ముగ్గురు ఎంపీల పనితీరు అంతంతే: కేసీఆర్
హైదరాబాద్: తాను చేయించిన సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆందోళన అక్కర్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా ఎంపీల పనితీరుపై ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం నేతల పనితీరుపై సర్వే వివరాలను వెల్లడించారు. ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సీతారామ్ నాయక్‌ల పనితీరు అశించిన స్థాయిలో లేదని సర్వే రిపోర్టులో వెల్లడైందన్నారు.
పనితీరు బాగాలేదని ఆందోళన చెందవద్దని, భవిష్యత్తులో పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆయా నేతలకు కేసీఆర్ సూచించారు. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో ప్లీనరీ సమావేశం, 27న వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 15లోపు మండల, జిల్లాల కమిటీలను వేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.