ఖజానా చూస్తే అందించే పరిస్థితి కనిపించడంలేదు: చంద్రబాబు
వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ అతిపెద్ద సమస్య
కేంద్రం కూడా ఉదారంగా ఆలోచించాలి
వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతున్నాం
ఈరోజు నిత్యావసర ప్యాకెట్లు 15 వేలు కూడా పంచలేకపోయాం
ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలు చూశా
ఈ సంక్షోభం గిగ్ ఎకానమీకి వరమన్న సీఎం వ్యాఖ్యలపై విస్మయం
సాక్షి, అమరావతి : వరద ముంపు తగ్గిన తర్వాత బాధితులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అతిపెద్ద సమస్యగా మారిందని, ఖజనా చూస్తే అటువంటి పరిస్థితులు కనిపించడంలేదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నా అప్పులుచేయడానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి అడ్డువస్తుండడంతో బ్యాంకులతో దీర్ఘకాలిక రుణాల ద్వారా ప్యాకేజీ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఆదుకునే అవకాశంలేకపోవడంతో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సామాజికసేవలో భాగం పంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రెండ్రోజుల్లో అందరితో మాట్లాడి ఎంతవరకు ఆర్థికసాయం చేయగలమన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నివేదికను శనివారం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.
రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ..
ఆదివారం నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకేజీని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 80,000 మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15,000 మందికి కూడా ఇవ్వలేకపోయామన్నారు. ఇంటి వద్దకే అందించే విధంగా వాహనాలను అత్యధిక సంఖ్యలో తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాక ఆహారం పంచే కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలుకుతామన్నారు.
ఇక బుడమేరు మూడో గండిని శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం ఉదయానికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగిందన్నారు. తాజాగా.. గురువారం కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం 9,000 క్యూసెక్కులకు చేరడంతో నగరంలోకి మళ్లీ నీరు వచ్చిందన్నారు. అంతకుముందు.. హెలికాప్టర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానన్నారు.
ప్రకాశం బ్యారేజీ 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు కేంద్రంతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధానిలో భాగమైన విజయవాడ కూడా వరదలను తట్టుకునేలా ఒక మాస్టర్‌ప్లాన్‌ను కూడా రూపొందిస్తామన్నారు.
రాష్ట్రంలో గిగ్ ఎకానమీని విస్తరిస్తాం..
ఇదిలా ఉంటే.. ఈ వరద సంక్షోభం గిగ్ ఎకానమీకి (నచ్చిన సమయంలో పనిచేసుకోవడం) ఒక చక్కటి అవకాశమని, ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటున్నానంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరదలపై సహాయక వివరాలను తెలియచేయడానికి ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుపై అందరూ విస్మయం వ్యక్తంచేశారు.
ఇప్పుడు కాలం మారిందని.. నచ్చిన సమయంలో నచ్చిన చోట పనిచేసుకోవడానికి గిగ్ వర్కర్లు ముందుకొస్తున్నారని, వీరిని పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉబరైజేషన్ (ఆన్‌లైన్ ద్వారా సేవలు)తో తక్కువ ధరలో సేవలు అందించడం ద్వారా డిజిటల్ ఎంపవర్‌మెంట్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వరదల్లో కార్పెంటర్, ప్లంబర్, టీవీ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్స్, పెయింటర్స్.. ఇలా నైపుణ్యం కలిగిన వారి అవసరముందని.. ఇంతమందికి ఇక్కడ సేవలు అందించేవారు సరిపడా లేకపోవడంతో గిగ్ వర్కర్ల సేవలను ఆన్‌లైన్ సేవల సంస్థల ద్వారా అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అవకాశం తీసుకుని గిగ్ ఎకానమీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు.
ఎందుకీ సుత్తి అంటూ బాబుపై సెటైర్లు..
ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది, ఎంత వరద వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా గతంలో తాను వాసర్ ల్యాబ్‌ను అభివృద్ధి చేశానని, కానీ గత ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోకపోవడంతో తాను శిక్షణ ఇచ్చిన వారు వేరే రాష్ట్రాల్లో కన్సల్టెంట్లుగా ఉన్నారంటూ బాబు తన స్వోత్కర్షను చెప్పుకొచ్చారు. నిజానికి.. వాసర్‌ల్యాబ్ అనేది ప్రాజెక్టుల నీటి స్థితిగతులపై రియల్ టైమ్‌లో సేవలందించే విధంగా ఒక ఐటీఐ విద్యార్థి పెట్టుకున్న సంస్థ.
ఇది మన రాష్ట్రంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయిపోవడంతో వారిప్పుడు వేరే రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ, అసలు వాసర్‌ల్యాబ్‌ను తానే సృష్టించినట్లు, వారికి తానే శిక్షణ ఇచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతో విలేకరులు తెల్లమొహం వేశారు. వరదల సమయంలో అసలు విషయాలు వదిలి ఈ సుత్తి ఎందుకంటూ వారు సెటైర్లు వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment