మూడు హెలికాప్టర్లు.. పలువురు ఫార్మారంగ దిగ్గజాలతో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మూడు హెలికాప్టర్లు.. పలువురు ఫార్మారంగ దిగ్గజాలతో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ముచ్చర్లలో 11వేల ఎకరాల్లో ఔషధనగరి నిర్మించనున్నట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో భూమిని సర్వే చేసి టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దాదాపు నాలుగు నెలలైనా ఈ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు.
ల్యాండ్ బ్యాంక్ : 69,669 ఎకరాలు
ఐటీ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర క్లస్టర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇబ్బడిముబ్బడిగా భూములను సమీకరించింది. జిల్లావ్యాప్తంగా 69,669 ఎకరాలను గుర్తించిన అధికారులు.. వీటిని మూడు భాగాలుగా విభజించారు. వీటిని ఇతర అవసరాలకు కాకుండా పూర్తిగా పారిశ్రామిక అవసరాలకే నిర్దేశించారు. ఖాళీ భూముల లెక్కలు తీయాలని, వివిధ సంస్థలకు బదలాయించినా.. అట్టిపెట్టుకున్న స్థలాల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద భూమల వివరాలను తయారు చేశారు.
ఖాళీ స్థలాలు లేవట!
కొత్తగా ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్న ఔత్సాహికులకు పరిశ్రమలశాఖ షాక్ ఇచ్చింది. పరిశ్రమలు పెడతాం.. స్థలం చూపమని అభ్యర్థించిన 800- 1000 మంది ఔత్సాహికులకు రిక్తహస్తం చూపింది. పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు (ఐడీఏ), పారిశ్రామిక పార్కులు (ఐపీ)లలో ఖాళీ స్థలాల్లేవని తేల్చిచెప్పింది. టీఐఐసీ, రెవెన్యూ అధికారులు కొత్తగా స్థలాలు కేటాయిస్తే తప్ప ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. ఒకవైపు సమృద్ధిగా ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు కేటాయించకుండా అట్టిపెట్టుకోవడం గమనార్హం.