసి పారిపోయాడు. వెంటనే హుసేనప్ప పారిశుద్ధ్య సూపర్వైజర్ రమేష్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. కార్మికులు బాలికను ఠాణాకు తరలించారు. సాయంత్రం తప్పిపోయిన బాలిక అయి ఉంటుందనే అనుమానంతో రమేష్ తన ఫోన్లో ఫొటో తీసి ఆస్పత్రిలో ఉన్న బంధువులకు చూపగా బాలికను గుర్తించారు. తీవ్ర రక్తస్రావంతో బాలిక సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.నిందితుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలోనూ, పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు. బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను మంత్రి మహేందర్‌రెడ్డి ఖండించారు. నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. -
బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వండి
మంత్రి మహేందర్‌రెడ్డిని కోరిన ‘ఢిల్లీ డ్రైవర్’ సరిత సాక్షి, హైదరాబాద్: సరిత.. ఢిల్లీ మహా నగర బస్సు డ్రైవర్! సంస్థాన్ నారాయణ పురం సమీపంలోని సీతియా తండాకు చెందిన ఆమెది నిరుపేద కుటుంబం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. దీంతో హైదరాబాద్ వచ్చి బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. 2011 లో ఢిల్లీవెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా చేసింది. ఇప్పు డామె హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చింది. సీఎం బిజీగా ఉండటంతో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలసి.. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టు ఇవ్వాలని కోరింది. మహిళా డ్రైవర్‌గా సరితకు తప్పకుండా ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. షీక్యాబ్ నడుపుతానంటే ఆమెకు కారు కేటాయిస్తామన్నారు. -
ఆర్టీసీ అంటేనే.. ప్రజాసేవ
మంత్రి మహేందర్ రెడ్డి హైదరాబాద్: ఆర్టీసీ అంటేనే ప్రజలకు సేవలు అందించేది అని, అలాంటి సంస్థను బలోపేతం చేసేందుకు కార్మికులందరు కృషి చేయాలని రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, మెకానిక్‌లకు కెఎంపీఎల్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీకి చెందిన 62 స్థలాలను హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి ఇచ్చి అక్కడ పంపులను ఏర్పాటు చేస్తే కొంత మేర ఇంధనం ఆదా చేయవచ్చని అన్నారు. అనంతరం డ్రైవర్లు వీరేషం (కరీంనగర్), ఎంఎం.సింగ్ (పరిగి), బీఎల్.మూర్తి (ఖమ్మం), కె.శంకర్ (ఉప్పల్), రాజేందర్ (హన్మకొండ), రాములు (ఆర్మూర్), నాగిరెడ్డి (వనపర్తి), ఎన్జే.రెడ్డి (సిద్దిపేట), రాజేశ్వర్ (నిర్మల్), కె.ఎన్.రెడ్డి (యాదగిరిగుట్ట)కు అవార్డులను ప్రదానం చేశారు. -
ప్రమాదరహిత తెలంగాణకు కృషి
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రమాదరహిత తెలంగాణ సాధనకు కృషి చేస్తామని రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 17 నుంచి 23 వరకు జరగనున్న రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. దేశంలో ఏటా 1.5 లక్షల మంది, రాష్ట్రంలో 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,125 మంది మృత్యువాత పడ్డారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలున్నాయి’’ అని చెప్పారు. ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. -
6 వరుసలుగా హైదరాబాద్–బీజాపూర్ రోడ్డు
మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల రూరల్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి త్వరలోనే ఆరు వరుసల రహదారిగా మారనుందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికి కేంద్రం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు చేయి స్తామని చెప్పారు. గుంతలమయంగా మారిన ఈ రహదారిని వెంటనే మర మ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, హైదరాబాద్‌కి కావాల్సిన కూరగాయలను నగర శివారు ప్రాంతS రైతులు పండించేలా చర్యలు తీసుకుం టున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన ప్రోత్సహకాలను అందింస్తామన్నారు. -
‘బస్సు చార్జీలు తెలంగాణలోనే తక్కువ’
హైదరాబాద్: ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా 6.7 శాతం బస్సు చార్జీలను పెంచిందన్నారు. ఆర్టీసీకి రోజూ రూ. కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల వరకూ నష్టాలు వస్తుండడంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్నెస్తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం 2010-13 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు బస్సు చార్జీలు పెంచిందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో గురువారం కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చినారెడ్డి, డీకే రుణ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. -
ఉప్పల్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: ఉప్పల్ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తామని మంత్రి చెప్పారు. స్థానికంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉప్పల్‌లో నిర్మించిన రైతు బజార్‌తో పాటు మినీస్టేడియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు. -
గ్రూప్-2 అభ్యర్థులకు వెసులుబాటు
హైదరాబాద్: ఈనెల 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థులకు పెద్ద నోట్ల చెలామణి విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ గ్రూప్-2 అభ్యర్థుల కోసం మూడు వేల బస్సులను నడుపుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. ఈ నోట్ల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. -
మంత్రి ప్రారంభించిన మరుక్షణమే పగిలిన పైపులైన్
నాసిరకం పనులపై అమాత్యుని ఆగ్రహం విజిలెన్స విచారణకు ఆదేశం.. ? ఉప్పల్ : మంచినీటి పైపులైన్ ప్రారంభించిన వెంటనే.. పైపులైన్ పగలడంతో అమాత్యులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమానగర్, లక్ష్మీనర్సింహాకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. రూ.3 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా పైపులైన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వెంటనే పైపులైన్ పగిలి పెద్దఎత్తున ఫౌంటెన్‌ను తలపించేలా నీరు పైకి ఎగిసింది. దీంతో నీటికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వందలాదిమంది స్థానికులు, అప్పుడే ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జలమండలి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇవేమీ పనులంటూ ముక్కున వేలేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వేసిన పైపులైన్‌ను పగలడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి అంతటికి కారణం నాసిరకం పనులేనని అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పైపులైన్ నాణ్యతపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజిలెన్స విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే ఈ సంఘటనకు అవాక్కరుున జలమండలి అధికారులు తమ తప్పును సరిదిద్దుకునేందుకు పాత పైపులైన్లు పగిలిపోయాయని మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
‘నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు’
చేవెళ్ల: పాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన చేవెళ్ల మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుమునుపు ఆయన చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం
♦ ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు ♦ 15 జిల్లాలతో రంగారెడ్డి జిల్లా ♦ ప్రజలు కోరినందునే శంషాబాద్‌లోకి మూడు మండలాలు ♦ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా విమర్శలా ♦ విపక్షాలపై మండిపడిన మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. దాన్ని అడ్డుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా 15 మండలాలతో ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లా ఏర్పడనుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను కలిపే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. గురువారం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల విలీనాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు నిరహార దీక్షలకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మండలాలు శంషాబాద్‌కు అతిదగ్గరలో ఉండడం.. మెజార్టీ ప్రజల కోరిక మేరకు ఆ జిల్లాలు కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి వికారాబాద్ ప్రాంతానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, జిల్లా కేంద్రం ప్రకటనను దాటవేస్తూ గడిపిన ఆ పార్టీ ప్రస్తుతం..కేసీఆర్ సర్కారు నెరవేరుస్తుంటే జీర్ణించుకోలేక పోతుందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలను సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. చేవెళ్ల జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ అర్థరహితమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గండేడ్ను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. కాగా, చేవెళ్లను కూడా శంషాబాద్‌లో కలపాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, ఈ నిధులతో వికారాబాద్ అభివృద్ధి చెందే అవకాశముందని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
మోటార్ వాహనాల చ ట్టానికి 17 సవరణలు
- కేంద్రానికి ప్రతిపాదించనున్న కమిటీ - తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను అభినందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణకు ప్రతిపాదనలకుగాను కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. రాజస్తాన్ రవాణాశాఖ మంత్రి యూనస్‌ఖాన్ నేతృత్వంలోని ఈ కమిటీ 17 సవరణలనుప్రతిపాదించాలని నిర్ణయించింది. కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కమిటీ సభ్యులు తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ సూచనలు ఇలా..డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ను సరళీకరించడం. ఆన్లైన్లో డ్రైవర్లకు డీఎల్, ఎల్ఎల్ఆర్ జారీలో కఠిన నిబంధనలు. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు సాయంపై రెస్క్యూటీంకు మార్గదర్శకాలను జారీచేయడం. డీలర్ల స్థాయిలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు, జాతీయ స్థాయిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు బోర్డు ఏర్పాటు. డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పన, వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు. రోడ్డు భద్రతకు సుప్రీంకోర్టు కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయడం. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధింపు, ఈ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడం. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు కార్డుల ద్వారా ఈ-టోలింగ్ ఏర్పాటు. ఈ-రిక్షాలను, టూ వీలర్ ట్యాక్సీ వ్యవస్థను ప్రోత్సహిం చడం. రోడ్డు ప్రమాద బాధితుల పరిహారం పెంపు వంటి సవరణలను కమిటీ ప్రతిపాదించనుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రోడ్డు భద్రత-ట్రాఫిక్ నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.అలాగే రవాణా శాఖలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా అభినందించారు. -
‘వికారాబాద్ జిల్లా’ సంబురం!
♦ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా ♦ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తా ♦ పేద జిల్లాగా కాదు సుసపన్నమైన జిల్లాగా మార్చుకుందాం ♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంత సమస్యలు విన్నవిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక బ్లాక్ గ్రౌండ్లో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వెనకబడిన నాలుగు నియోజకవర్గాలతో ఏర్పడిన రంగారెడ్డి జిల్లాలను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రం చేయడం సంతోషకరంగా ఉందని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కేంద్రం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చరని, వికారాబాద్ జిల్లా కేంద్రం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన గుడిసె రుక్మయ్య, వీడీడీఎఫ్ సభ్యులు దేవకి దేవిలు వారి పోరాటాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుడిసె రుక్మయ్యను మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వీడీడీఎఫ్ ఆద్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని మంత్రికి అందజేశారు. అందులో ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రం చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా.. వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేవీఆర్ వికారాబాద్ జిల్లాగా నామకరణం చేయాలని, పాలమూరు ఎత్తిపోతల పథకం నీటిని ఈ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు పొడగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వికారాబాద్‌లో గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు, మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని అందులో కోరారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ స్టడీ సర్కిల్, అనంతగిరి, కోట్‌పల్లిలను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావాలని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే 1983 నుంచి ఉన్న కోట్‌పల్లి మండల కేంద్రం డిమాండ్‌ను వెంటనే కోట్‌పల్లిని చేయాలని కోరారు. ఆకట్టుకున్న కళాకారుడు సాయిచంద్ర బృందం ఆట..పాట జిల్లా కేంద్రం సంబరాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిచంద్ర కళాబృందం ధూంధాం విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న..’ అంటే పాడిన పాటకు విద్యార్థులు లేచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వికారాబాద్ ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి, బంట్వారం ఎంపీపీ చిప్పె సుజాత, జెడ్పీటీసీలు ముత్తార్‌షరీఫ్, పోలీసు రాంరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ అప్ప విజయ్‌కుమార్, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఎంపీడీఓ సత్తయ్య, వీడీడీఎఫ్ నాయకులు కే శ్రీనివాస్, శుభప్రద్‌పటేల్, రామరావుజోషి, న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, కే నర్సిములు, దేవదాసు, ఉమాశేఖర్, ప్యాట మల్లేశం, పెండ్యాల అనంతయ్య, తిమ్మని శంకర్, చంద్రకాంత్‌రెడ్డి, ఆయా కళాశాలల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, 5 వేలకు పైగా విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఉచిత బస్సులేమయ్యాయి..?
అధికారులపై మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినందున అక్కడ వాహనాలు నిలిపి, నది వద్దకు వెళ్లేందుకు భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ విఫలమైన నేపథ్యంలో అధికారులపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సులు లేవని భక్తుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని రంగాపూర్ పుష్కర ఘాట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పుష్కర స్నానం అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ స్థలాల నుంచి నది వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించాల్సిందేనని ఆదేశించారు. పుష్కరాల్లో 20 ల క్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు. -
మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైటెక్, మెట్రో బస్సుల్లో వికలాంగులకు బస్ పాసులను అనమతించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సమితి అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, కార్యదర్శి ఎం. అడివయ్య, నాయకులు వెంకటేష్, వెంకట్, చంద్రమోహన్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
నేడు ఆర్టీఏ కార్యాలయానికి రవాణాశాఖ మంత్రి
తిమ్మాపూర్ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం రానున్నట్లు డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నగర మేయర్ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు. ఏర్పాట్లలో అధికారులు.. ఆర్టీఏ ఆఫీస్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా వస్తున్న సందర్భంగా డీటీసీ, ఎంవీఐలు, ఏఎంవీఐలు, కార్యాలయ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యాలయ ఆవరణలో భూమి చదునుతోపాటు 500 మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వకాన్ని పూర్తిచేశారు. మొక్కలు నాటిన అనంతరం నూతనంగా వేసిన బోరు మోటార్‌ను వారు ప్రారంభిస్తారని డీటీసీ వినోద్ పేర్కొన్నారు. కార్యాలయాన్ని చెట్లతో పచ్చగా ఉండేలా తయారుచేస్తామని తెలిపారు. ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రవీందర్, కిషన్‌రావు, ఏఎంవీఐ రజనీబాయి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చని పండుగ
♦ ఊరూరా మొదలైన హరితోద్యమం లాంఛనంగా హరితహారం ప్రారంభం ♦ భారీగా మొక్కలు నాటిన మంత్రులు, ఉన్నతాధికారులు ♦ మొయినాబాద్ మండలంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ♦ వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మొక్కనాటిన మంత్రి మహేందర్‌రెడ్డి ♦ సైబరాబాద్ కమిషనరేట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ♦ తొలిరోజు లక్షన్నర మొక్కలకు జీవం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హరితోద్యమం మొదలైంది. ఊరు.. వాడా పచ్చదనం వెల్లివిరిసింది. ఉత్సాహపూరిత వాతావరణంలో రెండో విడత ‘హరితహారం’ లాంఛనంగా ప్రారంభమైంది. పల్లెపల్లెనా ఆకుపచ్చని పండగ సందడి నెలకొంది. వివిధ సంస్థల సహకారంతో ఇప్పటివరకు 10 లక్షల మొక్కలు నాటిన అధికారయంత్రాంగం.. ఇందులో తొలిరోజు లక్షన్నర మొక్కలకు జీవం పోసింది. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మహేందర్‌రెడ్డి మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుట్టగా.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ కమిషనరేట్‌లో.. పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. ఇక పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు శామీర్‌పేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోటీగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హరితహారంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి, మేడ్చల్‌లో సహకార కార్యదర్శి పార్థసారథి, మహేశ్వరం మండలంలో హౌసింగ్‌బోర్డు కమిషనర్ అశోక్ మొక్కలు నాటి సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కింద జిల్లాలో 2.53 కోట్ల మొక్కలు పెట్టాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇదివరకే గుంతలు తీసిన వాటిలో మొక్కలు కూడా నాటింది. కాగా, శుక్రవారం అత్యధికంగా అబ్కారీ శాఖ మొక్కలు పెట్టింది. సుమారు 46 వేల ఈత, ఖర్జూర చెట్లను చెరువు గట్లపై నాటడం ద్వారా రికార్డు నమోదు చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ పర్యటన పురస్కరించుకొని విజయవాడ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇందులో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, అధికారపార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. కాగా, ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా హరితహారం ఘనంగా ప్రారంభమైంది. -
'నష్టం వచ్చినా ఆర్టీసీని వదులుకోం'
- గ్రామ గ్రామాన బస్సు సౌకర్యం కల్పిస్తాం - దేశంలోనే టీఎస్ ఆర్టీసీని ముందు వరుసలో ఉంచుతాం - రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్: రోజుకు రూ.2 కోట్లు నష్టం వస్తున్నా.. ఆర్టీసీని వదిలే ప్రసక్తే లేదని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్‌లోని అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తుం డగా.. కేవలం రూ.9 కోట్లు మాత్రమే రాబడి వస్తోందన్నారు.రాష్ట్రంలో 95 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా అందులో 10,466 బస్సులు ఉన్నాయని తెలిపారు. కొత్తగా రూ.40 కోట్లతో మరో 150 ఏసీ బస్సులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 1,200 నుంచి 1,300 వరకు గుర్తించడం జరిగిందన్నారు. మినీ బస్సులను కొనుగోలు చేసి పై గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. రాష్ర్టంలోని 95 డిపోల్లో రూ.33 కోట్లతో టాయిలెట్స్, తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేఖలు పంపుతామని మంత్రి అన్నారు. ఆర్టీసీ డిపోల అభివృద్ధికి నిజామాబాద్ ఎంపీ కవిత రూ.50 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ నుంచి నెలకు రూ.18 కోట్లు అందజేయడం జరుగుతోందని వివరించారు. విద్యార్థులకు ఆర్టీసీ ఇస్తున్న బస్సు పాసులకు సంబంధించిన డబ్బును కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు, వారి సమస్య సాధన కోసం 43 శాతం ఫిట్మెంట్ కోరితే 44 శాతం ఫిట్మెంట్ కల్పించడం జరిగిందన్నారు. ఇందు కోసం ప్రభుత్వ ఖజానాపై రూ.700 కోట్ల భారం పడిందన్నారు. అభివృద్ధిలో ఉన్న డిపోలను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్ఎం, డీఎంలకు స్పష్టమైన ఆవేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సస్యశ్యామలం చేస్తాం
♦ తెలంగాణలో కోటి, జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరివ్వడమే లక్ష్యం ♦ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం ♦ ప్రభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు ♦ తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు.. ♦ మంత్రి మహేందర్‌రెడ్డి ఏదడిగినా కాదనడం లేదు ♦ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ⇔ ‘పాలమూరు’తో జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు ⇔ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం ⇔ {పభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు ⇔ తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు ⇔ రైతుబజార్లో వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు కోల్డ్ స్టోరేజీ ⇔ మంత్రి మహేందర్‌రెడ్డి ఏదిఅడిగినా కాదనం ⇔ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు - తాండూరు తాండూరు : పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పాలమూరు ప్రాజెక్టును ఆపలేరన్నారు. రంగారెడ్డి జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో తాండూరుకు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏడాదికి రూ.25లక్షల కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందించడంమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమెరికాలోని యూనివర్సిటీల నుంచి ఇతర రాష్ట్రాల సీఎంలు, నీటి ఆయోగ్, ప్రధాని కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. 2013 భూసేకరణ చట్టం, 123 జీఓ ప్రకారం ప్రజలు ఏదీ కోరుకుంటే దాని ప్రకారం రూ.5,6లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఎన్ని నిధులైనా మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రి మహేందర్‌రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవమని.. జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఏం అడిగినా కాదనలేదన్నారు. తాండూరులో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు 30-40 ఎకరాల స్థలం కేటాయించాలని జేసీ రజిత్‌కుమార్ సైనీని మంత్రి ఆదేశించారు. స్థలం కేటాయింపుల తర్వాత రైతులకు అన్ని సౌకర్యాలతో యార్డును నిర్మిస్తామన్నారు. రైతు బజారులో వేర్వేరుగా వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పడిన బషీరాబాద్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానన్నారు. తాండూరు మార్కెట్లో కవర్ షెడ్ల నిర్మాణానికి రూ.83లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేం దర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు మంత్రి హరీష్‌రావు రూ.375కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ అనంతయ్య, జేసీ రజిత్‌కుమార్ సైని, వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతిఓజా, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, ఏడీ ఛాయాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్‌అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎంపీపీలు సాయిల్‌గౌడ్, కోస్గి లక్ష్మి, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
టెండర్లు ఖరారు కాగానే ‘డబుల్’ పనులు
♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని త న ఛాంబర్లో గృహనిర్మాణశాఖ పురోగతిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్లు రజత్‌కుమార్‌సైనీ, కాట ఆమ్రపాలి పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ పథకం కింద ప్రతి నియోజకవ ర్గంలో 400 గృహాలను నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇందులోభాగంగా మొదటి విడతలో 33 గ్రామీణ మండలాల్లో 102 లేఅవుట్లలో 4,450 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పనులు చేపట్టే బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే చేవెళ్ల, తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖకు కట్టబెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పిస్తామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకు నాణ్యమైన గృహా లను కేటాయించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పా రు. సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డెరైక్టర్ బల రామ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి(ఏసీడీపీ) నుంచి చేయూత అందబోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి కొంత మొత్తాన్ని ఆర్టీసీకి ఇవ్వనున్నారు. బస్టాండ్లకు కొత్త భవనాలు, బస్టాం డ్లలో మంచినీటి వసతి, కొత్త బల్లలు, ఫ్యాన్ల ఏర్పాటు, బస్టాండు, దానిని ఆనుకుని ఉండే డిపోలకు సీసీ రోడ్లు, మూత్రశాలల నిర్మా ణం మొదలైనవి ఈ నిధులతో చేపట్టనున్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు లే ఎక్కువగా ఉండటంతో అభివృద్ధికి డబ్బు లు లేకుండాపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు నిధులు ఇవ్వలేకపోతోంది. దీంతో ఏళ్లు గడుస్తున్నా కనీస మరమ్మతులకు కూడా బస్టాండ్లు నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశారు. ఆర్టీసీ పరిస్థితి సరిగా లేనందున ప్రయాణికులకు వసతి కల్పించటంలో కొన్ని ఇబ్బందు లు ఎదురవుతున్నాయని, దాన్ని గుర్తించి వారి వారి నియోజకవర్గాల పరిధిలోని డిపో లు, బస్టాండ్లలో అవసరమైన పనులకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు. దీనికి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొన్ని పనులకు చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. వాటి తో ఆయా నియోజకవర్గాల పరిధిలోని డిపోల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో ఎంపీలకు కూడా మంత్రి మహేందర్‌రెడ్డి లేఖలు రాయనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఒక్కో ఎమ్మెల్యేకు ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తోంది. అలాగే ఎంపీ లాడ్స్ కింద పార్లమెంటు సభ్యులకు రూ.5 కోట్లు అందుతున్నాయి. -
సంక్షేమం మా బాధ్యత
