ఆకుపచ్చగా.. అద్భుతంగా.. | with Haritha haram will creat green Telangana: CM KCR | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చగా.. అద్భుతంగా..

Published Sat, Jul 9 2016 2:46 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఆకుపచ్చగా.. అద్భుతంగా.. - Sakshi

ఆకుపచ్చగా.. అద్భుతంగా..

- తెలంగాణను మలచుకుందాం: సీఎం కేసీఆర్

- ఈ యజ్ఞం ప్రజా ఉద్యమంగా మారాలి

- చెట్లను పెంచ డమంటే మనల్ని మనం బాగుచేసుకోవడమే

- వనం ఎంత పెంచితే అంత వానలొస్తాయి

- వానలు వాపస్ రావాలి.. కోతులు వాపస్ పోవాలి

- ఈ రెండు వారాలూ అందరం కష్టపడదాం

- ప్రతి బడి ఆకుపచ్చని ఒడి కావాలి.. ఉపాధ్యాయులు

- దీక్షాదక్షులై విద్యార్థులతో లక్షల మొక్కలు నాటించాలి

- చౌటుప్పల్ మార్కెట్‌లో కదంబం మొక్క నాటిన కేసీఆర్

- గుండ్రాంపల్లిలో ‘తెలంగాణకు హరితహారం’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తెలంగాణ జాతి చాలా గొప్పది. పోరాట పటిమ గల జాతి మనది. పట్టుబడితే, జట్టుకడితే ఏం జరుగుతుందో దేశానికి, ప్రపంచానికి చెప్పిన జాతి మనది. మనం కంకణం కడితే ప్రపంచంలోనే ఆకుపచ్చ తెలంగాణ.. అద్భుత తెలంగాణను తయారుచేయవచ్చు. నల్లగొండ నుంచి ప్రారంభమైన ఈ హరిత యజ్ఞం మహాయజ్ఞంలా సాగాలి. ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ మొత్తం పచ్చబడాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో సీఎం నూతన గోదాములను ప్రారంభించి, తన జాతకరీత్యా కదంబం మొక్కను నాటారు. అనంతరం చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన మొక్కను నాటి ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

 

విచక్షణారహితంగా అడవులు నరకడం వల్ల చాలా నష్టపోయాం. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై తెలంగాణను పచ్చగా చేసే యజ్ఞంలో పాలుపంచుకోవాలి. చెట్లను పెంచడమంటే మనల్ని మనమే బాగు చేసుకోవడమే. వనం ఎంత పెంచితే వానలు అంత కురుస్తాయి. ఇప్పటికే తెలంగాణలో కరెంటు సమస్య పోయింది. మళ్లీ ఆ సమస్య రాదు. ఇప్పుడు కడుపు నిండా కరెంటు వస్తోంది. మిషన్ భగీరథ ద్వారా కడుపు నిండా తాగునీళ్లిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన చెరువులు నింపే కార్యక్రమాన్ని వారి పేరు మీదనే చేపట్టి కడుపు నిండా సాగునీరందిస్తున్నాం. పేదల సంక్షేమం చూసుకుంటున్నాం. అన్ని రకాల అంశాలపై పనిచేస్తున్నాం. ఇక ఆకుపచ్చ తెలంగాణ అయితే కడుపు నిండా.. తనివి తీరా వర్షాలు వస్తాయి. అడవి దగ్గరున్న చెరువులు నిండుతున్నాయి. వాగులు, వంకలు, పొర్లుతున్నాయి. అక్కడే ఎక్కువ వానలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని తెలిసిన వాళ్లు తెలియని వాళ్లకు చెప్పాలి. కవులు కవితలు రాయాలి. గాయకులు పాటలు రాసి పాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. విద్యార్థి నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ రెండు వారాల పాటు 24 గంటలు కష్టపడి చెట్లను పెంచాలి. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె.. ప్రతి బడి ఒక ఆకుపచ్చని ఒడి కావాలి. ఉపాధ్యాయులు దీక్షాదక్షులై విద్యార్థులకు పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యం గురించి చెప్పి వారి చేత వేల, లక్షల మొక్కలు నాటించాలి.

 

కోతులు వస్తున్నాయంటే తప్పు మనదే..

