అణువణువూ పరిశీలన
చినజీయర్ స్వామితో కలిసి గుట్టను సందర్శించిన కేసీఆర్
ముందుగా ఏరియల్ సర్వే, ఆలయంలో పూజల నిర్వహణ
దేవస్థానం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
భువనగిరి/యాదగిరికొండ యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామితో కలిసి కొండపై గురువారం అణువణువూ పరిశీలించారు. ఏరియల్ సర్వే, ఆలయంలో పూజలు, సమీక్ష అనంతరం వారు ఆలయ పరిసరాలను తిరిగి చూశారు. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం కొండపై ఉన్న పరిసరాలను నమూనాలో జీయర్‌స్వామికి సీఎం చూపించారు. దక్షిణ ప్రాకారం నృసింహ కాంప్లెక్స్ మీదుగా గుట్ట పరిసర ప్రాంతాలను కలియదిరిగారు. విష్ణు పుష్కరిణి, శ్రీచక్ర కాంప్లెక్సు ప్రాంతాలను సీఎంతో కలిసి స్వామీజీ పరిశీలించారు. కొండ పరిసరాల్లో 2 వేల ఎకరాల్లో చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. ఈసందర్భంగా ఆలయం చుట్టూ నాలుగు మండపాలు, కల్యాణ మండపాలు, తిరుమాడ వీధులు, రాజగోపురాలు, ఆలయంలోనే శాలలు ఇతరత్రా ఆలయాలు వస్తాయని ఆయనకు మాస్టర్‌ప్లాన్‌ను చూపించారు. సీఎం కేసీఆర్, స్థపతి సుందరరాజన్, ఆర్కిటెక్టు అధికారులు జగన్, రాజ్ , ఆనంద సాయిలు కలిసి ఆయనను ఆలయ పరిసరాలను, ఆలయం చుట్టూ సుమారు పద్నాలుగున్నర ఎకరాల స్థలం ఉందని ఆయనకు వివరించారు.
ఆలయ పరిసరాలను ఆయన సుమారు 2గంటల పాటు గర్భాలయం, ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.యాదగిరిగుట్ట చుట్టు పక్కల ఉన్న పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండ , వెంకటాపురంగుట్ట , దాతారుపల్లి గుట్టలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఈ తొమ్మిది గుట్టలను 9 కొండలుగా చేసి వాటికి 9 పేర్లు పెట్టాలని సీఎం కోరారు. దీంతో ముందుగా యాదగిరిగుట్టకు యాదాద్రిగుట్టగా మారుస్తున్నట్లు జీయర్‌స్వామి ప్రకటించారు. 180 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నలుదిక్కులా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ విగ్రహం అంతా ఒకే రాయితో నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే నిండు పౌర్ణమి రోజున అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించడం చాలా సంతోషయ దాయకమన్నారు. అనంతరం జీయర్ స్వామీజీతో పాటు సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ స్థపతి సుందరరాజన్, ఆనంద సాయి, లతో సుమారు గంట పాటు ఆండాళు నిలయంలో సమీక్ష జరిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీత, ఎంపీ బూరనర్సయ్యగౌడ్,ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, వీరేశం, జేసీ సత్యనారాయణ, యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కిషన్‌రావు, ఈఓ గీత, దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి ఆలయ ఆర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.