ఆర్టీసీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి(ఏసీడీపీ) నుంచి చేయూత అందబోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి కొంత మొత్తాన్ని ఆర్టీసీకి ఇవ్వనున్నారు. బస్టాండ్లకు కొత్త భవనాలు, బస్టాం డ్లలో మంచినీటి వసతి, కొత్త బల్లలు, ఫ్యాన్ల ఏర్పాటు, బస్టాండు, దానిని ఆనుకుని ఉండే డిపోలకు సీసీ రోడ్లు, మూత్రశాలల నిర్మా ణం మొదలైనవి ఈ నిధులతో చేపట్టనున్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు లే ఎక్కువగా ఉండటంతో అభివృద్ధికి డబ్బు లు లేకుండాపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు నిధులు ఇవ్వలేకపోతోంది. దీంతో ఏళ్లు గడుస్తున్నా కనీస మరమ్మతులకు కూడా బస్టాండ్లు నోచుకోవటం లేదు.
ఈ నేపథ్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశారు. ఆర్టీసీ పరిస్థితి సరిగా లేనందున ప్రయాణికులకు వసతి కల్పించటంలో కొన్ని ఇబ్బందు లు ఎదురవుతున్నాయని, దాన్ని గుర్తించి వారి వారి నియోజకవర్గాల పరిధిలోని డిపో లు, బస్టాండ్లలో అవసరమైన పనులకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు. దీనికి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొన్ని పనులకు చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. వాటి తో ఆయా నియోజకవర్గాల పరిధిలోని డిపోల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో ఎంపీలకు కూడా మంత్రి మహేందర్‌రెడ్డి లేఖలు రాయనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఒక్కో ఎమ్మెల్యేకు ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తోంది. అలాగే ఎంపీ లాడ్స్ కింద పార్లమెంటు సభ్యులకు రూ.5 కోట్లు అందుతున్నాయి.