sp swetha reddy
-
‘పిల్లల ఇంటర్నెట్’పై కన్నేయాలి
సాక్షి, హైదరాబాద్: సైబర్‌నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు వినియోగించే సోషల్ మీడియాపై పేరెంట్స్ ప్రత్యేకదృష్టి సారించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఇంటర్నెట్ వినియోగం నాలుగింతలు పెరిగిందని, ఆన్లైన్ మోసాలు కూడా ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. విమెన్‌సేఫ్టీ వింగ్ చేపట్టిన ‘సైబ్హర్’ప్రాజెక్టులో భాగంగా ‘ఆన్లైన్ పోస్టింగుల్లో వాస్తవాలు–అవాస్తవాలు, వేటిని నమ్మాలి‘అనే అంశంపై తెలంగాణ పోలీస్ శాఖ మహిళాభద్రతావిభాగం నిర్వహించిన వెబ్ ఆధారిత చర్చగోష్టిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్పీ ఎం.శ్వేత, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణులు జార్జ్, సి–డాక్ అసోసియేట్ డైరెక్టర్ సీఏఎస్ మూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ భౌతిక ప్రపంచానికి, వర్చువల్ ప్రపంచానికి చాలా వ్యత్యాసముందని, సోషల్ మీడియాలో వచ్చే అంశాలను వాస్తవాలతో బేరీజు వేసుకోకపోతే పిల్లలు, యువత సులువుగా నమ్మి మోసపోయే ప్రమాదముందని అన్నారు. ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిన నేపథ్యంలో కొత్తరకాల నేరాలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ జార్జ్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో బాలసురక్ష, శ్రీ సురక్ష అనే ప్రత్యేక యాప్‌లను రూపొందించామని చెప్పారు. సీఏఎస్ మూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలు అన్నివర్గాలను బాధితులుగా చేస్తున్నాయని, మహిళలు, పిల్లలు వీటి బారిన పడేవారిలో అధికశాతమున్నారని తెలిపారు. మహిళాభద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతిæ లక్రా, డీఐజీ సుమతి ఈ కార్యక్రమాన్ని సైబ్‌హర్‌లో భాగంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం! విదేశీ భర్తల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఎన్ఆర్ఐ సెల్‌కు ఇప్పటిదాకా 101 ఫిర్యాదులు రాగా అందు లో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసుల్లో లుకవుట్ నోటీసులు జారీ చేశారు. 44 కేసుల్లో నిందితులను ఇండియాకు రప్పించేలా వారు పనిచేసే కం పెనీలకు లేఖలు రాశారు. కరోనా కాలంలో గృహహింసను తగ్గించేందుకు పలు భాషల్లో ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. తాజాగా పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన సైబర్ ప్రపంచాన్ని అందించేందుకు నెలపాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
భిక్కనూరు: ప్రతీ ఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ శ్వేత అన్నారు. గురువారం వేకువజామున భిక్కనూరు మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్రావ్, భిక్షపతి, ఎస్సైలు రాజుగౌడ్, రవిగౌడ్, సంతోష్‌కుమార్, కృష్ణమూర్తి, నరేందర్, శోభన్‌బాబు, సురేశ్‌తోపాటు 75 మంది సిబ్బంది కార్డన్ సర్చ్‌లో పాల్గొన్నారు. ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురి ఆధార్ కార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని గ్రామాలు, వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు జరగవని, ఒకవేళ జరిగితే దొంగలు సులువుగా చిక్కుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహారెడ్డికి పలు సూచనలు చేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, ఉన్నవాటిని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. -
వారి సేవలు అభినందనీయం
► విశ్రాంత ఉద్యోగులకు ఎస్పీ శ్వేతారెడ్డి కితాబు ► ఇండోర్ క్రీడల పరికరాలు ప్రారంభం కామారెడ్డి క్రైం(కామారెడ్డి) : కామారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం జిల్లా కలెక్టర్‌తో అందించిన యోగా, వెల్నెస్ కేం ద్రం, ఇండోర్ క్రీడా పరికరాలైన టేబుల్ టెన్నిస్, మల్టీజిమ్, సిట్అప్ చైర్లను ఎస్పీ శ్వేతారెడ్డి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే కుటుంబ స్నేహిత్ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి విశ్రాంత ఉద్యోగులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం 2007 చట్టంపై విస్తృత ప్రచారం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఎస్పీ కే.ప్రసన్నరాణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి వెంకటి, గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, ప్రతినిధులు సాయాగౌడ్, యాదగిరి, నర్సయ్య, గంగాగౌడ్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.