ప్రగతి పేరుతో భూసేకరణ.. పేద రైతులే టార్గెట్‌! | Boora Narsaiah Goud Opinion on Telangana land acquisition policy | Sakshi
Sakshi News home page

భూ సేకరణా... భూ ఆక్రమణా?

Published Thu, Nov 21 2024 1:30 PM | Last Updated on Thu, Nov 21 2024 1:32 PM

Boora Narsaiah Goud Opinion on Telangana land acquisition policy

అభిప్రాయం

ఈమధ్య  దక్షిణ కొరియాకు చెందిన షూ ఆల్స్‌ కంపెనీ తాము ఇక్కడ 300 కోట్లతో షూ కంపెనీ పెడతామనీ, అందుకు కావలసిన 750 ఎకరాల భూమి ఇస్తే 87 వేల మందికి ఉపాధి కల్పిస్తామనీ ప్రగల్బాలు పలికింది. తెలంగాణలో ఎకరం కోటి రూపాయలనుకున్నా 300 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల విలువైన భూమి అడిగారన్నమాట. అదే విధంగా ఒక స్మార్ట్‌ హెల్త్‌ సిటీ పెట్టడానికి 5,000 ఎకరాలు కావాలని అర్జీ పెట్టింది ఇదే కంపెనీ. దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ కేవలం 5–10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. ఇది ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్లు ఉంది. ఇక ఈ మధ్య ప్రగతి పేరుతో భూసేకరణ చేయడం పేద, మధ్య తరగతి రైతుల పట్ల ఉరితాడులా పరిణమించింది.

భూమి ధరలు పెరగటంతో చిన్న, సన్న కారు రైతులు ధనవంతులు అయ్యే సమయానికి, ప్రభుత్వమే భూ దోపిడీకి పాల్పడి ప్రజలను దారిద్య్రంలోకి నెడుతోంది. ఉన్నోడికి రవ్వంత పోయినా కొండంత లాభం వస్తే, లేనోడు రోడ్డున పడుతున్నాడు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే పరిహారం, కనీసం గుంట ప్లాట్‌ కొనుక్కోవడానికి సరిపోవడం లేదు. ప్రగతి వలన భూముల విలువ పెరిగి వందల, వేల ఎకరాలు ఉన్న వారు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. ఒకసారి మార్కెట్‌ విలువ, ప్రభుత్వ పరిహారం విశ్లేషిస్తే... చౌటుప్పల్‌ దగ్గర ఎకరం 2 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 10 లక్షలు; జహీరాబాద్‌ దగ్గర 1.5 నుండి 2 కోట్లు ఎకరానికి ధర ఉంటే 7–10 లక్షలు మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వం భూస్వామిగా కాకుండా, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) సేకరించిన భూమి ఎంత, అందులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటి వలన ఎంతమందికి ఉపాధి కల్గుతుంది వంటి వివరాలతో ఒక శ్వేతపత్రం (వైట్‌ పేపర్‌) విడు దల చేయాలి. కొత్తగా సేకరించే భూమి... పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల కొరకా లేదా పూర్తిగా ప్రజా అవసరాల కొరకా అనేది స్పష్టం చేయాలి. గతంలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూమిలో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తేల్చాలి.  

ఇప్పటికే వివిధ సంస్థలు, వ్యక్తులు లేదా ట్రస్టులకు వివిధ ఉద్దేశాలతో కేటాయించిన భూమిలో వేరే వ్యాపారాలు, సంస్థలు నెలకొన్నా యేమో చూడాలి. భూములు సేకరించే ముందు, నిర్వాసితులు అవుతున్న ప్రజల, రైతుల ప్రయోజనాలనే ముఖ్యంగా ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. ఆ భూముల వలన వచ్చే ప్రయోజనాలలో నిర్వాసితులకు సింహభాగం దక్కాలి. ఒక ప్రాజెక్ట్‌ లేదా రోడ్డు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలలో భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి, నిర్వాసితులకు కూడా ఆ లాభం దక్కేలా చూడాలి.

ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని మొదట ఉపయోగించిన తర్వాత, కొత్త భూ సేకరణకు శ్రీకారం చుట్టాలి. అలాగే ఒక ప్రాజెక్టులో కేవలం ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న రైతు సర్వం కోల్పోతే వారు రోడ్డున పడతారని గమనించాలి. అదే ఎక్కువ భూమి ఉన్నవారు కొంత పోయినా, మిగతా భూమి విలువ పెరగటం వలన వారికి లాభం కలుగుతుంది. అందువల్ల భూమిని కోల్పోయేవారు ఒక్కొక్కరు ఎంతెంత శాతం భూమిని కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రాతిపదికన పరిహార చెల్లింపు ఉండాలి.

ప్రాజెక్టులలో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి. ఉదాహరణకు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 6,690 కోట్లు. ఇందులో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి 5,500 ఎకరాలు. రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే. రోడ్డుకు అటు, ఇటు ఉన్న రైతుల భూముల విలువ లక్షల కోట్లకు పెరిగింది. కాంట్రాక్టర్‌ లాభపడ్డాడు. ప్రభుత్వం  7,300 కోట్లకు అంటే ఏడాదికి 240 కోట్లకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై సంవత్సరానికి రూ. 550 కోట్ల రాబడి ఉంది. మున్ముందు అది ఏడాదికి రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే రిజిస్ట్రేషన్‌ విలువ ఇచ్చి, మార్కెట్‌ విలువ ప్రకారం ఆ కంపెనీలో నిర్వాసితులకు షేర్‌ ఇచ్చి ఉంటే, వచ్చే 30 సంవత్సరాలు నిర్వాసిత రైతులకు నెలకు కొంత పరిహారం అందేది. అలానే పారిశ్రామిక వాడలు, కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు నిర్వాసిత రైతులకు భూమి మార్కెట్‌ విలువ ప్రకారం షేర్‌ ఇవ్వడం వలన వారు కూడా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.

వేల ఎకరాలు ల్యాండ్‌ బ్యాంకు ఉన్న కంపెనీల దగ్గర నుండి భూమిని సేకరించి వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి  ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడం వలన ఎవ్వరికీ నష్టం లేకుండా ప్రగతి సాగుతుంది. అలానే వారికి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ లే ఔట్లలో ప్లాట్‌ కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక వెసులుబాట్లు, స్వయం ఉపాధికి లోన్లు... అవీ వడ్డీ రహిత రుణాలు అందించడం; ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా కేటాయించడం... ఇలా పలు విధాలుగా భూ నిర్వాసితులకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉంది.

 చ‌ద‌వండి: మంచి పనిని కించపరుస్తారా?

బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టీడీఆర్‌) లాంటివి ఇవ్వడం వలన వారికి అధికంగా ఆర్థిక సుస్థిరత కలుగుతుంది. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు, టీడీఆర్‌ ఇవ్వడం తెలిసిందే. అదే విధంగా భూ నిర్వాసిత కుటుంబాలకు రిజిస్ట్రేషన్‌ విలువను కాకుండా, ప్రస్తుత మార్కెట్‌ విలువకు అనుగుణంగా టీడీఆర్‌ ఇవ్వడం వలన వారికి లబ్ధి జరుగుతుంది. ఉదారణకు ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) కొరకు దాదాపు 9,000 ఎకరాలు కావాలి. ప్రస్తుతం ఏరియాను బట్టి మార్కెట్‌ విలువ ఎకరం రూ. 50 లక్షల నుండి రూ. 3 కోట్ల వరకు ఉంది. కానీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ వేల్యూ మీదనే పరిహారం చెల్లిస్తుంది. దీని వలన రైతులు, ముఖ్యంగా సర్వం కోల్పోయే చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్ట పోతారు. వారికి పరిహారమే కాకుండా, టీడీఆర్‌ కూడా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది.

చ‌ద‌వండి: కులరహిత వ్యవస్థకు తొలి అడుగు

చాలా సందర్భాలలో చిన్న, సన్న కారు రైతులు, ముఖ్యంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నారు. వివిధ కంపెనీల పేరు మీద వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. కేవలం పేద రైతులే టార్గెట్‌ కావడం బాధకారం. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.


- డాక్ట‌ర్‌ బూర నర్సయ్య గౌడ్‌  
భువనగిరి మాజీ ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement