మరిన్ని సంస్కరణలకు రెడీ..
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. ప్రధానంగా కార్మిక, భూసేకరణ, బీమా చట్టాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామన్నారు. అంతేకాకుండా నష్టాల్లోకూరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లను ప్రైవేటీకరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
బుధవారమిక్కడ భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ‘సంస్కరణలను జాగ్రత్తగా దీర్ఘకాలిక దృక్పథంతో చేపట్టాలితప్ప... ఏదో ఒకట్రెండు సంచలనాత్మక ఐడియాలతో సరిపెడితే ఉపయోగం ఉండదు’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.
పాత కేసులకూ పన్నులు వర్తించేలా పన్ను చట్టాల్లో సవరణల(రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతిందని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు తెరవడం ఎంతముఖ్యమో... పాలసీ, పన్ను విధానాల్లో స్థిరత్వం కూడా భారత్‌కు చాలా అవసరమని జైట్లీ చెప్పారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంస్కరణల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డీజిల్‌పై నియంత్రణల తొలగింపు, రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు, రైల్వేలు, రక్షణ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరవడం వంటివి ఉన్నాయి.
చట్టాల్లో అసంబద్ధ నిబంధనలకు చెల్లు...
తాము ప్రతిపాదించిన కొన్ని కార్మిక సంస్కరణలపై రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక భూసేకరణ చట్టంలో కొన్ని అసంబద్ధమైన నిబంధనలు ఉన్నాయని వీటిని మార్చడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు అమోదం పొందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
సబ్సిడీలన్నీ తొలగించలేం: ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌పై నియంత్రణలను ఎత్తివేశామని.. ఇతర సబ్సిడీల హేతుబద్దీకరణ కోసం వ్యయాల నిర్వహణ కమిషన్‌ను నియమించినట్లు జైట్లీ పేర్కొన్నారు. అయితే, దేశంలో కొన్ని వర్గాల ప్రజలకు ఎప్పటికీ ప్రభుత్వ చేయూత అవసరమవుతూనే ఉంటుందని.. అందువల్ల సబ్సిడీలను పూర్తిగా తొలగించలేమన్నారు.
గత కుంభకోణాలపై...
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ఇదోపెద్ద ప్రహసనం. మేం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాం. గాడిలోపెట్టేందుకు చాలా సమయం పడుతుంది. అవినీతి, క్రోనీ క్యాపిటలిజం(రాజకీయ నాయకులు కార్పొరేట్ల కుమ్మక్కుతో జరిగే పెట్టుబడిదారీ విధానం) వంటివాటికి అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వ ఆలోచనాధోరణిలో మార్పు రావాలి.
స్పెక్ట్రం, బొగ్గు గనుల వంటి సహజవనరుల కేటాయింపుల కుంభకోణాలకు క్రోనీ క్యాపిటలిజమే కారణం. దీన్ని రూపుమపేందుకు ప్రయత్నిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బొగ్గు బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు మేం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చాం. పాలనలో నిజాయితీ, పారదర్శకత కోసమే ఈ చర్యలు’ అని జైట్లీ వివరించారు.
అడ్డంకులు తొలగాలి: కార్పొరేట్లు
ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకోవాలంటే మోదీ సర్కారు పాలసీపరమైన అడ్డంకులను తొలగించడంతోపాటు మరిన్ని కీలక సంస్కరణలను అమల్లోకి తీసురావాలని కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు తరలిరావాలంటే డీరెగ్యులేషన్, వాణిజ్య సరళీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి కీలకమైనవని జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ చైర్మన్ యోరిహికో కోజిమా చెప్పారు.
ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఒక్కసారి పట్టాలెక్కితే.. వృద్ధి కూడా గాడిలోపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని సంస్కరణలు ఆరంభస్థాయిలోనివేనని... భారీ సంస్కరణలు రావాల్సి ఉందని ప్రపంచ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు మహీంద్రా పేర్కొన్నారు.