♦ మిషన్ కాకతీయ, భగీరథలతో సత్ఫలితాలు ♦ మూడు లక్షలకు చేరిన ఆసరా లబ్ధిదారులు ♦ అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ♦ అవతరణ వేడుకల్లో మంత్రి మహేందర్‌రెడ్డి అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివ రించారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ⇔ జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నాం. మిగిలిన వారికీ ఇస్తాం. ⇔ 1,122 చెరువుల్లో పూడికతీత పనులు కోసం దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేశాం. ⇔ మిషన్ భగీరథ పనులను రూ.1,960 కోట్లతో ప్రారంభించాం. ⇔ జిల్లాలో తొలివిడతలో 6,850 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశాం. ⇔ 11.44 లక్షల కుటుంబాలు రూపాయికే కిలో బియ్యం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ⇔ మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు ఇచ్చాం. ⇔ పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశాం. ⇔ ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కల్పించాం. ⇔ రోడ్ల కోసం రూ.1,020 కోట్లు ఖర్చు చేశాం. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ గౌరవిస్తున్నాం. - మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని.. వారి త్యాగాలకు ప్రతికగా అమరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా వారికికూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. చెరువులు, కుంటలు జలాలతో కలకలలాడించేందుకు తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం వేగవంతంగా సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నదని.. ఈ కాలంలో జిల్లాలో 1,122 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే సాగినికపైగా పనులు పూర్తయ్యాయని.. దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి శుద్ధనీరు.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లాలో రూ.1,960 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఈనెలాఖరు నాటికి మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్లోని 104 అవాసాల్లోని ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు వివరించారు. ప్రతి కుటుంబానికీ గూడు ప్రభుత్వ బాధ్యతని, జిల్లాలో తొలివిడత కింద 6,850 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని.. త్వరలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రూపాయికే కిలో బియ్యం కార్యక్రమం కింద జిల్లాలో 11.44లక్షల కుటుంబాలకు తిండిగింజలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు భరోసా... మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి వివరించారు. గతేడాది జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు అందించామన్నారు. పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశామని, ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కూలీలకు కల్పించామన్నారు. పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేయగా.. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.800 కోట్లు వెచ్చించామన్నారు. ప్రసంగం అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి మంత్రి నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
కోటి వెలుగులు
♦ విద్యుద్దీపాలతో ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు ♦ నేడు సరూర్‌నగర్ స్టేడియంలో జిల్లాస్థాయి వేడుకలు ♦ ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి మహేందర్‌రెడ్డి కలల తెలంగాణ సాకారమైన రోజు.. కోటి ఆశలు నెరవేరిన రోజు. తెలంగాణ స్వయం పాలన వైపు అడుగులేసిన రోజు. ఏళ్ల పోరాట ఫలితంగా రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆవిర్భవించిన తెలంగాణ.. పునర్నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. జిల్లాస్థాయిలో వేడుకలను కన్నులపండువగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ.30లక్షలు కేటాయించింది. ఈక్రమంలో జిల్లా యంత్రాంగం సరూర్‌నగర్ స్టేడియంలో జిల్లాస్థాయి వేడుకల ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం 9గంటలకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సాస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయాలు ధగధగ అవతరణ వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాలతో ముస్తాబయ్యాయి. కలెక్టర్ కార్యాలయంతోపాటు జిల్లా పరిషత్, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాలు.. ఇతర జిల్లా కార్యాలయాలు కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉద్యోగులకు వివిధ కేటగిరీల్లో ఆటపోటీలు నిర్వహించారు. గెలుపొందిన బృందాలకు అవతరణ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన వారితోపాటు ఇతర రంగాల్లోనూ స్వచ్ఛంధ సేవలు చేసిన వారికి కూడా జిల్లా యంత్రాంగం అవార్డులు అందించనుంది. -
ఏం తమాషాగా ఉందా?
‘పది’లో ఉత్తీర్ణత తగ్గడంపై మంత్రి మహేందర్‌రెడ్డి మండిపాటు తాండూరు: ‘ప్రభుత్వ పాఠశాలలంటే తమాషాగా ఉందా.. రోజూ పాఠశాలకు వెళుతున్నారా.. విద్యార్థులకు ఏం చెబుతున్నారు.. ఏమన్నా అంటే యూనియన్లు అంటారు. ఉత్తీర్ణత తగ్గితే ఏమనాలి?’ అంటూ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్ అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. తాండూరు మండలంలో పదో తరగతిలో కేవలం 45 శాతం ఉత్తీర్ణత సాధించడం పై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జినుగుర్తిలో 18 శాతం ఉత్తీర్ణత రావడంపై విస్తుపోయారు. మంచి ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలను మంత్రి ప్రశంసించారు. బషీరాబాద్ ఉర్దూ మీడియంలో 30 శాతం ఫలితాలే రావడంపట్ల వికారాబాద్ ఉప విద్యాధికారి హరిశ్చందర్‌ను మంత్రి ప్రశ్నించారు. ఉత్తీర్ణత తగ్గిన పాఠశాలల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. -
పర్యాటక రంగానికి ప్రాధాన్యం
వండర్లా పార్కు ప్రారంభోత్సవంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, చందూలాల్ మహేశ్వరం: ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ, ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం సమీపంలో వండర్లా 60 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ పార్కును పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు పార్కులో తిరిగి రైడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వండర్లా పార్కు ఆసియాలో 7వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. దేశంలోనే మొదటిసారిగా రివర్స్ రూపింగ్స్ రోలర్ కోస్టర్‌తో వండర్లా హైదరాబాద్ ప్రజలను అలరించనుందన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఏకైక ఆహ్లాదపార్క్ వండర్లా అని పేర్కొన్నారు. దీని పక్కనే సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో భారీ పార్కు రానుందన్నారు. కాగా, ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఐటీ, పీఆర్శాఖల మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పార్కులను తెస్తున్నారని అన్నారు. వండర్లా ఎండీ అరుణ్ కే చిట్టిల పిళ్లై మాట్లాడుతూ.. వండర్లా అమ్యూజ్ పార్కుల్లో మొదటిది బెంగళూర్‌లో, రెండోది కొచ్చిలో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం మూడో పార్కును హైదరాబాద్ రావిర్యాలలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారనడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు భారీగా పార్కుకు వచ్చారు. కానీ ఆయన గైర్హాజరు కావడంతో నిరాశ చెందారు. ఇంకా ఈ కార్యక్రమంలో వండర్లా వ్యవస్థాపకులు కోచోసెప్ థామస్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రియా అరుణ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, పార్కు ఇన్చార్జ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకుంటే పర్మిట్ రద్దు
ప్రైవేటు వాహనాలను నియంత్రించాల్సిందే ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు స్టేజీ క్యారియర్లు, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలా పట్టుబడ్డ వాహనాలకు భారీ పెనాల్టీలు విధించాలని, మళ్లీ పట్టుబడితే వాటి పర్మిట్లనే రద్దు చేయాలన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్రమ ప్రైవేటు స్టేజీ క్యారియర్లతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుండటం, అధికారులు వాటిని పట్టించుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన అధికారులకు చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి వందల కోట్లు నష్టం తెచ్చిపెడుతున్న ప్రైవేటు వాహనాల విషయంలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించారు. ఏసీ గదుల నుంచి బయటకు రండి... ‘ఏసీ గదుల్లో కూర్చుంటే తీరు ఇలాగే ఉంటుం ది. వెళ్లి బయట తిరగండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారు. కానీ ఉన్నతాధికారులే పనిచేయటం లేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంటే దాన్ని లాభాల్లోకి తెచ్చే చర్యలు తీసుకోకపోతే ఎలా? అక్రమంగా తిరిగే ప్రైవేటు వాహనాలు ఆ నష్టాల ను పెంచుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. అక్రమ ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల కారణంగా అమాయకులు చనిపోతున్నారంటూ... ఇటీవల పరిగి వద్ద పెళ్లి వ్యాను బోల్తాపడ్డ సంఘటనను ప్రస్తావించారు. నిర్లక్ష్యాన్ని సహించబోనని, నిబంధనలు పాటించని వాహనాలకు ముకుతాడు వేయాల్సిందేనన్నారు. పర్మిట్లు పెరిగేలా చూడండి... ఏపీ, తెలంగాణకు సంబంధించి కొన్ని ఆర్టీసీ బస్సుల పర్మిట్ గడువు తీరినందున తెలంగాణకు పర్మిట్ల సంఖ్య పెరిగేలా చూడాలని రమణారావు మంత్రిని కోరారు. ఏపీ మంత్రితో చర్చించి దాన్ని కొలిక్కి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు రవీందర్, పురుషోత్తమ్‌నాయక్, నాగరాజు, సత్యనారాయణ, రవాణాశాఖ జేటీసీలు వెంకటేశ్వర్లు, పాండురంగారావు, రఘునాథ్, డీటీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీకి ఏటా రూ.572 కోట్లు నష్టం... రాష్ట్రంలోని 95 డిపోల పరిధిలో 288 రూట్లు ఆర్టీసీకి నష్టాలు తెచ్చిపెడుతున్నాయని, ఆ మార్గాల్లో 33,955 వాహనాలు అక్రమంగా తిరుగుతున్నట్టు గుర్తించామని ఆర్టీసీ జేఎండీ రమణారావు మంత్రి దృష్టికి తెచ్చారు. తద్వారా ఆర్టీసీకి సాలీ నా రూ.572 కోట్లు నష్టం వస్తోందన్నారు. గతంలో కొన్ని మార్గాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ప్రయాణికుల సంఖ్య 4.88 లక్షల మేర పెరిగిందన్నారు. రెండు విభాగాలూ మరింత సమన్వయంతో తనిఖీల ను పెంచాలని మంత్రి ఆదేశించారు. -
మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పనులను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తాండూరు మండలం రాంపూర్ గ్రామంలోని ఊరచెరువులో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... పొలాల్లో రైతులు సేంద్రీయ ఎరువులనే వాడాలని ప్రజల్ని కోరారు. -
రూ. 289 కోట్ల నష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ
పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు ఆదేశం సమీక్షా సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి సిటీబ్యూరో: ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది జనవరి నాటికి రూ.144 కోట్లుగా ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ.289 కోట్లకు చేరుకున్నాయి. సంస్థాగత లోపాలు, 44 శాతం ఫిట్మెంట్తో పెరిగిన జీతభత్యాల భారం, ఆదాయ మార్గాల పెంపుపై దూర దృష్టి లేకపోవడం తదితర కారణాలు గ్రేటర్ ఆర్టీసీని దారుణంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపోల వారీగా లాభనష్టాలను బేరీజు వేసిన ఆయన గతేడాది నుంచి ఒక్క రూపాయి కూడా లాభం లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 నెలల్లో లాభాల దిశగా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. 3804 బస్సుల పై ప్రతి రోజు రూ.3.68 కోట్ల ఆదాయం వస్తుండగా, రోజుకు రూ.4.65 కోట్ల చొప్పున ఖర్చులు ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో రోజుకు రూ.97 లక్షల చొప్పున నష్టాలు వాటిల్లుతున్నట్లు సమీక్షలో తేలింది. నగరంలోని 28 డిపోలూ నష్టాల బాటలోనే నడుస్తున్నట్లు గుర్తించి న ఆయన డిపో మేనేజర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హకీంపేట్‌లోని ఆర్టీసీ అకాడెమీలో జరిగిన ఈ సమీక్షలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఈడీ పురుషోత్తమ్‌నాయక్, రీజనల్ మేనేజర్లు, డీవీఎంలు తదితరులు పాల్గొన్నారు. జీతభత్యాల భారం రూ. 210 కోట్లు గ్రేటర్ ఆర్టీసీలోని 28 డిపోల్లో 22,114 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల పెరిగిన జీతాలు, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వల్ల ప్రతి నెలా రూ.21 కోట్ల చొప్పున రూ.210 కోట్లు అదనపు భారం పడిందని అధికారులు తెలిపారు. మంత్రి జోక్యం చేసుకుంటూ జీతభత్యాల వల్ల భారం పెరిగినా కార్మికులు ‘బస్సు మనది-సంస్థ మనది’ అనే స్ఫూర్తితో పని చేస్తున్నారని అధికారుల్లో నే ఆ స్ఫూర్తి కొరవడిందని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, నష్టాల నుంచి గట్టెక్కే మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు... అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో నష్టాలను అధిగమించేందుకు సిటీ శివార్లలోని డిపోల నుంచి విజయవాడ, విశాఖ,బెంగళూర్, ముంబయి, చైన్నై వంటి దూరప్రాంతాలకు బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు మరో రెండు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
సెల్‌ఫోన్ ద్వారా రవాణా శాఖ సేవలు
* రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి * త్వరలో ఎం-వ్యాలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ సేవలను సెల్‌ఫోన్ ద్వారా అందించి ప్రజలకు మరింత చేరువ చేయబోతున్నామని ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ‘ఎం-వాలెట్’ విధానాన్ని రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. బుధవారం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు వెంకటేశ్వర్లు, పాండురంగనాయక్, రఘునాథ్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లెసైన్సులు, ఆర్సీ, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ, బీమా... తదితర ఎన్నో సేవలను ఎం-వ్యాలెట్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. త్వరలో దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. రవాణాశాఖ కార్యాలయాలను ఈ-కార్యాలయాలుగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,125.5 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ. 1,925 కోట్లు సాధించామన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శాఖ పనితీరు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. త్వరలో అన్ని కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరుస్తామని, ఈ విషయంలో కొన్ని జిల్లాల డీటీసీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని చెక్‌పోస్టుల పనితీరు సరిగా లేదని ఆక్షేపించారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఓవర్‌లోడ్, ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. హెల్మెట్ ధారణపై వాహనదారుల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాకు నిధులు నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, సూర్యాపేటలో ఎంవీఐ యూనిట్ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణానికి రూ.4.56 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి నల్లగొండ జిల్లా డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
జాతరకు నాలుగు వేల బస్సులు
