అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
* 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
* విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు
* మొక్కల సంరక్షణకు గ్రామ హరిత రక్షణ క మిటీలు
* జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోలతో సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: హరిత హారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అట వీ, హౌసింగ్ విభాగాల అధికారులతో సీఎం సమీక్షించారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. హరిత హారం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
దీనికోసం స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. హరిత హారంపై పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో, వీడియో ప్రచారం, కవి సమ్మేళనాలు, అవధానాలు నిర్వహించాలన్నా రు. జూలై 3 నుంచి 10 వరకు హరిత వారో త్సవాలు నిర్వహించాలని అధికారుల్ని ఆదే శించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థుల్ని భాగస్వాములుగా చేయాలన్నారు.
పోలీసులూ పాల్గొనాలి
హరిత ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసులూ భారీగా పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయలో పాల్గొనడం ద్వారా పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. నర్సరీల నుంచి గ్రామాలకు మొక్కలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల తహసీల్దార్లు, వీఆర్వో లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో గ్రామ హరిత రక్షణ కమిటీల్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎంతో సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ బస్సులోనే అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యక్రమాల్ని రూపొం దించాలని కలెక్టర్లను ఆదేశించారు. వారంలోగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలన్నారు.
విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు
ప్రచార కార్యక్రమాల నిమిత్తం సాంస్కృతిక సారథి బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. నదీ పరివాహక ప్రాంతా లు, ప్రార్థనా స్థలాలు, రైల్వే భూములు, ఇతర ఖాళీ జాగాల్లోనూ మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంత మొక్కలకు నీరు పోసేందుకు అగ్నిమాపక వాహనాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలు, ప్రార్థనా మందిరాల మైక్‌సెట్ల ద్వారా, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రచారం కొనసాగించాలన్నారు. అర్చకులు, ఇమామ్‌లు, గురుద్వారాల నిర్వాహకులతోనూ సమావేశం నిర్వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షించాయని, ముఖ్యంగా వాటర్‌గ్రిడ్, టీఎస్ ఐపాస్‌లకు మంచి ఆదరణ లభించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలో మొదటి 3 స్థానాల్లో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కేశవరావు, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.