ఆర్టీసీ గుండెల్లో దడ!
- కొత్త వేతన సవరణ కోసం డిమాండ్ చేస్తున్న కార్మికులు
- పెండింగులోనే గత ఫిట్‌మెంట్ బకాయిలు
- సరిగ్గా నెల జీతాలే ఇవ్వలేని దుస్థితిలో సంస్థ
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణతో ఒక్కసారిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆర్టీసీలో అప్పుడే తదుపరి వేతన సవరణ డిమాండ్లు ఊపందుకున్నాయి. వచ్చే మార్చితో ప్రస్తుత వేతన సవరణ గడువు పూర్తి కానున్నందున వెంటనే కొత్త వేతన సవరణ ప్రకటించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత వేతన సవరణ ఆలస్యంగా అమలైనప్పటికీ, కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటనతో కార్మికుల్లో ఆనందం నిండినా, ఆర్టీసీ మాత్రం కోలుకోని విధంగా దెబ్బతింది. మొత్తం దాదాపు రూ.1,500 కోట్లు భారం పడగా, వేతన సవరణ ఆలస్యంగా జరగడంతో సంబంధిత బకాయిలు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ఏ నెలకానెల జీతాలు చెల్లించేందుకే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
అందని వేతనాలు..
ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒకటో తేదీన జీతాలు చెల్లించటంలో యాజమాన్యం విఫలమవుతోంది. గత నెల రెండో తేదీ రాత్రికి గానీ కార్మికుల ఖాతాల్లో జీతాలు పడలేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలన్నరగా ఆర్టీసీకి రోజుకు రూ.80 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా నవంబర్‌లో రూ.61 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. నవంబర్‌లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగా నమోదు కావాలి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయానికి బదులు భారీ నష్టాన్నే మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో జీతాలు చెల్లించేందుకే యాజమాన్యం నానాపాట్లు పడుతోంది.
కాగా, వేతన సవరణ భారంతో కుదేలైన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు ఫలితమిచ్చిన చర్యలేమీ లేవు. దీంతో సీఎం కూడా ఆర్టీసీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో కొత్త వేతన సవరణ డిమాండ్ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. కాగా, కార్మికుల ముందస్తు అనుమతి లేకుండా వారి జీతం నుంచి రూ.వంద చొప్పున కోత పెట్టి సైనిక సంక్షేమ నిధికి సంస్థ వితరణ చేసింది. బ్యాంకు ఖాతాలో జీతాలు పడ్డ తర్వాత గానీ విషయం కార్మికులకు తెలియలేదు. ముందు చెప్పకుండా కోత పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
వెంటనే బకాయిలు చెల్లించాలి: ఎన్‌ఎంయూ
గత వేతన సవరణ కాలపరిమితి వచ్చే మార్చితో ముగుస్తున్నందున ప్రభుత్వం వెంటనే కొత్త వేతన సవరణ కసరత్తు మొదలుపెట్టాలని ఆర్టీసీ ఎన్‌ఎంయూ డిమాండ్ చేసింది. ఈసారి ఆలస్యం కాకుండా చూడాలని సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, కమాల్‌రెడ్డి, మౌలానా, రఘురాం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత సవరణకు సంబంధించిన బకాయిలతో పాటు ఐదేళ్ల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, 4 నెలల కాలానికి పెరిగిన డీఏ బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.