జాతరలో ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి అవసరమైతే మరిన్ని బస్సుల ఏర్పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మేడారంలో బస్టాండ్ ప్రారంభం ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మహా జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్టాండ్, క్యూ రెరుులింగ్స్ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో కొద్దిదూరం ప్రయూణించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతరకు విస్తృత ఏర్పాట్లు.. మేడారంలో బస్సులు నిలిపేందుకు సుమారు 50 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నందున ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. జాతర సమయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతోపాటు బస్టాండ్ లో మరుగుదొడ్లు, విద్యుత్, ఎల్ఈడీ స్క్రీన్లు, కళాకారులతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రన్నింగ్ కండీషన్లో ఉన్న బస్సులనే జాతరకు ఎంపిక చేశామ ని, 12వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించామని వివరించారు. ఇందులో 7,300 మంది డ్రైవర్లు, 2,500 మంది కండక్టర్లతో పాటు రెండు వేల మంది టెక్నికల్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ జాతరకు 20 లక్షల మంది భక్తులను మేడారానికి తరలిస్తామనే అంచనా ఉందన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా మరమ్మతుకు గురైతే సరిచేసేందుకు పలు ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి జాతరకు ఏసీ బస్సులు నడుపుతున్నామన్నారు. 14 నుంచి ప్రత్యేక బస్సులు ప్రైవేట్ వాహనాల్లో రావడం కంటే ఆర్టీసీ బస్సుల్లో మేడారం వస్తే గద్దెల సమీపానికి చేరుకునే అవకాశముంటుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ఈ బస్సులు 21వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. వనదేవతలకు మొక్కులు మేడారంలో బస్టాండ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబుతో పాటు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన వనదేవతలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఆర్ఎం యాదగిరి, డీఎం మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. నష్టాల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి జనగామ : తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా 500 బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి తెలిపారు. మేడారం పర్యటనను పురస్కరించుకుని జనగామలో శుక్రవారం ఆయన కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడవని 13 గ్రామాలకు పునరుద్ధరిస్తామన్నారు. 2004లో మరమ్మతుకు వచ్చిన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులను సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. నష్టా ల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణలోని 95 డిపోల్లో తాగునీటి సౌకర్యంతోపాటు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
కార్పొరేటర్లతో మంత్రి మహేందర్‌రెడ్డి: మంత్రిని కలిసిన శివారు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించిన మహేందర్‌రెడ్డిఅభివృద్ధిపై దిశానిర్దేశం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పి.మహేందర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. శనివారం పలువురు కార్పొరేటర్లు మంత్రిని కలిసి తమ గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్పొరేటర్ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తమ పరిధిలో రోడ్ల నిర్మాణం, తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధన కోసం అందరూ కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చంపాపేట, శేరిలింగంపల్లి, చందానగర్, మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బాబాయ్ జంప్... అబ్బాయ్ షాక్!
కుత్బుల్లాపూర్: టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద్‌కు బాబాయ్ కె.ఎం.గౌరీష్ ఝలక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే పార్టీ మార్చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లితో మంతనాలు జరిపి టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కుత్బుల్లాపూర్‌లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. గౌరీష్ రెండో అన్న ప్రతాప్ ఇప్పటికే టీఆర్ఎస్లో చేరగా... తమ్ముడు అదే బాట పట్టాడు. గౌరీష్ సతీమణి పారిజాతకు కుత్బుల్లాపూర్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. మరో ఇద్దరు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ నేతలు బుధవారం కేటీఆర్, మహేందర్‌రెడ్డి, తలసాని సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరు నేడే
4 జిల్లాల్లోని ఆరు స్థానాల్లో ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3,869 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సాయుధ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటాపోటీ క్యాంపులు నిర్వహించిన ప్రధాన పార్టీలు తమ ఓటర్లను శనివారం సాయంత్రానికి జిల్లాల సరిహద్దుల్లోకి తెచ్చాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం నేరుగా పోలింగ్ స్టేషన్ల వద్దకే వారిని తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమై అధికార టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. నల్లగొండలో రసవత్తర రాజకీయం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకపక్షం చేసేందుకు అధికార టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం కొన్ని జిల్లాల్లో సాగలేదు. కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆరు స్థానాలలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను సైతం ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకొనేలా చేయడంలో టీఆర్ఎస్ వ్యూహం ఫలించింది. మిగతా నాలుగు జిల్లాల్లో ఏదో ఒక పార్టీ బలంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. నల్లగొండలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ రె ండు పార్టీల అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో తలపడుతున్నారు. ఈ స్థానం కోసం ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు స్థానికంగా బలం ఉండటంతోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎన్నికను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి తరఫున మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా ప్రచారం చేశారు. మూడు జిల్లాలపై టీఆర్ఎస్ ధీమా! రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు టీఆర్ఎస్ తరఫున మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి, సుంకరి రాజు పోటీ పడుతుండగా కాంగ్రెస్ తరఫున ఎ. చంద్రశేఖర్, టీడీపీ నుంచి బుక్క వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలు ఉనికి కోల్పోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, టీడీపీ బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపాయి. టీఆర్ఎస్ నుంచి ఎస్. జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కె. దామోదర్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కో సీటు గెలుచుకునే బలం ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితి మారింది. దీంతో గెలుపుపై అధికార పార్టీ ధీమాగా ఉంది. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వర్రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లింగాల కమల్రాజుతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఇక్కడ సీపీఎంతోపాటు టీడీపీ, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు సీపీఐ అభ్యర్థికే మద్దతిస్తుండటం గమనార్హం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. -
ఆర్టీసీని ప్రగతి బాట పట్టించాలి
హైదరాబాద్: ‘ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. రోజుకు రూ.9 కోట్లు ఆదాయం వస్తుంటే రూ.10 కోట్లు ఖర్చవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ సిబ్బంది జీతాలు పెంచారు. కార్మికులందరూ సమష్టిగా పనిచేసి ఆర్టీసీని ప్రగతి బాట పట్టించాలి’ అని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం టీఎస్ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం సిల్వర్ జూబ్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహా సభ ఘనంగా జరిగాయి. ఇందులో మంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న 96 డిపోల్లో 22 మినహా మిగిలనవన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. గ్రేటర్ హైదారాబాద్‌లోని డిపోల్లో అనేక సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తా. జీహెచ్ఎంసీ విడుదల చేసిన రూ.150 కోట్ల నిధులతో 500 బస్సులు కొనుగోలు చేశాం. అదే విధంగా ఎస్సీ కార్పోరేషన్ కూడా కొంత నిధులను ఇస్తే మరిన్ని బస్సులు కొంటాం. బస్ భవన్ పేరును అంబేడ్కర్ భవన్‌గా మార్చాలంటూ కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతా. అలాగే... ఇతర ఉద్యోగుల కాలనీలకు దీటుగా సంస్థ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ కాలనీలను ఏర్పాటు చేస్తాం. సంస్థలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని అన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప మాట్లాడుతూ... చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేడ్కర్‌కు- టీఆర్ఎస్ పార్టీకి దగ్గర సంబంధం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. 30 లోగా పదోన్నతులు: జేఎండీ టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణారావు మాట్లాడుతూ... ఈ నెల 30 లోగా సంస్థలో పదోన్నతులు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే బ్యాగ్‌లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. మహిళా కండక్టర్ల కోసం అన్ని డిపోల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఉద్యోగి ఎం.థామస్రావును ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే జి.బాలరాజు, కార్పొరేషన్ కార్యదర్శి ఎం.రవీందర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.రాజయ్య, ప్రధాన కార్యదర్శి పద్మారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ధనంజయ్‌నాయక్ పాల్గొన్నారు. -
ఆరు నెలల్లో లాభాల్లోకి ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆరు నెలల్లో నష్టాలను అధిగమించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించనున్నట్లు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. 43 డిపోలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. రూ.కోటి 30 లక్షలతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో చేపట్టనున్న పలు ఆధునీకరణ పనులకు గురువారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాలలతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ జేఎండీ రమణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో బస్స్టేషన్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. చార్జీలు పెంచే ఆలోచన లేదు... తెలంగాణ ఆర్టీసీలో చార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీని వినియోగించుకొనేది ఎక్కువ శాతం పేద ప్రజలేనని, వారిపైన తాము భారం మోపబోమని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆ రాష్ట్రానికి చెందిన బస్సులే నడుస్తున్నాయని అన్నారు. త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి దూరప్రాంతాలకు నడపనున్నట్లు పేర్కొన్నారు. శబరిమలైకు 200 బస్సులను నడుపనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. రూ.1.30 కోట్లతో ఎంజీబీఎస్ ఆధునీకరణ... మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, అదనపు టాయిలెట్లు, ఫ్లోరింగ్, గార్డెనింగ్ తదితర మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు రూ.1.30 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో మంత్రులు నాయిని, తలసాని మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన కండక్టర్లు, డ్రైవర్లు, పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేశారు. త్వరలో 500 కొత్త బస్సులు... రూ.150 కోట్లతో త్వరలో 500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. వీటిలో 400 పల్లె వెలుగు బస్సులు కాగా, 100 ఏసీ బస్సులని, వీటితో అన్ని జిల్లా కేంద్రాలను, ప్రధాన పట్టణాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొనేందుకు మాత్రమే జీహెచ్ఎంసీ రూ.137 కోట్ల సహాయాన్ని అందజేసిందని, ఆర్టీసీని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదన లేదని, జీహెచ్ఎంసీ కమిషనర్ సంస్థ పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా, నిరుద్యోగులకు ఉపాధి కోసం 100 సెట్విన్ బస్సులకు ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. -
ఆర్నెళ్లలో ఆర్టీసీ లాభాల బాట
♦ త్వరలో 500 కొత్త బస్సులు ♦ అయ్యప్ప భక్తుల కోసం శబరికి 200 బస్సులు ♦ ‘సాక్షి’తో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆరునెలల్లో ఆర్టీసీ లాభాల బాట పడుతోందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు రూ.కోటి నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95 డిపోల్లో ఆరు ఇప్పటికే లాభాల్లో నడుస్తున్నాయని, మరో 22 డిపోలు కూడా లాభనష్టాల్లేని దశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రసిద్ధ అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. బస్స్టేషన్ల బాగుకు రూ.23 కోట్లు! బస్స్టేషన్ల ఆధునికీకరణకు రూ.23 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి తెలి పారు. జిల్లాకు సగటున రూ.1-3 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రం లో 500 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయని, దీంట్లో వంద ఏసీ బస్సులను ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచుతామని, అందులో భాగంగా 400 పల్లె వెలుగు బస్సులను మండల, జిల్లా కేంద్రాల మధ్య నడుపుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,300 గ్రామాలకు బస్సు సౌకర్యంలేదని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. -
‘ఉత్త’ర్వు... కసరత్తు కరువు..!
