ఒక్కొక్కరూ ఓ కేసీఆర్‌ కావాలె | CM KCR Speech at Launch Of TSRTC Vajra AC Buses | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరూ ఓ కేసీఆర్‌ కావాలె

Published Fri, May 5 2017 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఒక్కొక్కరూ ఓ కేసీఆర్‌ కావాలె - Sakshi

ఒక్కొక్కరూ ఓ కేసీఆర్‌ కావాలె

ఆర్టీసీని కాపాడుకోవాలె: సీఎం పిలుపు
అప్పట్లో ఆర్టీసీని లాభాల బాట పట్టించిన
మంత్రి మొదలు కార్మికుల దాకా కలిసి పని చేయాలె
వజ్ర మినీ ఏసీ తదితర కొత్త బస్సులు ప్రారంభించిన సీఎం


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆర్టీసీ అంటే సాధారణ విషయం కాదు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది దానిమీదే ఆధారపడ్డరన్న సంగతి మరవొద్దు. నిత్యం 90 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులల్లనే తిరుగుతరు. అంటే దాదాపు ఐదో వంతు తెలంగాణ బస్సులల్లనే ఉంటదన్నట్టు. ఆర్టీసీపై ఎంత గురుతర బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో తీవ్ర నష్టా ల్లో ఉన్న ఆర్టీసీని నేను రవాణా మంత్రిగా రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చిన. ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ ఒక కేసీఆర్‌ కావాలె. మీరు తలచుకుని వంద శాతం పనిచేస్తే సంస్థ బాగుపడ్తది.

అభి ప్రాయ భేదాలతో నవ్వేటోని ముంగట మనం జారిపడొద్దు. తెలంగాణ ఆర్టీసీ దేశంలో భేషని పించుకోవాలె. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీ రథ పథకాలను ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోతున్నరు. షీ టీమ్స్‌ను చూసి ఇతర రాష్ట్రాల్లోనూ మొదలు పెడుతున్నరు. రుణ మాఫీ ఎట్ల చేసినమా అని నిన్నటికి నిన్న మహారాష్ట్రవాళ్లు మన దగ్గర నేర్చుకొని పోయిండ్రు. తెలంగాణ మూడేళ్ల పసికూన. యంగెస్ట్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియా. అయినా ఇన్ని రాష్ట్రాల వాళ్లు మన దగ్గరికొచ్చి చూసిపోతు న్నరు. రేపు మన ఆర్టీసీని కూడా చూస్తందుకు కూడా అట్ల రావాలె’’ అంటూ ఆర్టీసీ యంత్రాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఉద్బోధించారు.

ఆర్టీసీ కొత్తగా కొను గోలు చేసిన వజ్ర ఏసీ మినీ, పల్లె వెలుగు మినీ బస్సులతోపాటు ఇతర పెద్ద బస్సులను గురు వారం ప్రగతి భవన్‌లో ఆయన ప్రారంభిం చారు. ఇక నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ‘‘బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రతిపాదించిన రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తాం. హైదరాబాద్‌ నగరంలో వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో భర్తీ చేస్తాం. ఆ మొత్తం నెల నెలా ఆర్టీసీకి అందేలా చూస్తా’’అని హామీ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలు గతంతో పోలిస్తే కొంత నష్టాలు తగ్గినా లాభాల్లోకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీపై నిత్యం కత్తే
సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీపై నిత్యం ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుండేదని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.750 కోట్లు ఇచ్చి, కొన్ని అప్పులు తీర్చి సంస్థను బతికించే ప్రయత్నం చేసిందన్నారు. ‘‘ప్రజా రవాణా సంస్థను నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా ఒక సామాజిక బాధ్యత. సమస్య మూలాల్లోకి పోయి సంస్థను ఎలా నడపాలా అని గత పాలకులు పరిశోధన చేయకపోవడం దారుణం. ఆర్టీసీని బతికించుకోవాలె. విద్యుత్‌ సంస్థలను బతికించుకునేందుకు వాటికి రూ.12,000 కోట్ల అప్పులను రాష్ట్రం ప్రభుత్వ మే భరిస్తున్నది.

 అట్లే ఆర్టీసీని కూడా ఎట్ల గట్టున పడేయాలా అని ఆలోచిస్తున్నం. సమై క్య రాష్ట్రంలో కూడా లేని విధంగా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1,000 కోట్లు కేటాయించినం. బస్‌ పాస్‌ వంటివాటిని పైసాపైసా రీయింబర్స్‌ చేస్తం. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లో తిరుగుతున్న బస్సుల సంఖ్యే పలు చిన్న రాష్ట్రాల్లోని మొత్తం బస్సుల కంటే ఎక్కువగా ఉంటుంది! నగరం లో వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలున్నా జనం మాత్రం ఆర్టీసీ బస్సుల్లో వేలాడుతూ మరీ పోవడం చూస్తే ఆశ్చర్యమైతది. 3,000 పై చిలుకు బస్సులు నగరంలో నిత్యం రద్దీగా తిరుగుతున్నయంటే అది ఆర్టీసీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం.

అందుకే మనం ఆర్టీసీని కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్దేశం తోనే సంస్థ నష్టాల్లో ఉన్నా 55,000 మంది కార్మికులకు మంచి ఫిట్‌మెంట్తో వేతనాలు పెంచినం. 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగు లను క్రమబద్ధీకరించినం. ఆర్టీసీని లాభాల్లో ఉన్న సంస్థలకు అప్పగించటం ద్వారా వాటి లాభాలతో దాని నష్టాలను భర్తీ చేసే విధానం వేరే దేశాల్లో ఉంది. మన దగ్గర కూడా ముంబైలో అమలవుతున్నది. అదే మాదిరిగా హైదరాబాద్‌లో వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ భర్తీ చేసేలా చట్ట సవరణ చేసినం. ఈ సభకు వచ్చే ఐదు నిమిషాల ముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో మాట్లాడిన. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఆ మొత్తాన్ని నెలనెలా చెల్లించాల ని చెప్పిన’’ అని సీఎం వెల్లడించారు.

మరిన్ని ప్రాంతాలకు వజ్ర ఏసీ బస్సులు
బస్సెక్కాలంటే ఇమ్లీబన్‌కో, జూబ్లీ బస్టాండు లో వెళ్లే విధానం నుంచి బస్సులే కాలనీలకు వచ్చే కొత్త విధానం ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. వజ్ర పేరుతో వస్తున్న ఏసీ మినీ బస్సులు కాలనీలకే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకునే విధానం మంచి ఫలితాలనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 21 సీట్లుండే ఈ బస్సులను తొలుత హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్, వరంగల్‌ నడుపుతున్నారు. వీటిని కరీంనగర్‌తో పాటు సింగరేణి, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలుండే మంచిర్యాల, రామగుండం, ఆదిలాబాద్‌ల వైపు కూడా నడపాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. ఈ బస్సులు రోడ్డెక్కాక వేరే ప్రాంతాల నుంచి కూడా డిమాండ్‌ వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదన్నారు.

సోయి తప్పి ఉండొద్దు...
రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్, అధికారులు, కార్మికులు అంతా ఓ కుటుంబంలా చిరునవ్వుతో కలిసిమెలిసి పనిచేయాలని సీఎం హితబోధ చేశారు. ‘‘రాష్ట్ర పెద్దగా కఠినంగా చెప్తున్న. మీలో ఎవరూ సోయి తప్పి వ్యవహరించొద్దు. భేదాభిప్రాయాలు లేకుండా వ్యవహరించాలి. ఎవరికి వాళ్లమే అన్నట్టుగా వ్యవహరిస్తే అది దుర్మార్గమైతది. మనం బాగా పని చేస్తే సంస్థ బాగుంటది. ఎన్ని నష్టాలొచ్చినా బాగా చేయించేవారుంటే గాడిలో పడతది. రైతు కొద్ది గుర్రమని గుర్తించాలె. మంత్రి, చైర్మన్, ఎండీ ముందుండి సంస్థను లాభాలబాట పట్టించాల్సిందే. అందుకోసం అంతా సోదర భావంతో పని చేయాలె’’అని పిలుపునిచ్చారు. రవాణా మంత్రిగా పనిచేసిన అనుభవంతో సంస్థపై తనకు ప్రేమ ఉందన్నారు.

దటీజ్‌ ఆర్టీసీ
‘‘ఇటీవల వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు పార్టీ పక్షాన దాదాపు 6,000 ఆర్టీసీ బస్సులు బుక్‌ చేశారు. లక్షల మంది తరలి వచ్చిన ఆ సభ అనంతరం ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అంతా బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్లిండ్రు. దటీజ్‌ ఆర్టీసీ. సభ తర్వాత నేను హైదరాబాద్‌వచ్చి నిశ్చింతగా నిద్రపోగలిగానంటే అది ఆర్టీసీ గొప్పతనమే’’అని సీఎం అన్నారు.

బయోడీజిల్‌ సూపర్‌ లగ్జరీలు
కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో బయో డీజిల్‌తో నడిచే సూపర్‌ లగ్జరీ బస్సులు కూడా ఉండటం విశేషం. వజ్ర బస్సుల్లో సీట్లు బుక్‌ చేసుకునే మొబైల్‌ యాప్‌ను కూడా సీఎం ప్రారంభించారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారా యణ, ఎండీ రమణారావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్టీసీ యూనియన్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement