India Economic Summit
-
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
కేంద్రం, రాష్ట్రాలూ కలసి పనిచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని వృద్ధి పథంలోకి తీసుకురావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఎకనమిక్ సమ్మిట్–2017’లో భాగంగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఆహార వ్యవస్థను అభివృద్ధి పరచడం’ అనే అంశంపై ప్రసంగించారు. మంచి విధానాల్ని రూపొందించడం, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేసినప్పుడు వ్యవసాయం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాన్ని వృద్ధి పథంలోకి తేవొచ్చని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఈ రంగానికి వాణిజ్యపరమైన యోగ్యతను జోడించాలి. ప్రభుత్వాలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అందరూ ఇందులో భాగస్వాములవ్వాలి..’’ అని పేర్కొన్నారు. మధ్యతరహా, భారీ తరహా ఫుడ్పార్క్లు స్థాపించాల్సిన అవసరముందని సూచించారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దానిని అందిపుచ్చుకోవా లన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో 27.7 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు వీలుగా, నిరుపేదలకు ఆహార భద్రత ఉండేందుకు వీలుగా మన వ్యూహాలుండాలన్నారు. ప్రజల ఆహార అభిరుచులు మారుతున్నాయని, పండ్లు, పాల ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని తెలిపారు. సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం.ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమను వృద్ధి చేస్తున్నాం. ఇలాంటి వేదికల ద్వారా సాంకేతికతను అందిపుచ్చుకుం టున్నాం. నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉండే సాంకేతిక సంస్థలతో కలసి విశాఖలో సెమినార్ నిర్వహిస్తున్నాం. దానికి బిల్‌గేట్స్ వస్తున్నారు.’’ అని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశ మయ్యారు. ఇందులో హెచ్ఎండీ గ్లోబల్ హెడ్ అజేయ్ మెహతా, ఆటో గ్రిడ్ ఫౌండర్ అమిత్ నారాయణ, ఏషియన్ పెయింట్స్ ప్రతినిధి కేబీఎస్ ఆనంద్, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ తదితరులున్నారు. రాష్ట్రంలో వ్యవసాయో త్పత్తులు, అనుబంధ పరిశ్రమలు, పవర్‌గ్రిడ్, మొబైల్ తయారీ పరిశ్రమల ఏర్పాటుపై వారితో చర్చించారు. -
ఆర్థిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభించిన శ్రీలంక ప్రధాని
న్యూఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న భారత ఆర్ధిక శిఖరాగ్ర సదస్పును శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ప్రాంతీయ ఆర్థిక సమగ్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. భారతదేశంలోని నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారుల ఇబ్బందులు, అంకుర పరిశ్రమలపై చర్చించనున్నారు. వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు వివిధ రంగాల ప్రముఖులు 500 మంది రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు. -
మరిన్ని సంస్కరణలకు రెడీ..
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. ప్రధానంగా కార్మిక, భూసేకరణ, బీమా చట్టాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామన్నారు. అంతేకాకుండా నష్టాల్లోకూరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లను ప్రైవేటీకరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. బుధవారమిక్కడ భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ‘సంస్కరణలను జాగ్రత్తగా దీర్ఘకాలిక దృక్పథంతో చేపట్టాలితప్ప... ఏదో ఒకట్రెండు సంచలనాత్మక ఐడియాలతో సరిపెడితే ఉపయోగం ఉండదు’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. పాత కేసులకూ పన్నులు వర్తించేలా పన్ను చట్టాల్లో సవరణల(రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతిందని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు తెరవడం ఎంతముఖ్యమో... పాలసీ, పన్ను విధానాల్లో స్థిరత్వం కూడా భారత్‌కు చాలా అవసరమని జైట్లీ చెప్పారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంస్కరణల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డీజిల్‌పై నియంత్రణల తొలగింపు, రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు, రైల్వేలు, రక్షణ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరవడం వంటివి ఉన్నాయి. చట్టాల్లో అసంబద్ధ నిబంధనలకు చెల్లు... తాము ప్రతిపాదించిన కొన్ని కార్మిక సంస్కరణలపై రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్లు కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక భూసేకరణ చట్టంలో కొన్ని అసంబద్ధమైన నిబంధనలు ఉన్నాయని వీటిని మార్చడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు అమోదం పొందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. సబ్సిడీలన్నీ తొలగించలేం: ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌పై నియంత్రణలను ఎత్తివేశామని.. ఇతర సబ్సిడీల హేతుబద్దీకరణ కోసం వ్యయాల నిర్వహణ కమిషన్‌ను నియమించినట్లు జైట్లీ పేర్కొన్నారు. అయితే, దేశంలో కొన్ని వర్గాల ప్రజలకు ఎప్పటికీ ప్రభుత్వ చేయూత అవసరమవుతూనే ఉంటుందని.. అందువల్ల సబ్సిడీలను పూర్తిగా తొలగించలేమన్నారు. గత కుంభకోణాలపై... గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ఇదోపెద్ద ప్రహసనం. మేం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాం. గాడిలోపెట్టేందుకు చాలా సమయం పడుతుంది. అవినీతి, క్రోనీ క్యాపిటలిజం(రాజకీయ నాయకులు కార్పొరేట్ల కుమ్మక్కుతో జరిగే పెట్టుబడిదారీ విధానం) వంటివాటికి అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వ ఆలోచనాధోరణిలో మార్పు రావాలి. స్పెక్ట్రం, బొగ్గు గనుల వంటి సహజవనరుల కేటాయింపుల కుంభకోణాలకు క్రోనీ క్యాపిటలిజమే కారణం. దీన్ని రూపుమపేందుకు ప్రయత్నిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బొగ్గు బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు మేం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చాం. పాలనలో నిజాయితీ, పారదర్శకత కోసమే ఈ చర్యలు’ అని జైట్లీ వివరించారు. అడ్డంకులు తొలగాలి: కార్పొరేట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకోవాలంటే మోదీ సర్కారు పాలసీపరమైన అడ్డంకులను తొలగించడంతోపాటు మరిన్ని కీలక సంస్కరణలను అమల్లోకి తీసురావాలని కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు తరలిరావాలంటే డీరెగ్యులేషన్, వాణిజ్య సరళీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి కీలకమైనవని జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ చైర్మన్ యోరిహికో కోజిమా చెప్పారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఒక్కసారి పట్టాలెక్కితే.. వృద్ధి కూడా గాడిలోపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని సంస్కరణలు ఆరంభస్థాయిలోనివేనని... భారీ సంస్కరణలు రావాల్సి ఉందని ప్రపంచ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు మహీంద్రా పేర్కొన్నారు.