♦ గందరగోళంగా నంబర్ ప్లేట్ల వ్యవహారం ♦ జీవో ఇచ్చి పదిరోజులైనా ఖరారు కాని విధివిధానాలు ♦ ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు ♦ తమకే స్పష్టత లేదంటూ తిప్పిపంపుతున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘తాళం వేశా.. కానీ గొళ్లెం మరిచా..’ అన్నట్టు తయారైంది టీఎస్ సీరీస్‌లోకి వాహనాల నంబర్ ప్లేట్ల వ్యవహారం. ఏదైనా జీవో జారీచేయాలంటే ముందుగా దాని అమలుపై కసరత్తు చేస్తారు. కానీ, ఏపీ సీరీస్‌తో రిజిస్టర్ అయిన వాహనాలను కొత్తగా అమల్లోకి వచ్చిన టీఎస్ సీరీస్‌లోకి మార్చే ముఖ్యమైన వ్యవహారంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. స్టేట్ కోడ్, జిల్లా కోడ్ మార్పును ఎలా అమలు చేయాలి, కొత్త ఆర్సీని ఉచితంగా ఇవ్వాలా, లేక ఫీజు వసూలు చేయాలా?... నేరుగా వాహనదారులు దరఖాస్తు చేసుకోవాలా- ఆన్లైన్లో దరఖాస్తు చేసే వెసులుబాటు కల్పించాలా, వాటికి కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చాలా వద్దా, అమరిస్తే ఫీజు ఎంత ఉండాలి... ఇలాంటి కసరత్తు లేకుండా రవాణా శాఖ పది రోజుల క్రితం హడావుడిగా ఉత్తర్వు జారీ చేసింది. దీంతో వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. కానీ... పై సందేహాలపై ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందకపోవటంతో వారు వాహనదారులను తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత పత్రికాముఖంగా ప్రకటిస్తామని చెపుతున్నారు. రవాణాశాఖ కార్యదర్శి, కమిషనర్ మూడు పర్యాయాలు దీనిపై భేటీ అయినా విధివిధానాలను మాత్రం తేల్చలేకపోయారు. ఆన్లైన్లో మార్పు చేసుకునే వెసులుబాటు... అయితే రాష్ట్రంలో ఏపీ సీరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు లక్షల సంఖ్యలో ఉన్నందున వాటన్నింటినీ మార్చేందుకు వాహనదారులు నేరుగా కార్యాలయాలకు రావాలని చెబితే పని ఒత్తిడిని తట్టుకోవడం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. దీంతో ఎవరికి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలని... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమయంలోనే రవాణాశాఖ నిర్ణయించింది. ఆర్సీ కార్డుకు నిర్ధారించే ఫీజును ఈ-సేవలో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఇప్పటికే ఓ ప్రణాళికను ఖరారు చేసి పెట్టుకున్నారు. అయితే ఫీజు వసూలు చేస్తే వాహనదారుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలుండడం, జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 30 ల క్షల వాహనాలున్నందున అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోన న్న సందేహాన్ని అధికారపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రుసుము లేకుండానే చూస్తామని ఇప్పటికే రెండుమూడు చోట్ల రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ, దానిని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. -
జాబితా సిద్ధం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తొలి అంకం పూర్తయింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల జాబితా కొలిక్కి వచ్చింది. వారం రోజులుగా ఆశావహుల జాబితాను వడపోసిన జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. దసరా కానుకగా నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడత మార్కెట్, దేవాదాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాలని సీఎం ఆదేశించారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సిఫార్సుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పును పూర్తి చేశారు. కొన్నిచోట్ల ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించిన కమిటీలను మాత్రం తొలివిడతలో ప్రకటించేందుకు అనువుగా ప్రభుత్వానికి నివేదించారు. నామినేటెడ్ పదవుల్లో కూడా తొలిసారి రిజర్వేషన్లను వ ర్తింపజేస్తుండడంతో కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల రేసుగుర్రాల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఈ పరిణామం అధికారపార్టీ నేతలకు కొంత ఇష్టంగాను.. కొంతకష్టంగాను పరిణమించింది. పాత, కొత్తలతో తలనొప్పి! నామినేటెడ్ పదవుల పంపకం ప్రజాప్రతినిధులకు తలనొప్పి కలిగించింది. టీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి రావడంతో ఈ పదవులపై ఆశలుపెట్టుకున్న వారి సంఖ్య గణ నీయంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలకు ఈ పదవులపై కన్నేశారు. అదేసమయంలో ఎన్నికల వేళ.. ఆ తర్వాత కారెక్కిన నాయకులు కూడా పోస్టులను తన్నుకుపోయేందుకు తమవంతు పైరవీలు మొదలు పెట్టారు. ఈ పరిణామం పార్టీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారింది. ఇబ్రహీంపట్నం, వికారాబాద్, మర్పల్లి, నార్సింగి తదితర మార్కెట్ కమిటీల నియామకాల్లో ఈ సమస్య తలెత్తింది. పాత, కొత్త నాయకులు పట్టుసాధించేందుకు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తుండడంతో పదవుల పంపకం సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేశారు. నార్సింగి, గడ్డిఅన్నారం పెండింగ్ నార్సింగి, గడ్డి అన్నారం మినహా అన్ని వ్యవ సాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఈ రెండింటి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఇదిలావుండగా, కొత్తగా ఏర్పడిన మహేశ్వరం మార్కెట్‌కు కొత్త పాలకవ ర్గానికి సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తడంతో పక్కనపెటినట్లు సమాచారం. కాగా, మార్కెట్ కమిటీల జాబితాను ప్రభుత్వానికి పంపామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత కమిటీలను ఏ క్షణాన్నైనా అధికారికంగా ప్రక టించే అవకాశముందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
నీళ్ల ‘తాళం’ తెరుచుకుంది
♦ ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు ♦ అధికారులను వాకబు చేసిన సీఎం కార్యాలయం ♦ నీటి సరఫరా పునరుద్ధరణకు ఆదేశించిన ఆర్టీసీ జేఎండీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్టాండ్లలో శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందించే వ్యవస్థను అధికారులే అటకెక్కించిన తీరును కళ్లకు కడు తూ ‘కమీషన్ల దాహం.. నీటికి తాళం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. స్వయంగా సీఎం కార్యాలయం వాకబు చేయటంతో ఆర్టీసీ జేఎండీ రమణరావు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దీనిపై వివరణ కోరారు. ఇలాంటి దుస్థితి ఎందుకొచ్చిందో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత విభాగాన్ని రమణరావు ఆదేశించారు. నీటి సరఫరాను పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానికంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని బస్టాండులో నాటి ఎమ్మెల్సీ నాగేశ్వర్.. తన నిధుల కోటా నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థ ఏడాదిగా పనిచేయటం లేదు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో అధికారులు దానికి మరమ్మతు చేయించారు. కేవలం రూ.3 వేల ఖర్చుతో అది నీటిని సరఫరా చేయటం ప్రారంభించటం విశేషం. ఇలా మిగతా ప్రాంతాల్లోని నీటి సరఫరా వ్యవస్థను కూడా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా దీనిపై స్పందించారు. సోమవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆర్టీసీ జేఎండీ రమణరావుతో కూడా మాట్లాడారు. పేద ప్రయాణికులకు ఉచిత నీటి సరఫరా ఉపయుక్తంగా ఉంటుందని, వెంటనే దాన్ని పునరుద్ధరించాలని కోరారు. లేకుంటే మరోసారి తాను నిరసన బాట పడతానని హెచ్చరించారు. -
హెల్మెట్ లేకుంటే పెట్రోలు నో!
- ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన - కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయం కోరిన - రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ వాడకం విషయంలో క్రమంగా దూకుడు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. కేవలం అవగాహన కార్యక్రమాలతో వాహనచోదకుల్లో మార్పురావడం లేదని భావిస్తున్న ప్రభుత్వం పెనాల్టీలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ముందుగా ఓ గడువు ప్రకటించి వాహనదారులను హెచ్చరించే యోచనలో ఉంది. దీంతోపాటు కీలక ప్రాంతాల్లో హెల్మెట్ లేని వాహనచోదకుల ప్రవేశాన్ని నిరోధిస్తే ఎలా ఉంటుందనే విషయాన్నీ పరిశీలిస్తోంది. పెట్రోలు బంకులు, చెక్‌పోస్టులు, టోల్గేట్లు లాంటి ప్రాంతాలకు వచ్చేవారు విధిగా హెల్మెట్లు ధరించాలని, లేనివారికి ప్రవేశం నిషేధించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీనిపై అభిప్రాయాలు తెలపాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. లారీ యజమానుల సంఘం సమస్యలపై చర్చించేందుకు సోమవారం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ల వినియోగం అంశాన్నీ సమీక్షించారు. మీరిచ్చే అభిప్రాయాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏటా ఏడు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండగా, ఇందులో 20 శాతం మంది ద్విచక్రవాహనదారులేనన్నారు. హెల్మెట్ ధరిస్తే ఈ సంఖ్యను తగ్గించొచ్చన్నారు. వారి సమస్యలపై తరచూ సమావేశాలు తమ సమస్యల పరిష్కారంపై లారీ యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీ లు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి చర్యలుతీసుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఓవర్ లోడ్, మామూళ్ల కోసం పోలీసు వేధింపులు, పార్కింగ్ పేర అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా విషయాల్లో వారు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూసాపేట, పెద్ద అంబర్‌పేట, కంచన్బాగ్లలో లారీల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించినా వాటిని వినియోగించటం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు. ఆయా కేసుల్లో పట్టుకున్న వాహనాలు ఎక్కువ కాలం స్టేషన్లోనే ఉంచే పద్ధతిని నిరోధించాలని, చట్టానికి లోబడి అవసరమైన స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చూడాలని సూచించారు. -
ఇక షీ క్యాబ్స్ పరుగులు
10 వాహనాలను ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి త్వరలో వంద షీ క్యాబ్‌లు... మహిళల భద్రతే సర్కార్ లక్ష్యం హైదరాబాద్: అదిగో ఇదిగో అంటూ ఏడాది పాటు ఊరించిన షీ క్యాబ్స్ ఎట్టకేలకు రోడ్డెక్కాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి షీ క్యాబ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతోనే షీ క్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. దశల వారీగా 100 షీ క్యాబ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. షీ క్యాబ్స్పై ప్రభుత్వం 35 శాతం సబ్సిడీ అందజేస్తోందన్నారు. మొదటి విడతగా 10 క్యాబ్‌లను ప్రవేశపెట్టామని, త్వరలో మరో 8 అందుబాటులోకి రానున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఫిక్కీ సంస్థలో మహిళా డ్రైవర్లకు ఉచిత శిక్షణనిస్తున్నారని, డ్రైవింగ్‌లో అత్యుత్తమ శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లను ప్రతి నెలా 20 మంది చొప్పున ఎంపిక చేసి షీ క్యాబ్స్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతిలఖ్రా, సౌమ్యామిశ్రా, స్త్రీశిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేందిర, ఫిక్కీ సంస్థ నిర్వాహకులు జ్యోత్స్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. క్యాబ్‌ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదవుతాయన్నారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీటీమ్స్ సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయన్నారు. స్వాతీలఖ్రా మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ఒంటరి మహిళలకు క్యాబ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. -
టీడీపీ మునిగిపోయే పార్టీ
మంత్రి మహేందర్‌రెడ్డి హన్మకొండ: ‘టీడీపీ మునిగిపోయే పార్టీ. ఆ పార్టీని పట్టుకుని బీజేపీ పాకులాడుతోంది.’ అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని సర్క్యూట్ హౌస్, ఆర్టీసీ వరంగల్-1 డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తున్నామని ప్రకటించారు. వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పాదయాత్ర చేస్తోందని విమర్శించారు. ఏం చేసినా టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో గెలవబోవన్నారు. -
పాలీహౌస్ను ప్రారంభించిన మంత్రి
మహేశ్వరం(రంగారెడ్డి): ఓ రైతుకు చెందిన పాలీ హౌస్‌ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని మంకాల గ్రామంలో నిర్మంచిన పాలీ హౌస్‌ను సొంత జిల్లా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. -
దత్తత గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డి
యాలాల (రంగారెడ్డి) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తాను దత్తత తీసుకున్న ముద్దాయి గూడెంలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ముద్దాయిగూడెం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. గ్రామ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. -
గ్రామాల అభివృద్ధి కోసమే 'గ్రామజ్యోతి'
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే 'గ్రామజ్యోతి' కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామజ్యోతి ద్వారా అన్ని రకాల నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ నిధులతో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి చేపడతామని మంత్రి తెలిపారు. కాగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ జిల్లాలో అఖిల పక్షాలు చేపట్టిన దీక్ష ఆయా పార్టీల మనుగడ కోసమేనని మంత్రి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. -
వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి
అఖిల భారత వడ్డెర సంఘం మహాసభలో మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ : వడ్డెర కులస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోని మియపూర్ న్యూకాలనీ సంత ప్రాంగణంలో ఆదివారం జరిగిన అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం మహాసభలో మంత్రి మాట్లాడారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం కింద సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇళ్లులేనివారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. సంఘం అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ తాజ్‌మహల్, కోణార్క్ దేవాలయం, ప్రాజెక్టులు వంటి అనేక ప్రఖ్యాత నిర్మాణాలకు వడ్డెర్ల సేవలు వినియోగించుకున్నారే తప్ప వారి బాగోగులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర్లు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డారన్నారు. ఎంతమంది పాలకులు వచ్చినా తమ బాగోగులను పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు తమ పాలిట శాపంగా పరిణమించాయన్నారు. వడ్డెర్లకు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు ఇవ్వాలని అధికారపార్టీకి విజ్ఞప్తి చేశారు. వడ్డెర కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణ స్వామి, ప్రధానకార్యదర్శి గుంజ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దండుగుల మైసయ్య, మహిళా అధ్యక్షురాలు తిరుమలదేవి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, నాయకులు టి.నారాయణస్వామి, మంజుల మారయ్య, మంజుల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో ఆర్టీసీకి పాలకమండలి
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి 5న షీ-క్యాబ్స్ ప్రారంభం ఆర్సీ కార్డుపై ఫొటో ముద్రించే విధానం ప్రారంభం హైదరాబాద్: నెలరోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు నెలల్లో రెండు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో ఆర్టీసీ విభజన జరిగేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలిపారు. రవాణాశాఖ పనితీరును మంగళవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బస్సు ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని, 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై భారం పడ్డ నేపథ్యంలో చార్జీల సవ రణ అంశం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే చార్జీలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. రవాణాశాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల ఆదాయాన్ని సాధించాల్సి ఉందని, గడచిన నాలుగు నెలల్లో రూ.800 కోట్లు సాధించటం ద్వారా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరి చిందని, ఇందుకు అధికారులను అభినందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఇందుకు స్థలం సేకరించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు. ఆగస్టు 15న షీ-క్యాబ్స్ ప్రారంభమవుతాయని, కోర్టు ఆదేశం మేరకు వాహనాలకు తెలంగాణ సిరీస్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్సీ కార్డుపై వాహన యజమాని ఫొటో.. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని ఫొటో ముద్రించే కొత్త పద్ధతిని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి ఆర్సీ కార్డుపై యజమాని ఫొటో వస్తుందని, దీన్ని పాత వాహనాల విషయంలో అమలు చేస్తామన్నారు. హరితహారం పథ కంపై అవగాహన కల్పించేందుకు హరితహారం లోగో ముద్రించిన లెసైన్సులనే జారీ చేస్తామన్నారు. -
'హెల్మెట్ తప్పనిసరి చేస్తూ త్వరలో నిర్ణయం'
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు ఆర్టీసీ చార్జీల పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. రవాణాశాఖలో ఉద్యోగాల భర్తీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న అనంతరం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రవాణాశాఖలో ద్వారా నాలుగు నెలల్లో రూ.800 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నామన్నారు. వచ్చే మార్చి నాటికి రూ. 2,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
'ఆ గొంతు బాబుదే'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముడుపుల వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపుల్లోని గొంతు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సూత్రధారి ఆయనేనని చెప్పారు. ఎమ్మల్యేలను కొనుగోలు చేసే విషయంలో చివరికి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలను కొనేందుకు కూడా చంద్రబాబు బేరాలాడారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. అసలు విషయం బయటకు పొక్కడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టుకుందని, ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటూ టీడీపీ మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యలు పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఎంట్రీ ట్యాక్స్ రగడ
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే సరుకు రవాణా వాహనాలు, ప్రయాణికులను చేరవేసే క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయాలని విభజన తర్వాత తెలంగాణ సర్కారు భావించింది. అయితే అప్పట్లో గవర్నర్ జోక్యంతో ఈ నిర్ణయం మార్చి వరకు వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి నెల చివర్లో.. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనను విరమించుకునేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించలేదు. మార్చి 31న జీవో జారీ చేసింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎంట్రీ ట్యాక్స్ ఎలా విధిస్తారంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని, రెండు ప్రభుత్వాలే తేల్చుకోవాలంటూ కేంద్ర మంత్రులు గడ్కారీ, నిర్మలా సీతారామన్ సూచించారు. ఈలోగా ఏపీ లారీ అసోసియేషన్, ప్రైవేటు యజమానుల సంఘం హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం, సుప్రీంకోర్టులో కూడా అనుకూల తీర్పు రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలపై తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చే స్తోంది. ఏపీలోని 32 లక్షల లారీలు, 800 ప్రైవేటు బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. చివరకు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలపై ఏప్రిల్ రెండో వారం తర్వాత ట్యాక్స్ వసూలు చేస్తోంది. మూడు నెలలకు వసూలు చేసే ఈ ఎంట్రీ ట్యాక్స్‌తో తెలంగాణకు రూ.30 కోట్లు, ఏపీకి రూ.20 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. -
నిర్లక్ష్యమే ముంచింది
►ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కర్ణాటక బస్సు ►నలుగురి మృతి.. 15మందికి తీవ్ర గాయాలు ►మృతుల్లో తల్లీబిడ్డ, మహిళ, ఓ బాలుడు ►డ్రైవర్ గుట్కా అలవాటు వల్లే ప్రమాదం ►బాధితులను ఆదుకుంటాం: మంత్రి మహేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సును కర్టాటకకు చెందిన ఓ బస్సు ఢీకొనడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాల వద్ద చోటుచేసుకుంది. హైదారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలో మరికల్ స్టేజీ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన సుంకరి బాలమ్మ(28), తన కొడుకు(నాలుగు నెలలు) అజయ్‌తో కలిసి బస్సు ఎక్కింది. మరికల్‌కు చెందిన విద్యార్థి సోహైల్(14)జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు మక్తల్‌కు చెందిన మరికొందరు కూడా అందులో ఎక్కారు. ధర్మాపూర్ గ్రామశివారులోని జేపీఎన్ఎస్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కర్ణాటక బస్సును డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టాడు. బస్సులో ఉన్న బాలమ్మతో పాటు కొడుకు అజయ్, సోహైల్, హసీనాబేగం(45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే సంఘటనస్థలంలో ప్రాణాలు విడిచారు. వీరిలో జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్ కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి పూర్తిగా విరిగి రోడ్డుపై పడింది. అతడితో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, డీఎస్పీ కృష్ణమూర్తి సంఘటనస్థలాన్ని సందర్శించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే.. కర్ణాటక బస్సు డ్రైవర్ గుట్కా వేసుకుని బస్సు నడుపుతున్నాడు. సంఘటన సమీపంలోకి రాగానే బస్సు అద్దాల నుంచి గుట్కా ఉమ్మేస్తుండగానే బస్సుపూర్తిగా కుడివైపు మళ్లి.. ఎదురుగా వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ గుట్కా వల్లే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 14మంది క్షతగాత్రులుగా మారారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన డ్రైవర్లు ఎక్కువగా గుట్కా, తంబాకు, పాన్ మసాలాలు తింటూ ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. బాధితకుటుంబాలకు పరిహారం విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, అ డిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీరితోపాటు క్షతగాత్రులకు రూ.ఐదువేలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. 15ఏళ్లకే నూరేళ్లు ధన్వాడ: చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కు టుంబంలో విషాదం నిండింది. మండలంలోని మరికల్‌కు చెందిన బాబా, గౌషియాకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరి ది పేద కుంటుంబం కావడంతో తండ్రి బాబా సైకిల్ ట్యాక్సీని నిర్వహిస్తూ కుం టుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. సోహైల్(15)ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు సోహైల్ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మక్తల్: అమ్మ అనే పిలుపునకు దూరమయ్యారు ఆ చిన్నారులు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ చిన్నారుల రోదన గుండెల్ని పిండేసింది. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బాలమ్మ(35) జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ధర్మాపూర్ సమీపంలో క ర్టాటక బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలమ్మతోపాటు తన నాలుగు నెలల కొడుకు అజయ్ చనిపోయారు. విషయం తెలుసుకున్న బాలమ్మ అత్త అనంతమ్మ, భర్త రాజు సంఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లితో పాటు తమ్ముడి మృతితో లావణ్య, కావేరి, హారిక రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. ‘అమ్మా.. అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా..’ అని విలపిస్తుండగా అక్కడున్నవారు కంటతడిపెట్టారు. -
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
-
ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు
-
చక్రాలకు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ► కార్మికుల వేతన సవరణపై చర్చలు విఫలం ► 27% ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామన్న ప్రభుత్వం ► 43% ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక సంఘాల పట్టు ► రోజంతా చర్చోపచర్చలు.. హైడ్రామా ► మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న సర్కారు ► సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం ► ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు ►సూపర్వైజర్లూ లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విఘాతం ► {పయాణికులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్: ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే సర్వీసులన్నీ ఆగిపోయాయి. 27 శాతంగా ఉన్న మధ్యంతర భృతి(ఐఆర్)ని ఫిట్‌మెంట్‌గా మారుస్తామని, మెరుగైన వేతన సవరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు తోసిపుచ్చడంతో సమ్మె అనివార్యమైంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో బస్సు సర్వీసులకు అంతరాయం ఎదురైంది. ప్రయాణికులకు ఇక్కట్లు మొదలయ్యాయి. చివరిరోజు హైరానా...: మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధం కాగా.. అప్పటి వరకు చోద్యం చూసిన రాష్ర్ట ప్రభుత్వం చివరిరోజున హడావుడి చేసింది. ఉదయం బస్‌భవన్‌లో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)-తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమి ప్రతినిధులతో సంస్థ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 43 శాతం ఫిట్మెంట్ కోసం పట్టుబట్టడం సరికాదని ఎండీ పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని, దాన్ని వేతన సవరణ కు ముడిపెట్టడం సరికాదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న 27 శాతం ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 43 శాతం వేతన సవరణకు పట్టుబట్టడం సరికాదని, దాదాపు రూ.850 కోట్ల భారం పడుతున్నప్పటికీ 27 శాతం ఫిట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు పట్టువీడాలని, సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెళ్లాయి. కాగా, సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, 43 శాతం ఫిట్మెంట్తో పడే భారం, నిధుల సమీకరణ యత్నాలు వంటి వివరాలను ఆయన ముందుంచారు. అప్పటికే ఓ నిర్ణయంతో ఉన్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్మిక సంఘం నేతలతో చర్చించాల్సిందిగా మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిని పురమాయించారు. దీంతో నాయిని చాంబర్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాలయాపనతో గందరగోళం... 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించకుంటే సమ్మెకు దిగుతామని పక్షం రోజుల క్రితమే ఆర్టీసీ గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి నోటీసు ఇచ్చింది. ఆ వెంటనే ఎండీ సాంబశివరావు వారితో చర్చించి అంత ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఆర్టీసీపై రూ.1800 కోట్ల భారం పడుతుందని, దాన్ని భరించే శక్తి ఆర్టీసీకి లేదని తేల్చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భరిస్తేనే ఆ మేరకు పెంపు సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చివరి వరకూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దారితీసింది. రంగంలోకి ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె అనివార్యమైతే ఒక్క రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల క్రితమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను సమీకరించింది. అందుబాటులో ఉన్న డ్రైవర్లను గుర్తించి ఆర్టీసీకి కేటాయించాల్సిందిగా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలా ఇప్పటివరకు సమీకరించిన దాదాపు ఐదు వేల మంది ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దింపారు. మరో ఐదు వేల మందిని రెండు రోజుల్లో నియమించే పనిలోపడ్డారు. ప్రైవేటు డ్రైవర్లకు రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కండక్టర్ విధులు నిర్వర్తించే వారికి రూ.800 చొప్పున చెల్లిస్తారు. అలాగే ప్రైవేటు వాహనాలు, ఓమ్ని బస్సులకు స్టేజీ క్యారియర్‌గా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఒక్కో వాహనం ప్రత్యేక ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం ఉత్తర్వులు జారీకానున్నాయి. సూపర్వైజర్లూ లేకపోతే ఇబ్బందే కార్మికులతో పాటు ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం కూడా సమ్మె బాట పట్టడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. కానీ అలా వచ్చే డ్రైవర్లకు సూచనలు చేయాలన్నా, వారిని నియంత్రించాలన్నా, వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించాలన్నా డిపోలో సిబ్బంది అవసరం. కానీ దాదాపు అన్ని విభాగాల సిబ్బంది సమ్మెకు దిగారు. డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది మినహా మరెవరూ విధుల్లో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపడం కుదిరేలా కనిపించడం లేదు. ఎన్నికల వేళ కార్మిక సంఘాల పట్టు వేతన సవరణ విషయంలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి బెట్టు వీడకపోవడానికి కారణం ఎన్నికలే. ప్రస్తుత గుర్తింపు యూనియన్ గడువు తీరిపోయింది. దీంతో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో వేతన సవరణపై బెట్టు వీడితే కార్మికుల్లో చెడ్డ పేరు వస్తుందని గుర్తింపు సంఘం కూటమి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వాదనకు తలొగ్గి సమస్యను కొనితెచ్చుకోవద్దన్న అభిప్రాయంతోనే సమ్మెకు దారితీసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావాలంటే 62 శాతం ఫిట్మెంట్ కావాలని, అయితే గుర్తింపు సంఘం మాత్రం 43 శాతమే డిమాండ్ చేసి కార్మికులకు అన్యాయం చేసిందంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే దాడి ప్రారంభించింది. చార్జీలు 40 శాతం పెంచాల్సి వస్తుంది ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నందున సమ్మె వద్దని సర్కారు చేసిన విన్నపాన్ని కార్మిక సంఘాలు మొండిగా తిరస్కరించాయి. సమస్యల పరిష్కారానికి మరింత గడువు కోరినా వినలేదు. 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే దాదాపు 40 శాతం వరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఇంతభారం ప్రజలపై మోపడం సరికాదు. ఆర్టీసీని కూడా లాభాల బాట పట్టించే పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. దాన్ని అమలు చేసి భవిష్యత్తులో లాభాలు వస్తే కార్మికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అయినా సమ్మెకు దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం. - రాష్ర్ట రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పటికే కాలయాపన ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు దాటినా స్పందించలేదు. ఇప్పుడు గడువు కోరడం దాటవేసేందుకే. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకూ సమ్మె విరమించేది లేదు. జీతాలు పెంచితే 40 శాతం చార్జీలు పెంచాలన్న వాదన అసత్యం. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి పక్కదారి పట్టిస్తోంది. నిర్వహణ మా చేతికిస్తే పైసా చార్జీలు పెంచకుండా జీతాలు పెంచుకుంటాం. డీజిల్, రవాణా పన్ను రూపేణ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ఏటా రూ. 400 కోట్లు వసూలు చేస్తోంది. పైగా పలు వర్గాలకు ఇస్తున్న రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించడం లేదు. రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించి, మూడేళ్ల పన్ను మినహాయింపునిస్తే చాలు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త రాష్ట్రంలో జీతాలు పెరిగాయి. మేం ఏం పాపం చేశాం. తెలంగాణ కోసం చాలా పోరాటం చేశాం. ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి తెలుసు. ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. అప్పటి వరకు సమ్మె వల్ల ప్రజలు పడే ఇబ్బందులకు యాజమాన్యమే బాధ్యత వహించాలి. సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను, అడ్డా కూలీలను వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. -- కార్మిక సంఘాల నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి ఏపీలోనూ నిలిచిన బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలోని 126 బస్సు డిపోలు, నాలుగు వర్క్‌షాపుల్లో ఇది కొనసాగనుంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ర్ట రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. ప్రైవేటు బస్సుల యజమానులతో, దక్షిణ మధ్య రైల్వేతో మాట్లాడుతామని పేర్కొన్నారు. సమ్మెపై కేబినెట్లో చర్చించామని, సీఎం వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రిలోగా కార్మిక సంఘాలతో చర్చించి సమ్మె విరమణకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ ఆర్టీసీలో 68 వేల మంది కార్మికులు ఉన్నారని, వీరికి ఫిట్మెంట్ ప్రకటించాలంటే బస్సు చార్జీలను కనీసం 15 శాతం పెంచాలని సీఎం చంద్రబాబు ద ృష్టికి తీసుకెళ్లామని, అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీకి అన్ని విషయాలు చెప్పి కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకోవాలన్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతన సవరణ, సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం ఆర్థిక, రవాణా, కార్మిక శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 15లోగా ఈ మంత్రుల కమిటీ నివేదిక సమర్పిస్తుంది. 10,800 రాష్ట్రంలో నిలిచిపోనున్న బస్సులు 94 మొత్తం డిపోలు 2 వర్క్ షాపులు 57,500 కార్మికుల సంఖ్య -
చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు సస్యశ్యామలం
మంత్రి మహేందర్‌రెడ్డి షాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని హైతాబాద్‌లో, లక్ష్మరావుగూడ సంగయ్య కుంటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తే వ్యవసాయ భూములు సారవంతమవుతాయని, భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జడల లక్ష్మి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘ఉద్యమం’లో దేవీప్రసాద్ పాత్ర కీలకం
మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ బంగారు తెలంగాణ సాధన కో సం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో దేవీప్రసాద్‌రావు చురుకైన పాత్ర పోషించారన్నారు. ఉద్యోగులనందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలోనే ప్రధాన మలుపుగా భావిస్తున్న సకల జనుల సమ్మెను విజయవంతం చేయించిన ఘనత ఆయనదేనన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ కేవలం 25 శాతంగానే ఉందని, ఈసారి ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి దేవీప్రసాద్రావుకు ఓటు వేసేలా పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క రూ దోహదపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చె ప్పారు. ఈనెల 10న చేవెళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో జరగనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ అభియాన్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, రిటైర్ట్ ప్రధానోపాధ్యాయులు ఏ.మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు అంజయ్య తదితరులు మాట్లాడారు. దేవీప్రసాద్‌రావు ఎన్నికల ప్రచార పోస్టర్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు విడుదల చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌గుప్త, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ నాయకులు బర్కల రాంరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, ఆగిరెడ్డి, మగ్భూల్ షరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగవుతున్నాయని, తెలంగాణలో ఇంటి పార్టీగా టీఆర్ఎస్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తోందని రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదుతో పార్టీకి మరింత బలం చేకూరిందని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శుక్రవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంవన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు శ్రీశైలం రెడ్డి, సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌లు టీఆర్ఎస్లో చేరినవారిలో ఉన్నారు. -
వారంతా తెలంగాణ బిడ్డలే
సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి రామచంద్రాపురం: వలస వచ్చి స్థిరపడ్డ వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారికి తాము అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. గ్రామాలను పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విద్యుత్ృసమస్య లేకుండా కృషి చేస్తామన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్న బాబు తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా కంటే తెలంగాణలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులను తీసుకోవడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ పేరిట 46 వేల చెరువులను అభివృద్ధి పరిచేందుకు రూ.24 వేల కోట్లను కేటాయించడం హర్షదాయకమన్నారు. ఈ పథకం వల్ల చెరువులు నిండి పల్లెలు పూర్వ వైభవాన్ని చాటుకుంటాయన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, పార్టీ జీహెచ్ఎంసీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రాములుగౌడ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పుష్ప, నాయకులు వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, తొంట అంజయ్య, నగేష్ యాదవ్, వి.మోహన్‌రెడ్డి, శ్రీధర్‌చారి, పరమేశ్, అన్వర్ పటేల్, అబ్బు అలీ పాల్గొన్నారు. -
గులాబీ దళంలో అసంతృప్తి జ్వాలలు
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తుల స్వరం తీవ్రమవుతోంది. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ ముఖ్యనేతలు ఆదివారం నగర శివారులోని ఓ ఎమ్మెల్యే విద్యాసంస్థలో మరోమారు సమావేశమయ్యారు. త్వరలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారంతో పాటు.. జిల్లా పాలనలో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కొంతకాలంగా సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల సీనియర్లంతా నగర శివారులోని ఓ రిసార్ట్‌లో రహస్యంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం మరోసారి నేతలంతా కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమాలోచనలు జరిపారు. అధినేతకు వివరిద్దాం.. టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు.. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి సేవలందించిన కీలక నేతల మాటలు ఖాతరు చేయకుండా మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుండడంతో వారిలో అసంతృప్తి రాజుకుంది. పార్టీలో కీలక పదవులన్నీ దక్కించుకోవడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి కుటుంబీకులకు టికెట్ ఇచ్చే విషయంలోనూ సీనియర్లు తీవ్రంగా విభేదిస్తున్నారు. మొదట్నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారికి కాకుండా ఇలా ఒకే కుటుంబానికి చెందినవారికి ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై అసంతృప్తులంతా త్వరలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల ఒకసారి సమావేశమైన నేతలు.. తాజాగా మరోమారు భేటీ కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జెడ్పీలోనూ అదేతీరు.. సీనియర్లను కలుపుకొంటూ పాలనలో వారి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా పాలనలో ఏకపక్ష ధోరణి కనిపిస్తోందనేది పార్టీ నేతల వాదన. అటు జిల్లా పరిపాలనతో పాటు.. జిల్లా పరిషత్‌లోనూ మంత్రి తన అనుయాయులకే మద్దతిస్తున్నారు. దీంతో పలు పనుల మంజూరులో పక్షపాతం వహిస్తున్నట్లు సీనియర్ నేతలు తాజా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. దీంతో జెడ్పీ పనుల్లోనూ సీనియర్ల మాట చెల్లుబాటు కావడం లేదనే నిర్ణయానికి వచ్చిన నాయకులు... ఈ అంశాలపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించి అక్కడే తేల్చుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
ప్రణాళికాబద్ధంగా పంపకాలు
ముగిసిన డీపీసీ ఎన్నికల ప్రక్రియ ⇒ గ్రామీణ స్థానాలు ఏకగ్రీవం ⇒పట్టణ సీట్లకు తప్పని పోటీ ⇒మూడు స్థానాలకు ఓటింగ్ ⇒విజేతలను ప్రకటించిన సీఈఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికల క్రతువు ముగిసింది. పార్టీల పరస్పర అంగీకారంతో గ్రామీణ స్థానాలు(జిల్లా పరిషత్) ఏకగ్రీవం కాగా, మూడు పట్టణ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్‌లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా, ఆ తర్వాత ఓట్లను లెక్కించారు. మూడు సీట్లకు ఐదుగురు బరిలో ఉండడంతో మొదటి వరుసలో నిలిచిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. జిల్లాలోని బడంగ్‌పేట, తాండూరు, వికారాబాద్ , పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలకు చెందిన 119 మంది కౌన్సిలర్లు ఓట్లు వేయాల్సివుండగా, 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో అధికంగా 15 మంది వికారాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నారు. ‘మంత్రా’ంగం! తొలిసారి డీపీసీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించడంతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని పార్టీల నాయకత్వంతో చర్చించి రాజీమార్గాన్ని పాటించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్(గ్రామీణ) స్థానాల(10) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, పట్టణ నియోజకవర్గాల స్థానాల(14) విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మూడు బీసీ(జనరల్) స్థానాలకు ఐదుగురు పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరైంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఆనంతరం సీఈఓ చక్రధర్‌రావు ముగ్గురు విజేతలను ప్రకటించారు. డీపీసీ సభ్యులు వీరే..! గ్రామీణ నియోజకవర్గం: పోలమెళ్ల బాలేష్, జే.కే.శైలజ, పి.సరోజ, కర్నాటి రమేశ్‌గౌడ్, పట్లోళ రాములు, ముచ్చోతు మంజుల, ఎనుగుల జంగారెడ్డి, మంద సంజీవరెడ్డి, చింపుల శైలజ, ముంగి జ్యోతి. పట్టణ నియోజకవర్గం: పి. స్వప్న, ఆకుల యాదగిరి, పి.నర్సిములు, యాతం శ్రీశైలంయాదవ్, పూడూరి దమయంతి, బి.సునీత, ఈరంకి వేణుకుమార్‌గౌడ్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, విజయేందర్‌గౌడ్, వినోద్‌కుమార్‌జైన్, అంజలి, అమరావతి, చామ సంపూర్ణరెడ్డి, దేవిడి స్వప్న. -
ఆర్టీసీకి 2 వేల కొత్త బస్సులు
* ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పోలీస్ విభాగం రూపురేఖలు మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీపై దృష్టి సారించారు. సంస్థ పనితీరును మెరుగుపరిచేందుకు ఆయన చర్యలు చేపట్టారు. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో రెండు వేల కొత్త బస్సులను సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించారు. తొలి విడతగా రెండు మూడు నెలల్లోనే వెయ్యి కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీకి సీఎం అనుమతించారు. ఇందులో ఆర్టీసీ సొంతంగా 500 బస్సులను కొనుగోలు చేయనుండగా, మిగతా వాటిని ప్రైవేటు నుంచి అద్దెకు తీసుకోనుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి సమావేశమైన కేసీఆర్.. ఆర్టీసీ పరిస్థితి, పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు అందజేసిన పలు ప్రతిపాదనలను పరిశీలించి కొన్నింటికి అక్కడికక్కడే ఆమోదం తెలిపారు. మరికొన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కొత్త బస్సులకు రూ.150 కోట్ల కేటాయింపుపై హర్షం తెలంగాణలో ఆర్టీసీకి కొత్త బస్సులు కొనేందుకు ముఖ్యమంత్రి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించటం అభినందనీయమని ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ కొత్త రూపును సంతరించుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్, బీజేపీ ఓటమి ఖాయం
- కార్యకర్తల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి - మంత్రి హరీష్‌రావు సమక్షంలో పార్టీలో చేరిన నేతలు సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి హరీష్‌రావు, ఎంపీలు బీబీపాటిల్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. తమ పార్టీ అభ్యర్థి కొత్తా ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు సేవచేసేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజాసమస్యలు పరిష్కరించటంతోపాటు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో జరుగుతున్న ఈఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన ఫలితంగానే రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ పాపాలను కడిగే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్లో చేరిన నరేంద్రనాథ్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్‌రావు తనకు గతంలో ఎంత నచ్చజెప్పినా వినకుండా బీజేపీ నుంచి పోటీచేసి అన్నివిధాలా నష్టపోయానన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తనను ఉపయోగించుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానుక ఇద్దాం: బాబూమోహన్ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామని ఎమ్మెల్యే బాబూమోహన్ పేర్కొన్నారు. రేపటి నుంచి తాను గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్, బీజేపీ నాటకాలను బయటపెడతానన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సంగారెడ్డిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణద్రోహికి టికెట్ ఇచ్చిన బీజేపీకి ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎం.ఎ.హకీం, విజయేందర్‌రెడ్డి, జలాలుద్దీన్‌బాబా, మందుల వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. -
'అవసరమైతే ప్రైవేటు బస్సులను నిలిపివేస్తాం'
హైదరాబాద్:నగరంలోని రవాణా వ్యవస్థ ఆధునీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు ఆరంభించింది. ఇందుకు గాను టీ.ప్రభుత్వ బృందం ముంబై నగరానికి బయల్దేరనుంది. దీనికి సంబంధించి రవాణశాఖా మంత్రి పి. మహేందర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ ప్రభుత్వ బృందం రవాణా వ్యవస్థ పరిశీలనకై ముంబైకి వెళ్లనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అవసరాల మేరకు కొత్తగా 80 బస్సులను నడుపుతామని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రైవేటు బస్సు సర్వీసులను నిలిపివేస్తామన్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచే విధులు నిర్వహించాలని మహేందర్ రెడ్డి సూచించారు.