కొత్త బస్సులకు నేడు మోక్షం
- మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- నెలలుగా పార్కింగ్ యార్డుకే పరిమితం...
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మరీ కొనుగోలు చేసిన దాదాపు 300 బస్సులకు 4 నెలల తర్వాత మోక్షం కలుగు తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించినప్పటికీ, సీఎంకు పని ఒత్తిడి కారణంగా వీలు చిక్కకపోవటంతో 4 నెలలుగా ఆ బస్సులు పార్కింగ్ యార్డుకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు వాటిని సీఎం గురువారం మధ్యాహ్నం ప్రారంభించబోతున్నారు. రూ. 350 కోట్లతో 1,100 కొత్త బస్సులు కొనాలని గతంలోనే ఆర్టీసీ నిర్ణయిం చింది. ఇందులో తొలుత 600 బస్సులు కొన్నది. గత డిసెంబర్ నుంచి విడతలవారీగా వస్తున్న ఈ బస్సులను ముషీరాబాద్‌లోని పార్కింగ్ యార్డులో ఉంచింది. కానీ సీఎం కార్యాలయం నుంచి ప్రారంభోత్సవ ముహూ ర్తం ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో కొత్తగా వచ్చే బస్సులు నిలిపేందుకు చోటు లేకుండా పోయింది.
300 బస్సులను జిల్లా లకు పంపి మరో 300 బస్సులను అలాగే ఉంచేసింది. ఎట్టకేలకు బుధవారం సీఎంవో నుంచి ప్రారంభోత్సవ కబురు అందటంతో వాటి దుమ్ము దులిపి, కడిగి సిద్ధం చేశారు. మొదట మూడో తేదీన ప్రారంభోత్సవం అని చెప్పినా తర్వాత దాన్ని ఐదుకు మార్చారు. మళ్లీ ఇప్పుడు నాలుగో తేదీకి మార్చి ఖరారు చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం వాటిని ప్రారంభించ నున్నారు. వెంటనే వాటిని జిల్లాలకు పంపనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి. వేసవిలో రద్దీ పెరిగినందున కొత్త బస్సుల అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే సగానికిపైగా వేసవి గడిచిపోయినందున మిగిలిన రోజుల రద్దీ కనుగుణంగా కొత్త బస్సులను వెంటనే డిపోలకు కేటాయించనున్నారు.