హరితహారంతోనే భవిత
సీఎం కేసీఆర్
మెదక్: పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ పచ్చగా ఉంటుందని, అందుకోసమే హరితహారం అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలోని ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుకోసం ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
హరితహారం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ప్రతి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 40 వేల మొక్కలు నాటాలన్నారు. టేకు, పండ్ల జాతి మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. పెరుగుతున్న చెట్లను చూసి కనుమరుగైన వర్షాలు తిరిగి రావాలన్నారు.
తెలంగాణ మెరిసిపోవాలి
మిగులు భూముల్లోంచి మూడు మూరల జాగ అమ్మితే రూ.25 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, అందువల్ల అభివృద్ధి నిధులకు ఎలాంటి లోటులేదని కేసీఆర్ వెల్లడించారు. ఐదేళ్లలో తెలంగాణ తళుకులు చూసి దేశమే నివ్వెరపోవాలన్నారు. రాష్ట్రంలో మిగులుగా ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. విలువైన భూములు అమ్మితే వేలకోట్ల ఆదాయం వస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మట్టిరోడ్ల స్థానంలో నాణ్యమైన రోడ్లు వేస్తామన్నారు. ఇక మండల కేంద్రాల వద్ద డబుల్‌లైన్ రోడ్లు, నియోజకవర్గ కేంద్రాల చుట్టూ రింగ్‌రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే గుంత ల్లేని రోడ్లు గల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
ఇంటింటికీ తాగునీరు
వాటర్ గ్రిడ్‌ల ఏర్పాటుతో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ నీరందించకుంటే తాము ఓట్లడగబోమని ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే గ్రామాల్లో ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారులో కనిపిస్తే సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీలు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేయాలన్నారు.
ఉద్యోగులకు పెద్దపీట
తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు పెద్దపీట వేస్తుందని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా 40 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసిన ఘనత ఉద్యోగులదేనన్నారు. అందుకే ఉద్యోగులందరికీ ఉచిత వైద్యం కోసం హెల్త్‌కార్డులు అందజేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల ఆధునీకరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.
గుంట భూమి మునగకుండానే ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఘనపురం చుట్టూ కరకట్టలు కడతామన్నారు. చిన్నశంకరంపేట మండలానికి 132 కేవి సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, మండల కేంద్రానికి రూ.25 లక్షలు, మెదక్ పట్టణానికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.