సీఎం ఇంటి నిర్మాణ వేగం పేదల ఇళ్లకేదీ?
30న భూనిర్వాసితుల సదస్సు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఏడాది లోనే పూర్తయిందని.. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీ కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యుల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... అన్ని వసతులతో ఇటీవలనే నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయం ఉండగా.. మరో భవనాన్ని నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ సరిపోకుంటే దాని పక్కన మరో బ్లాకు ఏర్పాటు చేసుకుంటే సరిపోయేదన్నారు.
కేవలం ఒకే ఏడాదిలో, అంత పెద్ద బంగళాను పూర్తిచేసిన ప్రభుత్వం.. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని భూని ర్వాసితులతో ఈ నెల 30న హైదరాబాద్‌లో సదస్సును నిర్వహిస్తున్నట్లు కోదండరాం వెల్లడించారు. ఈ సదస్సుకు కాళేశ్వరం, ఓపెన్‌కాస్టు, నిమ్జ్, పాలమూరు-రంగారెడ్డి, మల్లన్నసాగర్ సహా అన్ని ప్రాంతాల భూనిర్వాసితులను ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పా రు. భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరితే అభివృద్ధి నిరోధకులు అనే భావన కల్పించే వైఖరిని ప్రభుత్వం వీడాలని సూచించారు. జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ఎన్.ప్రహ్లాదరావు, పురుషోత్తం, గోపాలశర్మ, భైరి రమేశ్ పాల్గొన్నారు.