
భూసేకరణపై కౌంటర్ వేయండి
రాజధాని వ్యవహారంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశం
న్యూఢిల్లీ: ఏపీ కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ విధానం లోపభూయిష్టంగా ఉందని, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేపట్టలేదని దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. పి.శ్రీమన్నారాయణ, ఎ.కమలాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యు.డి.సాల్వీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పిటిషన్ తరఫు న్యాయవాదులు పారుల్ గుప్తా, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన రాజధాని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉందని, ఇది తీవ్రమైన వరద ముప్పు ఉన్న ప్రాంతమని, అనుకోని సంఘటన జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కోసం ప్రత్యామ్నాయాలు సూచించేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీ వేసిందని, ఆ కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. భూ స్వాధీనంపై స్టే ఇవ్వాలని కోరారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో సామాజిక, పర్యావరణ ప్రభావిత అధ్యయనం చేపట్టేలా ఆదేశించాలని కోరారు. బెంచ్‌లోని సాంకేతిక నిపుణుల రంగానికి చెందిన ఇద్దరు సభ్యులు జోక్యం చేసుకుంటూ ఇంకా నిర్మాణాలు జరగలేదన్నారు.వాదనలు పూర్తయిన తరువాత బెంచ్ ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర పర్యావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఆర్‌డీఏ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర జలవనరుల శాఖలకు ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27న చేపట్టనున్నట్టు పేర్కొంది.