నేను ఎక్కడికి వెళ్లినా కోతుల బారి నుంచి రక్షించాలంటూ రైతులు దరఖాస్తులిస్తున్నారు. కోతులు అడవిని వదిలి ఊర్లోకి వస్తున్నాయంటే ఆ తప్పు కోతులది కాదు.. మనదే. మనం అడవుల్లోకి వెళ్లి కోతులను పొర్లుపొర్లు చేసినం. అందుకే అవి ఊర్లోకి వచ్చి మనల్ని పొర్లుపొర్లు చేస్తున్నయ్. మనం కోతుల్ని కొట్టం. అంజన్న కాబట్టి కొట్టం..చంపం. గతంలో యాదగిరిగుట్టకు, పుణ్యక్షేత్రాలకు పోతే కోతులు కనబడేవి. కోతులాడిచ్చెటోళ్లు వచ్చినప్పుడు ఊర్లో కోతులు కనపడేవి. కానీ ఇప్పుడు కోతుల్ని పట్టుకపోయే వాళ్లని పంపాలని రైతులు అడుగుతున్నరు. అందుకు కారణం అడవులు తగ్గిపోవడమే. హరితహారంలో సామాజిక అడవుల పెంపకాన్ని ఉధృతం చేయడం ద్వారా మళ్లీ కోతులను అడవుల్లోకి వాపస్ పంపాలి. వానలు కొనుక్కుంటే వచ్చేవి కావు. ఇన్ని కోట్లు పెడితే వానలు కొనుక్కోవచ్చని ఎవరైనా చెబితే కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా. వర్షాలను డబ్బులు పెట్టి కొనుక్కోలేమన్న విజ్ఞత అందరికీ రావాలి.

 

నాటిన మొక్కలన్నింటినీ బతికించాలి..

హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన కార్యక్రమం ఎంతో సాహసంతో కూడుకున్నది. జాతీయ రహదారి వెంట ఏకకాలంలో లక్ష మొక్కలను నాటడం సాధ్యం కాదు. ఇందులో ఎన్నో ప్రయాసలుంటాయి. ఏ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామో అదే ఉత్సాహంతో పదిరోజుల పాటు కష్టపడి ఈ మొక్కలన్నింటినీ బతికించాలి. ఒక్క మొక్కను కూడా చనిపోకుండా చూసుకుని 100 శాతం బతికించడం ద్వారా పచ్చదనంలో నల్లగొండను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టాలి. నల్లగొండ జిల్లాలో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది.

 

నల్లగొండకు రూ.350 కోట్లు

సీఎం కేసీఆర్ మరోమారు నల్లగొండ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల రైతులకు సాగునీరందించే పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలను పూర్తి చేసేందుకు రూ.350 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికపై నుంచి ప్రకటించారు. వెంటనే అధికారులు పనులు ప్రారంభించి ఈ సీజన్‌లోనే రైతులకు నీరందించే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు చౌటుప్పల్‌లో రూ.3 కోట్లతో నిర్మించ తలపెట్టిన 5 వేల టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ కమిటీ గోదాంను ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో గుండ్రాంపల్లికి వచ్చారు. చౌటుప్పల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చౌటుప్పల్ మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సీఎంకు వినతి పత్రం అందజేశారు. గుండ్రాంపల్లి సభలో సీఎం మాట్లాడుతుండగా.. హౌజింగ్ శాఖలో ఉద్యోగాలు కోల్పోయిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తమకు ఉపాధి కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

 

హెలికాప్టర్‌లో బయలుదేరగానే వర్షం

గుండ్రాంపల్లిలో కార్యక్రమం అనంతరం జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే ప్రజలకు అభివాదం చేసేందుకు కోదాడ మండలం నల్లబండగూడెం వరకు సీఎం హెలికాప్టర్‌లో బయలుదేరారు. కానీ హెలికాప్టర్ బయలుదేరిన వెంటనే పెద్ద వర్షం రావడంతో మూడు నిమిషాల్లోనే నార్కట్‌పల్లి నుంచి వెనక్కు తిరిగి వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో సీఎం రాక కోసం జాతీయ రహదారి పొడవునా 120 కిలోమీటర్ల మేర వేచి ఉన్న విద్యార్థులు, ప్రజలు నిరాశకు గురయ్యారు. సీఎం పర్యటనలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కరరావు, తీగల కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, డీఐజీ అకున్ సభర్వాల్, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

కేసీఆర్ రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్: మంత్రి జగదీశ్‌రెడ్డి

గుండ్రాంపల్లి బహిరంగ సభలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్‌లా పనిచేస్తున్నారన్నారు. 60 ఏళ్ల నష్టాన్ని పూడ్చడంతో పాటు రాబోయే 100 ఏళ్ల అభివృద్ధికి పునాదులను వేసేందుకు సీఎం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement