ఎస్.పి గారి డ్యూటీ నేరాలను అరికట్టడం. భూమి మీద చెట్టు చేమా లేకుండా పోయేలా మనిషి వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మించిన నేరం ఉంటుందా? దానినీ అరి కట్టాలి కదా. కామారెడ్డి జిల్లా ఎస్పీగా శ్వేత పనిచేస్తున్న కాలంలో ఒక హరిత వనాన్ని పెంచడం తన కర్తవ్యం అనుకున్నారు. ఆరు ఎకరాల్లో ఎన్నో మొక్కలు నాటించారు. ఇప్పుడది అడవిని తలపిస్తోంది. హరిత రక్షక వనంగా నామకరణం చేసుకుంది.
హరితహారం స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగారు అప్పటి కామారెడ్డి ఎస్పీ శ్వేత. కామారెడ్డిలో ఆరు ఎకరాల స్థలంలో 80 రకాలైనవి ఎన్నో మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు ఆమెతోపాటు పోలీసు సిబ్బంది నిరంతరం శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. మూడేళ్ల కాలంలో ప్రతీ రోజూ ఎస్పీ శ్వేత అక్కడికి వెళ్లేవారు. జరుగుతున ్న పనులను పర్యవేక్షించేవారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ అక్కడే చేసేవారు. ఈ వనానికి ‘హరిత రక్షక వనం’ అని నామకరణం చేశారు.
ఎనభై రకాల మొక్కలు...
స్థానికంగా పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు నాటారు శ్వేత. రామ సీతాఫలం, బాదమ్, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, నేరేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మేడి, మునగ, నిమ్మ, ఉసిరి, వెలగ, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచఉసిరి, జిట్రేగి... మొదలైన రకాలకు సంబంధించి ఎన్నో మొక్కలు నాటారు.ప్రతీ మొక్కకు నీరందించడానికి డ్రిప్ ఏర్పాటు చేశారు. అక్కడ రెండు బోర్లు తవ్వించి వాటి ద్వారా నీటిని అందిస్తున్నారు. ‘హరిత రక్షక వనం’లో రెండు నీటి గుంతలు తవ్వించారు. అందులో నీరు నిల్వ ఉండేలా వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పై భాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను పెంచుతున్నారు. నీటిని నిల్వ చేయడం మూలంగా బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఇబ్బంది లేకుండాపోయింది.
ఆ శ్రమ వృథా పోలేదు...
‘హరిత రక్షక వనం’లో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు శ్రమించారు. ఆ మొక్కలను తమ ఇంటి పెరట్లో నాటిన మొక్కలలాగే చూసుకున్నారు. మొక్కల చుట్టు పెరిగే గడ్డిని తొలగించడం, నీరు మొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం, పనికిరాని చెత్తను తొలగించడంలాంటి పనులెన్నో చేసేవారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తే వారితో మొక్కలు నాటించేవారు. ఆ చెట్లకు వారి పేర్లతో నేమ్‌ప్లేట్లు ఏర్పాటు చేశారు. ‘చెట్లు అంటే....భూమాత రాసిన కవిత్వం’ అనేది భావుకతతో కూడిన మాటే కాదు బాధ్యతను గుర్తుకు తెచ్చే మాట.వృత్తిబాధ్యత, సామాజిక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ పచ్చటి వనాన్ని సృష్టించడం కష్టమేమీ కాదు అని నిరూపిస్తున్నారు శ్వేతలాంటి అధికారులు.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు
శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహరాల్లో బిజీగా ఉంటూనే రకరకాల సామాజిక అంశాలపై స్పందించేవారు శ్వేత. కరోనా కాలంలో పోలీసు సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని కలిగించి ఎంతో మందికి అండగా నిలిచారు. నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించారు. శారీరక« దారుడ్య పరీక్షలకు శిక్షణ ఇప్పించారు.
ఇదీ చదవండి: గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్
అమ్మలాంటి చెట్లు
కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్థలం కనిపించి నాకు వనం పెంచాలన్న ఆలోచన వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు నిర్మించినపుడు అక్కడ వాతావరణం మారిపోతుంది. చల్లబడాలంటే సమాంతరంగా చెట్లు పెంచాలి. అందుకే 2017 దసరా రోజు నేను, అప్పటి కలెక్టర్ సత్యనారాయణ గారు ఇక్కడ మొక్కలు నాటాం. కామారెడ్డికి పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా వాళ్ళతో అక్కడ మొక్కలు నాటించాను. నాటడంతోపాటు మా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ వాటి సంరక్షణకు నిరంతరం శ్రమించారు. అక్కడి ఉసిరి చెట్టు దగ్గర మా అమ్మ ప్రతీ కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. నేను బదిలీ అయినా ఒక అమ్మలా ఆ చెట్టు గుర్తుకొస్తూ ఉంటుంది. – ఎన్. శ్వేత, ఐపీఎస్
ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment