సాక్షి, అమరావతి: ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కొత్తగా 650 బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. చాలా ఏళ్ల తరువాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జీతాల వ్యయం, అందుకోసం అప్పులు, వాటిపై వడ్డీలు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఆర్టీసీ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తోంది.
అప్పుల భారం పెరిగిపోవడంతో తొమ్మిదేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఏటా రూ.350 కోట్ల జీతాల భారం లేకుండాపోయింది. ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.2 వేలకోట్ల అప్పులను తీర్చగలిగింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో ఆర్టీసీ రాబడి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది.
అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 బస్సులు
మొత్తం ఏడు కేటగిరీల కింద రూ.650 కోట్లతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సర్విసుల వారీగా అమరావతి–11, వెన్నెల–8, ఇంద్ర–32, స్టార్‌లైనర్–27, సూపర్‌లగ్జరీ–735, అ్రల్టాడీలక్స్–145, ఎక్స్‌ప్రెస్–542 బస్సులు కొనుగోలు చేయనుంది. అమరావతి సర్విసు కింద 11 బస్సులను నేరుగా ఓల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 1,489 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది.
బీఎస్–6 మోడల్‌తో అత్యాధునిక ప్రమాణాలతో బస్సులను సరఫరా చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. బిడ్లను ఈ నెల 20న తెరిచి, అనంతరం నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 కొత్త బస్సుల చొప్పున ప్రవేశపెట్టనుంది. 2024 ఏప్రిల్ నాటికి మొత్తం 1,500 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. మరో 600 బస్సులను ఆధునికీకరించి పల్లెవెలుగు సర్విసులుగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులు అప్పుడప్పుడు బ్రేక్‌డౌన్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ సర్విసులుగా ఉంటూ తక్కువ మైలేజీ ఇస్తున్న 600 బస్సుల బాడీలను రీఫర్బిíÙంగ్ ద్వారా ఆధునికీకరించి పల్లెవెలుగు సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment