
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అసైన్డ్ భూములను లాక్కోవట్లేదని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ అంశంపై ఈ మేరకు విపక్షాలు ఆరోపించగా వాటిలో వాస్తవం లేదని మంత్రి తోసిపుచ్చారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం రూ.70 లక్షల నుంచి రూ.కోటి పరిహారాన్ని రైతులకు ఇచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తేనే తీసుకుంటున్నామని చెప్పారు.
సాగుకు యోగ్యంకాని అసైన్డ్ భూములనే తీసుకుంటున్నామన్నారు. కాగా, ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఓ బీజేపీ ఎంపీ ఇటీవల ప్రధాని మోదీని కలిశారని, ఇది ఆ పార్టీ విధానామా? లేక ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమో చెప్పాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన తీరును తప్పుబట్టారు. ఒకవేళ ఈ చర్య ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని, లేకుంటే బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment