హైదరాబాద్: ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టనున్న 'హరిత హారం' కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రెండు వారాల పాటు నిరాటంకంగా కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీల్లో సిద్ధంగా ఉన్న 46 కోట్ల మొక్కలను నాటనున్నారు. అన్ని శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విజయవాడ హైవే మీద 2 గంటల్లో..
ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో విజయవాడ హైవే పక్కన 163 కిలోమీటర్ల మేర కేవలం 2 గంటల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ప్రణాళికలు తయారు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ నుంచి తెలంగాణ సరిహద్ధుగా ఉన్న నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా లక్షన్నరకు పైగా మొక్కలు నాటనున్నారు. కాగా ఒకేసారి లక్ష మంది 163 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం కూడా ఓ రికార్డేనని సీఎం కార్యాలయం పేర్కొంది.
రాజధానికి 10కోట్ల మొక్కలు లక్ష్యం
కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐదేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో 7 కోట్లు, జీహెచ్‌ఎంసీలో 3కోట్లు పెంచే లక్ష్యంలో భాగంగా ఈ నెల 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది కూడా ఓ రికార్డుగా నిలిచిపోనుంది.
హరిత హారం ఎందుకంటే..
పర్యావరణ సమతుల్యత కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ దేశంలో ప్రస్తుతం 22 శాతం, తెలంగాణలో 24 శాతం భూభాగమే అడవులు, పచ్చదనంతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు నిరుడు 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినప్పటికీ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 15 కోట్లకు మించలేదు. నాటిన మొక్కల్లో 60 శాతం కూడా మనలేదు. దీంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 46కోట్ల మొక్కలను నాటి వచ్చే యేటికి లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు.
46 కోట్ల మొక్కలు లక్ష్యంగా 'హరిత హారం'
Published Thu, Jul 7 2016 7:24 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement