land acquisition policy
-
ప్రగతి పేరుతో భూసేకరణ.. పేద రైతులే టార్గెట్!
ఈమధ్య దక్షిణ కొరియాకు చెందిన షూ ఆల్స్ కంపెనీ తాము ఇక్కడ 300 కోట్లతో షూ కంపెనీ పెడతామనీ, అందుకు కావలసిన 750 ఎకరాల భూమి ఇస్తే 87 వేల మందికి ఉపాధి కల్పిస్తామనీ ప్రగల్బాలు పలికింది. తెలంగాణలో ఎకరం కోటి రూపాయలనుకున్నా 300 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల విలువైన భూమి అడిగారన్నమాట. అదే విధంగా ఒక స్మార్ట్ హెల్త్ సిటీ పెట్టడానికి 5,000 ఎకరాలు కావాలని అర్జీ పెట్టింది ఇదే కంపెనీ. దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ కేవలం 5–10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. ఇది ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్లు ఉంది. ఇక ఈ మధ్య ప్రగతి పేరుతో భూసేకరణ చేయడం పేద, మధ్య తరగతి రైతుల పట్ల ఉరితాడులా పరిణమించింది.భూమి ధరలు పెరగటంతో చిన్న, సన్న కారు రైతులు ధనవంతులు అయ్యే సమయానికి, ప్రభుత్వమే భూ దోపిడీకి పాల్పడి ప్రజలను దారిద్య్రంలోకి నెడుతోంది. ఉన్నోడికి రవ్వంత పోయినా కొండంత లాభం వస్తే, లేనోడు రోడ్డున పడుతున్నాడు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే పరిహారం, కనీసం గుంట ప్లాట్ కొనుక్కోవడానికి సరిపోవడం లేదు. ప్రగతి వలన భూముల విలువ పెరిగి వందల, వేల ఎకరాలు ఉన్న వారు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. ఒకసారి మార్కెట్ విలువ, ప్రభుత్వ పరిహారం విశ్లేషిస్తే... చౌటుప్పల్ దగ్గర ఎకరం 2 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 10 లక్షలు; జహీరాబాద్ దగ్గర 1.5 నుండి 2 కోట్లు ఎకరానికి ధర ఉంటే 7–10 లక్షలు మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వం భూస్వామిగా కాకుండా, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) సేకరించిన భూమి ఎంత, అందులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటి వలన ఎంతమందికి ఉపాధి కల్గుతుంది వంటి వివరాలతో ఒక శ్వేతపత్రం (వైట్ పేపర్) విడు దల చేయాలి. కొత్తగా సేకరించే భూమి... పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల కొరకా లేదా పూర్తిగా ప్రజా అవసరాల కొరకా అనేది స్పష్టం చేయాలి. గతంలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూమిలో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తేల్చాలి. ఇప్పటికే వివిధ సంస్థలు, వ్యక్తులు లేదా ట్రస్టులకు వివిధ ఉద్దేశాలతో కేటాయించిన భూమిలో వేరే వ్యాపారాలు, సంస్థలు నెలకొన్నా యేమో చూడాలి. భూములు సేకరించే ముందు, నిర్వాసితులు అవుతున్న ప్రజల, రైతుల ప్రయోజనాలనే ముఖ్యంగా ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. ఆ భూముల వలన వచ్చే ప్రయోజనాలలో నిర్వాసితులకు సింహభాగం దక్కాలి. ఒక ప్రాజెక్ట్ లేదా రోడ్డు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలలో భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి, నిర్వాసితులకు కూడా ఆ లాభం దక్కేలా చూడాలి.ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని మొదట ఉపయోగించిన తర్వాత, కొత్త భూ సేకరణకు శ్రీకారం చుట్టాలి. అలాగే ఒక ప్రాజెక్టులో కేవలం ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న రైతు సర్వం కోల్పోతే వారు రోడ్డున పడతారని గమనించాలి. అదే ఎక్కువ భూమి ఉన్నవారు కొంత పోయినా, మిగతా భూమి విలువ పెరగటం వలన వారికి లాభం కలుగుతుంది. అందువల్ల భూమిని కోల్పోయేవారు ఒక్కొక్కరు ఎంతెంత శాతం భూమిని కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రాతిపదికన పరిహార చెల్లింపు ఉండాలి.ప్రాజెక్టులలో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 6,690 కోట్లు. ఇందులో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి 5,500 ఎకరాలు. రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే. రోడ్డుకు అటు, ఇటు ఉన్న రైతుల భూముల విలువ లక్షల కోట్లకు పెరిగింది. కాంట్రాక్టర్ లాభపడ్డాడు. ప్రభుత్వం 7,300 కోట్లకు అంటే ఏడాదికి 240 కోట్లకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై సంవత్సరానికి రూ. 