పరిశ్రమల ఏర్పాటుకు భూమి రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్షణ కేటాయింపు నకు వీలుగా ఉన్న భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృందాలు ఇటీవల జిల్లాలో పర్యటించి ఎంపిక చేసిన భూములను పరిశీలించి వెళ్లాయి. సుమారు నెల రోజుల పాటు జిల్లాలో భూములను సర్వే చేసి 13.439 ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్నట్లు తేల్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగం ద్వారా బుధవారం నివేదిక కూడా సమర్పించారు.
అధికారులు సమర్పించిన ఈ నివేదికపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. తాజాగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యతపై ఆరా తీసేందుకు సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలంటూ రెవెన్యూ విభాగానికి తొలుత 34,184.59 ఎకరాలు వివరాలు అప్పగించారు. వీటిలో 16,723.07 ఎకరాల భూమి అనువుగా లేదని సర్వేలో తేల్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న 13,439 ఎకరాల్లో 2301.71 ఎకరాలు సమతల భూమి, 3802.49 ఎకరాలు చిన్నపాటి కొండలు, గుట్టలు, 7335.50 ఎకరాలు కొండలతో కూడి ఉన్నట్లు గుర్తించారు.
మహబూబ్‌నగర్‌లోనే అధికం
అత్యధికంగా మహబూబ్‌నగర్ డివిజన్లో 13వేల ఎకరాలకు పైగా భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంది. గద్వాల డివిజన్ పరిధిలో కేవలం 10.36 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్, అటవీ, శిఖం భూముల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలోనూ భూమిని గుర్తించినా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తారని టీఐఐసీ అంచనా వేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని టీఐఐసీ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. హైదరాబాద్- బెంగళూరు మార్గంలో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై ఆసక్తి నెలకొంది.