
గులాబీ దళంలో అసంతృప్తి జ్వాలలు
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తుల స్వరం తీవ్రమవుతోంది. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ ముఖ్యనేతలు ఆదివారం నగర శివారులోని ఓ ఎమ్మెల్యే విద్యాసంస్థలో మరోమారు సమావేశమయ్యారు. త్వరలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారంతో పాటు.. జిల్లా పాలనలో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కొంతకాలంగా సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల సీనియర్లంతా నగర శివారులోని ఓ రిసార్ట్‌లో రహస్యంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం మరోసారి నేతలంతా కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమాలోచనలు జరిపారు.
అధినేతకు వివరిద్దాం..
టీఆర్‌ఎస్ ఆవిర్భావం మొదలు.. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి సేవలందించిన కీలక నేతల మాటలు ఖాతరు చేయకుండా మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుండడంతో వారిలో అసంతృప్తి రాజుకుంది. పార్టీలో కీలక పదవులన్నీ దక్కించుకోవడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి కుటుంబీకులకు టికెట్ ఇచ్చే విషయంలోనూ సీనియర్లు తీవ్రంగా విభేదిస్తున్నారు. మొదట్నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారికి కాకుండా ఇలా ఒకే కుటుంబానికి చెందినవారికి ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై అసంతృప్తులంతా త్వరలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల ఒకసారి సమావేశమైన నేతలు.. తాజాగా మరోమారు భేటీ కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
జెడ్పీలోనూ అదేతీరు..
సీనియర్లను కలుపుకొంటూ పాలనలో వారి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా పాలనలో ఏకపక్ష ధోరణి కనిపిస్తోందనేది పార్టీ నేతల వాదన. అటు జిల్లా పరిపాలనతో పాటు.. జిల్లా పరిషత్‌లోనూ మంత్రి తన అనుయాయులకే మద్దతిస్తున్నారు. దీంతో పలు పనుల మంజూరులో పక్షపాతం వహిస్తున్నట్లు సీనియర్ నేతలు తాజా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. దీంతో జెడ్పీ పనుల్లోనూ సీనియర్ల మాట చెల్లుబాటు కావడం లేదనే నిర్ణయానికి వచ్చిన నాయకులు... ఈ అంశాలపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించి అక్కడే తేల్చుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.