550 కోట్ల రాబడి ఉంది. మున్ముందు అది ఏడాదికి రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే రిజిస్ట్రేషన్ విలువ ఇచ్చి, మార్కెట్ విలువ ప్రకారం ఆ కంపెనీలో నిర్వాసితులకు షేర్ ఇచ్చి ఉంటే, వచ్చే 30 సంవత్సరాలు నిర్వాసిత రైతులకు నెలకు కొంత పరిహారం అందేది. అలానే పారిశ్రామిక వాడలు, కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు నిర్వాసిత రైతులకు భూమి మార్కెట్ విలువ ప్రకారం షేర్ ఇవ్వడం వలన వారు కూడా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు ఉన్న కంపెనీల దగ్గర నుండి భూమిని సేకరించి వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడం వలన ఎవ్వరికీ నష్టం లేకుండా ప్రగతి సాగుతుంది. అలానే వారికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ లే ఔట్లలో ప్లాట్ కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక వెసులుబాట్లు, స్వయం ఉపాధికి లోన్లు... అవీ వడ్డీ రహిత రుణాలు అందించడం; ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా కేటాయించడం... ఇలా పలు విధాలుగా భూ నిర్వాసితులకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. చదవండి: మంచి పనిని కించపరుస్తారా?బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టీడీఆర్) లాంటివి ఇవ్వడం వలన వారికి అధికంగా ఆర్థిక సుస్థిరత కలుగుతుంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు, టీడీఆర్ ఇవ్వడం తెలిసిందే. అదే విధంగా భూ నిర్వాసిత కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువను కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా టీడీఆర్ ఇవ్వడం వలన వారికి లబ్ధి జరుగుతుంది. ఉదారణకు ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కొరకు దాదాపు 9,000 ఎకరాలు కావాలి. ప్రస్తుతం ఏరియాను బట్టి మార్కెట్ విలువ ఎకరం రూ. 50 లక్షల నుండి రూ. 3 కోట్ల వరకు ఉంది. కానీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వేల్యూ మీదనే పరిహారం చెల్లిస్తుంది. దీని వలన రైతులు, ముఖ్యంగా సర్వం కోల్పోయే చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్ట పోతారు. వారికి పరిహారమే కాకుండా, టీడీఆర్ కూడా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది.చదవండి: కులరహిత వ్యవస్థకు తొలి అడుగుచాలా సందర్భాలలో చిన్న, సన్న కారు రైతులు, ముఖ్యంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నారు. వివిధ కంపెనీల పేరు మీద వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. కేవలం పేద రైతులే టార్గెట్ కావడం బాధకారం. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీ -
మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి
-
మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : 123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా నిమ్జ్ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు 190 అనుబంధ జీవో కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. పరిశ్రమలు వచ్చేంతవరకూ బలవంతంగా రైతులను, నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు... ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భూసేకరణపై కౌంటర్ వేయండి
రాజధాని వ్యవహారంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశం న్యూఢిల్లీ: ఏపీ కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ విధానం లోపభూయిష్టంగా ఉందని, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేపట్టలేదని దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. పి.శ్రీమన్నారాయణ, ఎ.కమలాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యు.డి.సాల్వీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పిటిషన్ తరఫు న్యాయవాదులు పారుల్ గుప్తా, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన రాజధాని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉందని, ఇది తీవ్రమైన వరద ముప్పు ఉన్న ప్రాంతమని, అనుకోని సంఘటన జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కోసం ప్రత్యామ్నాయాలు సూచించేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీ వేసిందని, ఆ కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. భూ స్వాధీనంపై స్టే ఇవ్వాలని కోరారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో సామాజిక, పర్యావరణ ప్రభావిత అధ్యయనం చేపట్టేలా ఆదేశించాలని కోరారు. బెంచ్‌లోని సాంకేతిక నిపుణుల రంగానికి చెందిన ఇద్దరు సభ్యులు జోక్యం చేసుకుంటూ ఇంకా నిర్మాణాలు జరగలేదన్నారు.వాదనలు పూర్తయిన తరువాత బెంచ్ ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర పర్యావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర జలవనరుల శాఖలకు ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27న చేపట్టనున్నట్టు పేర్కొంది. -
మరిన్ని సంస్కరణలకు రెడీ..
