నెల రోజుల్లో ఆర్టీసీకి పాలకమండలి
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
5న షీ-క్యాబ్స్ ప్రారంభం
ఆర్‌సీ కార్డుపై ఫొటో ముద్రించే విధానం ప్రారంభం
హైదరాబాద్: నెలరోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు నెలల్లో రెండు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో ఆర్టీసీ విభజన జరిగేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలిపారు. రవాణాశాఖ పనితీరును మంగళవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బస్సు ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని, 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటనతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై భారం పడ్డ నేపథ్యంలో చార్జీల సవ రణ అంశం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే చార్జీలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు.
రవాణాశాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల ఆదాయాన్ని సాధించాల్సి ఉందని, గడచిన నాలుగు నెలల్లో రూ.800 కోట్లు సాధించటం ద్వారా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరి చిందని, ఇందుకు అధికారులను అభినందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఇందుకు స్థలం సేకరించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు. ఆగస్టు 15న షీ-క్యాబ్స్ ప్రారంభమవుతాయని, కోర్టు ఆదేశం మేరకు వాహనాలకు తెలంగాణ సిరీస్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్‌సీ కార్డుపై వాహన యజమాని ఫొటో..
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని ఫొటో ముద్రించే కొత్త పద్ధతిని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి ఆర్‌సీ కార్డుపై యజమాని ఫొటో వస్తుందని, దీన్ని పాత వాహనాల విషయంలో అమలు చేస్తామన్నారు. హరితహారం పథ కంపై అవగాహన కల్పించేందుకు హరితహారం లోగో ముద్రించిన లెసైన్సులనే జారీ చేస్తామన్నారు.