ఆగమేఘాలపై..
మిర్యాలగూడ/దామరచర్ల :జిల్లాలోని కృష్ణపట్టెలో నిర్మించతలపెట్టిన భారీ థర్మల్ విద్యుదుత్పాదన కేంద్రం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూముల సర్వేను ఆగమేఘాల మీద ప్రారంభించి పదిరోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులుకు సూచించారు. మంగళవారం మంత్రులు జగదీష్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, తన ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె.జోషిలతో కలిసి ఆయన దామరచర్ల మండలం వీర్లపాలెం వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలిపాడ్‌లపై రెండు హెలికాప్టర్లలో వచ్చిన సీఎం కేసీఆర్ బృందం దాదాపు నాలుగు గంటలపాటు పర్యటించింది.
ఓ అరగంటపాటు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్‌తో కలిసి విహంగ వీక్షణం ద్వారా దామరచర్ల మండలంలోని భూములను పరిశీలించారు. అధికారులు కూడామరో హెలికాప్టర్‌లో భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించిన కేసీఆర్ పైవిధంగా ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్లాంటు నిర్మించి తీరుతామని, అవసరమయితే వారం రోజులపాటు తాను ఢిల్లీలో కూర్చుని ఈ ఫైలుకు క్లియరెన్స్ తెప్పిస్తానని ఆయన అధికారులతో చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తన ఏరియల్ సర్వే జరిగనప్పుడే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా, కలవలేదు. వచ్చే నెల రెండో తేదీన తాను ఢిల్లీకి వెళుతున్నానని, అప్పటికల్లా ప్రతిపాదనలన్నీ సిద్ధమయితే అనుమతి తీసుకుని వస్తానని, వెంటనే శంకుస్థాపన కూడా చేద్దామని ఆయన అధికారులతో చెప్పారు.
థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు దామరచర్ల అటవీ భూములు అనుకూలంగా ఉన్నాయని, 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ వపర్ ప్లాంట్‌ను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పవర్ ప్లాంట్‌కు అవసరమైన నిరంతరం నీరు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు బొగ్గు రవాణాకు సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మూడు వారాల్లోనే పవర్ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని రకాల అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వంతో చర్చించి అనుమతి వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. 55 వేల కోట్ల రూపాయలతో నిర్మించే థర్మల్ పవర్ ప్లాంట్‌లో 600 ఎకరాల్లో భారీ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. టౌన్‌షిప్‌లో పాఠశాల, ఆస్పత్రి, నివాసాలతోపాటు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా నిర్మించనున్నట్లు తెలిపారు. పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును కృష్ణపట్నం, బందరు నౌకాశ్రమం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపారు.
దామరచర్ల మండలంలో ఇంటికో ఉద్యోగం..
థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక దామరచర్ల మండలంలో ఇంటికో ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వివరించారు. పవర్‌ప్లాంట్‌లో 10 వేల మంది ఉద్యోగులు, మరో 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములుంటే పరిహారం చెల్లించడానికి అధికారులు రికార్డులు కూడా సిద్ధం చేయాలని సూచించారు. 10000 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణందామరచర్ల మండలంలో థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి గాను 10000 ఎకరాల భూమిని సేకరించనున్నారు. వాటిలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి సేకరించాలనే విషయాన్ని అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అదేశించారు. సర్వే పనులు కూడా వెంటనే ప్రారంభించడంతో పాటు మట్టి నమూనాలు కూడా సేకరించాలని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ముఖ్య అధికారులు, సర్వేయర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి 500 ఎకరాలకు ఓ డిప్యూటీ తహసీల్దార్ సారథ్యంలో సర్వేయర్, వీఆర్వోను కేటాయించి ప్రత్యేక పద్ధతిలో సర్వే జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకోసం 20బ్లాకులుగా ఆ భూమిని విభజించేందుకు ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈనెల 26న సర్వేను ప్రారంభించి ఐదు రోజుల్లో పూర్తిచేసి జనవరి 1కల్లా సీఎంకు పంపాలని, ఆయన వచ్చే నెల రెండోతేదీన ఢిల్లీకి వెళ్లే నాటికి అన్ని ప్రతిపాదనలు పంపాలని ఆయన యోచిస్తున్నారు.
సీఎం పర్యటనలో ఉన్నది వీరే...
ఆయన వెంట రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిషోర్, వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ జెడ్‌పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నేతలు నోముల నర్సింహయ్య, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, వేనేపల్లి చందర్‌రావు తదితరులున్నారు.