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. ప్రధానంగా కార్మిక, భూసేకరణ, బీమా చట్టాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామన్నారు. అంతేకాకుండా నష్టాల్లోకూరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లను ప్రైవేటీకరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. బుధవారమిక్కడ భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ‘సంస్కరణలను జాగ్రత్తగా దీర్ఘకాలిక దృక్పథంతో చేపట్టాలితప్ప... ఏదో ఒకట్రెండు సంచలనాత్మక ఐడియాలతో సరిపెడితే ఉపయోగం ఉండదు’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. పాత కేసులకూ పన్నులు వర్తించేలా పన్ను చట్టాల్లో సవరణల(రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతిందని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు తెరవడం ఎంతముఖ్యమో... పాలసీ, పన్ను విధానాల్లో స్థిరత్వం కూడా భారత్‌కు చాలా అవసరమని జైట్లీ చెప్పారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంస్కరణల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డీజిల్‌పై నియంత్రణల తొలగింపు, రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు, రైల్వేలు, రక్షణ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరవడం వంటివి ఉన్నాయి. చట్టాల్లో అసంబద్ధ నిబంధనలకు చెల్లు... తాము ప్రతిపాదించిన కొన్ని కార్మిక సంస్కరణలపై రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక భూసేకరణ చట్టంలో కొన్ని అసంబద్ధమైన నిబంధనలు ఉన్నాయని వీటిని మార్చడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు అమోదం పొందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. సబ్సిడీలన్నీ తొలగించలేం: ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌పై నియంత్రణలను ఎత్తివేశామని.. ఇతర సబ్సిడీల హేతుబద్దీకరణ కోసం వ్యయాల నిర్వహణ కమిషన్‌ను నియమించినట్లు జైట్లీ పేర్కొన్నారు. అయితే, దేశంలో కొన్ని వర్గాల ప్రజలకు ఎప్పటికీ ప్రభుత్వ చేయూత అవసరమవుతూనే ఉంటుందని.. అందువల్ల సబ్సిడీలను పూర్తిగా తొలగించలేమన్నారు. గత కుంభకోణాలపై... గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ఇదోపెద్ద ప్రహసనం. మేం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాం. గాడిలోపెట్టేందుకు చాలా సమయం పడుతుంది. అవినీతి, క్రోనీ క్యాపిటలిజం(రాజకీయ నాయకులు కార్పొరేట్ల కుమ్మక్కుతో జరిగే పెట్టుబడిదారీ విధానం) వంటివాటికి అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వ ఆలోచనాధోరణిలో మార్పు రావాలి. స్పెక్ట్రం, బొగ్గు గనుల వంటి సహజవనరుల కేటాయింపుల కుంభకోణాలకు క్రోనీ క్యాపిటలిజమే కారణం. దీన్ని రూపుమపేందుకు ప్రయత్నిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బొగ్గు బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు మేం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చాం. పాలనలో నిజాయితీ, పారదర్శకత కోసమే ఈ చర్యలు’ అని జైట్లీ వివరించారు. అడ్డంకులు తొలగాలి: కార్పొరేట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకోవాలంటే మోదీ సర్కారు పాలసీపరమైన అడ్డంకులను తొలగించడంతోపాటు మరిన్ని కీలక సంస్కరణలను అమల్లోకి తీసురావాలని కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు తరలిరావాలంటే డీరెగ్యులేషన్, వాణిజ్య సరళీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి కీలకమైనవని జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ చైర్మన్ యోరిహికో కోజిమా చెప్పారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఒక్కసారి పట్టాలెక్కితే.. వృద్ధి కూడా గాడిలోపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని సంస్కరణలు ఆరంభస్థాయిలోనివేనని... భారీ సంస్కరణలు రావాల్సి ఉందని ప్రపంచ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు మహీంద్రా పేర్కొన్నారు.