4.35 గంటలు సీఎం ఉండే సమయం
⇒ రింగు రోడ్డు కోసం ఏరియల్ సర్వే
⇒ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
సాక్షి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముచ్చటగా మూడో సారి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకు రెండు సార్లు జిల్లాకు వచ్చినప్పటికీ... సాంస్కృతిక కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించేందుకు మరోసారి రానున్నారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి ఉదయం 11:30 గంటలకు సీఎం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4:05 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. మొత్తం మీద నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలపాటు జిల్లాలో సీఎం పర్యటన ఉంది.
ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేతో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్ నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాలను అరగంట పాటు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్న భోజనం ముగించుకున్న తర్వాత 3:10 గంటలకు చింతగట్టు సమీపంలో జయగిరి వద్ద టెక్స్‌టైల్స్ పార్కు నిర్మాణం కోసం ప్రతిపాదిస్తున్న స్థలాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4.05 గంటలకు ఆర్ట్స్ కాలేజీ చేరుకుని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
నగరాభివృద్ధిపై గంపెడాశలు
వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గతంలో అనేక సార్లు హామీలు ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఇటీవలే నగర రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సీఎం పర్యటనలో నగరాభివృద్ధిలో భాగమైన పలు కీలక ప్రాజెక్టుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. నగరాభివృద్ధికి సంబంధించి వివిధ పనులకు రూ. 2,500 కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు గతంలోనే రూ. 1,600 కోట్లతో అధికారులు డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకానికి అంకురార్పణ జరగకముందే నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.411 కోట్లతో ప్రణాళికలు, మిగిలిన నిధులతో కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, జంక్షన్లు తదితర మౌలిక సదుపాయల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయలను మెరుగుపరిచేందుకు రూ.150 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధుల లేమి కారణంగా ఈ పనులు ప్రారంభం కాలేదు.
వరంగల్ నగరంలో ఉన్న ప్లానెటోరియంలో ప్రొజెక్టర్ పాడైపోవడంతో నాలుగేళ్లుగా మూతపడి ఉంది. ఈ మేరకు ప్లానెటోరియం పునః ప్రారంభానికి సీఎం కేసీఆర్ చొరవ చూపించాల్సిందిగా జిల్లా ప్రజలు కోరుతున్నారు. వీటితోపాటు హాంటర్ రోడ్డులో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సైన్స్ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ఏడాది కాలంగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నాయి.
అస్తవ్యస్తంగా నగర పాలన
నగరపాలక సంస్థలో అస్తవ్యస్తంగా మారిన పాలన, వేళ్లూనుకున్న అవినీతిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. అన్ని కార్పోరేషన్లలో ఈ- టెండర్ల విధానం కొనసాగుతుండగా... ఇక్కడ బాక్స్ టెండర్లు పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన కార్పొరేషన్-మన ప్రణాళికను అధికారులు సిద్ధం చేసిన తీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని డిప్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అయినప్పటికీ... వారిలో ఎటువంటి మార్పు రాలేదు. సమగ్ర కుటుంబ సర్వేను సైతం పూర్తి స్థాయిలో చేపట్టలేక నగర ప్రజలను కార్పొరేషన్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్‌సిటీ కార్యక్రమం నిర్వహణలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. సేకరించిన పొడి చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోయినా... పట్టించుకునేవారు కరువయ్యారు. కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకుంటున్న సిబ్బంది ఇతర పనుల్లో నిమగ్నమైన పట్టించుకునేవారు కరువయ్యారు. ఆఖరికి డివిజన్ల పునర్విభజన సైతం సకాలంలో చేయలేక బల్దియా విమర్శలపాలైంది. సీఎం ఇక్కడకు రానున్న నేపథ్యంలో నగరంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తారని ప్రజలు గంపెడాశతో ఉన్నారు.